Sansad Adarsh Gram Yojana
-
మోదీ స్కీమ్‌పై బీజేపీ ఎంపీల నిరాసక్తత
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ 2014 ఆగస్ట్ 15న ప్రకటించిన సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజనను అందిపుచ్చుకోవడంలో బీజేపీ ఎంపీలే అశ్రద్ధ వహించారు. కేవలం 19 శాతం మంది ఎంపీలే ఈ పథకం కింద మూడు గ్రామాలను గుర్తించారు. మార్చి 2019 నాటికి ఎంపీలందరూ మూడు ఆదర్శ గ్రామాలను అభివృద్ధి చేయాలని ప్రధాని ప్రతి ఎంపీనీ కోరారు. అయితే 88 శాతం ఎంపీలు పథకం కింద కేవలం ఒక గ్రామానే ఎంపిక చేసుకోగా, 59 శాతం మంది ఎంపీలు రెండు గ్రామాలను ఎంపిక చేసుకున్నారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలంతా ఈ పథకాన్ని అందిపుచ్చుకోవడం గమనార్హం. ఇక బీజేపీ ఎంపీల్లో ఏకంగా 191 మంది ఇంతవరకూ మూడో గ్రామాన్ని ఎంపిక చేసుకోలేదు. 84 మంది రెండవ గ్రామాన్నీ ఎంపిక చేసుకోలేదు. ఇక బీజేపీ రాజ్యసభ ఎంపీల్లో 12 మంది మూడు గ్రామాలనూ ఇప్పటివరకూ ఎంపిక చేసుకోలేదు. 20 మంది కనీసం రెండవ గ్రామాన్నీఇంతవరకూ గుర్తించనేలేదు.తలా ఒక గ్రామాన్ని మాత్రం దాదాపు బీజేపీ ఎంపీలందరూ ఎంపిక చేసుకున్నారు. ఇక దశలవారీగా మూడు గ్రామాలను ఎంపిక చేసుకుని అభివృద్ధి చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్న గ్రామీణాభివృద్ధి మంత్రి అతుల్ కుమార్ తివారీ చెప్పారు. ఇప్పటివరకూ ఎంపీలు గుర్తించిన 1314 గ్రామాల్లో 42 శాతం మేర పనులు పూర్తయ్యాయని తెలిపారు. గ్రామాల ఎంపికను త్వరితగతిన పూర్తిచేసి ప్రధాని నిర్ధేశించిన లక్ష్యాన్ని అధిగమించాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది. -
పీసీపల్లికి మహర్దశ
సంసాద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఎంపిక ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దుతా – ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హామీ పీసీపల్లి: మండలంలోని పీసీపల్లి పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పీసీపల్లిలో శుక్రవారం రాత్రి పల్లె నిద్ర చేసిన ఎంపీ శనివారం ఉదయం జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం జాయింట్ కలెక్టర్2 ప్రకాష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత పీసీపల్లి పంచాయతీని దత్తత తీసుకున్నట్లు చెప్పారు. అనంతరం పంచాయతీ పరిధిలో ఉన్న 11 గ్రామాల్లో పర్యటించి ప్రధాన సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. ప్రధాన సమస్యల గుర్తింపు పంచాయతీలోని ప్రధానంగా తాగునీరు, అంతర్గత రోడ్లు, మురుగు కాల్వలు, మరుగుదొడ్లు, పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడం, మురుగు నీరు రోడ్లుపైనే ఉండటం, పింఛన్లు నిలిపివేత తదితర సమస్యలు ప్రధానంగా పంచాయతీలో నెలకొని ఉన్నట్లు గుర్తించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఫ్లోరైడ్ సమస్యను అదిగమించేందుకు ఏర్పాటు చేసిన రామతీర్థం జలాలు గత ఏడాదిగా పేదలకు అందడంలేదని పలువురు ఎంపీ దృష్టికి తెచ్చారు. తొలుత జిల్లా స్థాయి అధికారులు రాలేదని ఏఈపై ఎంపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి సమస్యలు నువ్వు పరిష్కరిస్తావా అంటూ ప్రశ్నించారు. ఫోరైడ్ రహిత గ్రామాలుగా మారుస్తా ఎంపీ గ్రాంట్‌తో జిల్లా మొత్తం 80 వాటర్ ప్లాంట్లు మంజూరు కాగా, అందులో 56 కనిగిరి నియోజకవర్గానికే కేటాయించినట్లు తెలిపారు. ప్రజలు ఫ్లోరైడ్ బారిన పడకుండా కాపాడేందుకే ఇవి నిర్మిస్తున్నానన్నారు. ఫోరైడ్ రహిత గ్రామాలుగా మారుస్తానన్నారు. జిల్లా స్థాయి అధికారులు గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, వైద్యం, విద్య, పారిశుధ్యం కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ఆక్రమణలో ఉన్న చెరువులను వెంటనే సర్వే చేసి ఇరిగేషన్ అధికారులకు అప్పగించాలన్నారు. పీసీపల్లి పంచాయతీ కార్యాలయం శి«థిలావస్తకు చేరిందని, వెంటనే కొత్త భవనానికి ప్రపోజల్ పంపాలన్నారు. అంగన్ వాడీలో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో మొత్తం 37 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. అందులో 11 పాఠశాలలకు ప్రహరీ సౌకర్యం లేదని, ఒక్కో పాఠశాలలకు రూ.16 లక్షలు మంజూరయ్యాయని, త్వరలో నిర్మాణం చేపట్టనున్నట్లు ఎస్ఎస్ఏ అధికారి తెలిపారు. పాలేటిపల్లి రిజర్వాయర్ నుంచి పీసీపల్లి, కమ్మవారిపల్లి చెరువులకు సప్లై ఛానల్‌కు ప్రపోజల్ పంపాలని ఆదేశించారు. పీసీపల్లి పంచాయతీలో అర్హులైన వారి పింఛన్లు తీసివేశారని, విచారించి వారికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎంపీ ఆదేశించారు. ఈకార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు డ్వామా పీడీ పోలప్ప, హౌసింగ్ పీడీ ధనుంజయులు, ఎస్సీ కార్పొరేషన్ అధికారి విజయలక్ష్మి, జడ్పీ సీఈవో బాపిరెడ్డి, ఆర్డీవో మల్లిఖార్జున రావు, వెటర్నరీ ఏడీ రజనీ కుమారి, డీపీవో ప్రసాద్ రాజు, డీఎఫ్‌వో, తహసీల్దార్ మౌలా సాహెబ్, ఎంపీడీవో సురేష్ బాబు, ప్రజాప్రతినిధులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూధన్ యాదవ్, జడ్పీటీసీ సభ్యురాలు కొండ్రు రాణెమ్మ, ఎంపీపీ బత్తుల అంజయ్య, సర్పంచి దేవండ్ల సుమ, ఎంపీటీసీ సబ్యులు కాకర్ల సుబ్బమ్మ, వైస్ సర్పంచి ఎలిది తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామం దత్తత ఒద్దు బాబోయ్!
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మానస పుత్రిక ‘గ్రామీణాభివృద్ధి ప్రాజెక్ట్’ పథకం కింద ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని 2016 సంత్సరం పూర్తయ్యే నాటికి దాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే పిలుపు అరణ్యరోదనే అయింది. 2014. అక్టోబర్ నెలలో ప్రారంభమైన ఈ పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయింది. ఎంపీలు దత్తత తీసుకున్న తొలి గ్రామంలోనే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమై రెండో గ్రామం ఒద్దు బాబోయ్! అంటూ నెత్తీ నోరు కొంటుకుంటున్నారు. 2015 సంవత్సరాంతానికి రెండో గ్రామాన్ని కూడా దత్తత తీసుకోవాలని నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇచ్చిన పిలుపుకు ఏ ఎంపీ సరిగ్గా స్పందించడం లేదు. ఇప్పుడు ఈ ఫథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారిలో ఎక్కువ మంది పాలకపక్ష బీజేపీ ఎంపీలే ఉన్నారు. రెండో గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి గడువు పూర్తవడంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌధరి బీరేందర్ సింగ్ ఇటీవల ఎంపీలందరికి స్వయంగా లేఖలు రాశారు. 543 మంది లోక్‌సభ, 245 మంది రాజ్యసభ్యుల్లో కేవలం 28 మంది ఎంపీలు మాత్రమే ఇప్పటికీ జాబులు రాశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ‘దత్తత తీసుకున్న గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులంటూ ఏమీ లేవు. ఒకవేళ ఎంపీ లార్డ్స్ నిధులను ఖర్చు పెట్టినా అరకొర పనులే అవుతున్నాయి. ప్రజల ఆశలు, అంచనాలు భారీగా ఉండడంతో వారిని సంతృప్తి పర్చలేకపోతున్నాం. అందుకు ప్రజలు ఆడిపోసుకుంటున్నారు. నియోజకవర్గంలోని ఇతర గ్రామాల ప్రజలు తమ గ్రామాలను ఎందుకు పట్టించుకోవడం లేదని దుమ్ము దులుపుతున్నారు. రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది మా పరిస్థితి’ అన్నది ఎంపీల ఆవేదన. అసలు ఈ పథకమే శుద్ధ దండగని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించారు. తాను దత్తత తీసుకున్న తొలి గ్రామంలో పెద్దగా మార్పులేమీ రాలేదని, నియోజకవర్గంలో తన పరపతి దెబ్బతినడం తప్పా అని ఆయన అన్నారు. తొలి గ్రామం దత్తతతోనే చేతులు కాల్చుకున్నామని, రెండో గ్రామాన్ని దత్తత తీసుకునే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు బీజేపీ ఎంపీలు నేషనల్ మీడియాతో స్పష్టం చేశారు. దత్తత గ్రామం స్కీమ్‌కు ప్రత్యేక నిధులను కేటాయించాలని, లేదంటే స్కీమ్‌నే రద్దు చేయాలని దక్షిణ గోవాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శాంతారామ్ నాయక్ అభిప్రాయపడ్డారు. ‘ప్రజల అంచనాలకు తగ్గట్టుగా గ్రామాన్ని తీర్చిదిద్దలేక గ్రామస్థుల నుంచి వ్యతిరేకతను, అంతా ఆ గ్రామానికే చేస్తున్నారు. మా గ్రామాలకు ఏమీ చేయరా, మేము మీ నియోజక వర్గంలో లేమా?’ అంటూ ఇతర గ్రామాల ప్రజల నుంచి ఆగ్రహాన్ని చవి చూస్తున్నాం’ అని జేడీయూ ఎంపీ అలీ అన్వర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీపీఐకి చెందిన రాజ్యసభ ఎంపీ డి. రాజా ఈ స్కీమ్‌ను ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు. నియోజక వర్గం నుంచి ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామాన్ని మాత్రమే అభివృద్ధి చేయడం అంటే ఇతర గ్రామాల పట్ల వివక్ష చూపించడమే అవుతుందని, తీవ్ర పర్యవసానాలు కూడా ఎదురవుతాయని ఆయన చెప్పారు. ఈ స్కీమ్ కింద ప్రత్యేక నిధులను కేటాయిస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని, నిధులు ఉపయోగించుకుంటున్నట్లు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ లెక్కన గ్రామం దత్తత స్కీమ్‌ను ‘శ్రీమంతుల’కు వదిలేస్తే మంచిదేమో! -
దత్తన్నకు దత్తత
జిల్లాలో మరో గ్రామానికి దత్తత యోగం పట్టింది. మత సామరస్యానికి ప్రతీక అయిన మండలంలోని అన్నారం షరీఫ్ దశ ఇక మారనుంది. సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన(ఎస్ఏజీవై)కింద కేంద్ర సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ మేరకు ఇన్చార్జి ఎంపీడీఓ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. జిల్లాలో ఇప్పటి కే ఐదు గ్రామాలను లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు దత్తత తీసుకున్నారు. దత్తత పొందిన ఆరో గ్రామం అన్నారం షరీఫ్. - అన్నారం షరీఫ్‌కు మహర్దశ - ఎస్ఏజీవై కింద దత్తత - స్థానికుల హర్షాతిరేకాలు అన్నారం షరీఫ్(పర్వతగిరి): జిల్లా కేంద్రానికి 42 కిలో మీటర్ల దూరంలో ఉన్న అన్నారం షరీఫ్‌లో దశాబ్దల క్రితం యాకూబ్ బాబా కొలువుదీరారు. పెద్ద సంఖ్యలో హిందువులూ బాబాను కొలుస్తారు. మొక్కులు తీర్చుకునేందుకు భారీగా కందూర్లు చేస్తారు. ఇక్కడి దర్గాల ఏటా వక్ఫ్‌బోర్డు టెండర్లు నిర్వహిస్తుంది. ఇలా సుమారు రూ. 80 లక్షల ఆదాయం సమకూరుతుంది. సమస్యల జాతర ఇంత ఆదాయం ఉన్నా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి లేదు. ఇరుకైన రోడ్లు, అస్తవ్యస్తంగా పారిశుధ్య నిర్వహణ, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలతో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దర్గాలో భక్తుల వద్ద అక్రమంగా వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రి లేకపోవడంతో అత్యవసర సమయాల్లో ఇబ్బందిపడాల్సి వస్తోంది. తాగునీటి సమస్యలూ వెంటాడుతున్నాయి. దర్గా అభివృద్ధి కూడా ప్రధాన సమస్య. 2, 280 జనాభా ఉన్న ఈ గ్రామంలో ఓటర్ల సంఖ్య 1740. పంచాయతీ ఇంటి బకాయిలు రూ.3 లక్షలు, నల్లా పన్నుల బకాయిలు రూ. 2 లక్షలు వరకు ఉన్నాయి. గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న స్థానికుల అభీష్టం.. దత్తత ద్వారా త్వరలో నెరవేరనుంది. దత్తతపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లా తెలుగు యువత అధ్యక్షడు మో టపోతుల మనోజ్‌గౌడ్ మాట్లాడుతూ, గ్రా మాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దితే ఇక్కడి ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. సర్పంచ్ జడల పద్మ, మండల కో ఆప్షన్ సభ్యుడు షబ్బీర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లూనవత్ పంతులు, రామ్మూర్తి, మాజీ ఉప సర్పంచ్ బూర యాకయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది అన్నారం షరీఫ్‌ను సంసద్ ఆదర్శ్ గ్రామంగా దత్తత తీసుకోవటం మా అదృష్టం. హిందూముస్లింల ఐక్యతకు నిదర్శనమైన గ్రామం మాది. తాగునీరు, డ్రెయినేజీ సమస్యలను దత్తత ద్వారా పరిష్కరిస్తే ప్రజలకు మేలు కలుగుతుంది. మా గ్రామాన్ని దత్తాత్రేయ దత్తత తీసుకోవటానికి కృషి చేసిన యుగాంతర్ సంస్థ డెరైక్టర్ ఎర్రబెల్లి మదన్‌మోహన్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. - జడల పద్మ, సర్పంచ్ -
4 గ్రామాల దత్తత
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునకు జిల్లా ఎంపీలు స్పందించారు. ప్రతి ఎంపీ ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని విధాలా అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ‘సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన’ కింద జిల్లాకు చెందిన ఇద్దరు లోక్‌సభ సభ్యులు నాలుగు గ్రామాలను ఎంపిక చేశారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ధారూరు మండలం నాగసమందర్ గ్రామాన్ని దత్తత తీసుకోగా, మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి ఏకంగా మూడు గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా మేడ్చల్ మండలంలోని కండ్లకోయ, గుండ్లపోచంపల్లితోపాటు కుత్బుల్లాపూర్ మండలంలోని దుండిగల్ గ్రామాలను దత్తత తీసుకున్నారు. వీరితోపాటు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తూళ్ల దేవేందర్‌గౌడ్ కూడా మూడు గ్రామాలను దత్తత తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. మహేశ్వరం, హర్షగూడ, కందుకూరు గ్రామాలను ఎంపిక చేసుకున్నారు. అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన్ను ఏపీ రాష్ట్రానికి కేటాయించారు. దీంతో ప్రస్తుతానికి ఆయన ఈ గ్రామాలను దత్తత తీసుకునేందుకు చట్టం అంగీకరించదు. 24వ తేదీ నుంచి జరిగే పార్లమెంటు సమావేశంలో రాజ్యంగ సవరణ జరిగే అవకాశముంది. ఆ తర్వాత దత్తత తీసుకునే గ్రామాలను దేవేందర్‌గౌడ్ ప్రకటించనున్నారు. ఇదిలాఉండగా, ఎంపిక చేసే గ్రామాల్లో ఏడాదికాలంలో మౌలిక సదుపాయాలకు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామస్థాయిలో సర్వే నిర్వహించి అభివృద్ధి ప్రణాళికను తయారు చేసి.. వచ్చే ఏడాది మే 11న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అంతకుముందు గ్రామంలో ముఖ్యంగా తాగునీరు, పాఠశాల, రోడ్లు తదితర మౌలిక వసతుల కల్పనకు కార్యాచరణను రూపొందించనున్నారు. దేశంలోనే ఆదర్శవంతగ్రామాలుగా గుర్తింపు పొందిన పిపిలంత్రీ (రాజస్థాన్), ఐవారేబజార్ (మహారాష్ట్ర), ధార్ని (బీహర్), టిల్గార (మధ్యప్రదేశ్), అంకాపూర్ (తెలంగాణ), బిట్కులీ (చత్తీస్ఘడ్), జేగూరుపాడు (ఏపీ), బందపల్లి (కర్నాటక)గ్రామాల తరహాలో జిల్లాలో ఎంపీలు ఎంపిక చేసిన గ్రామాలను తీర్చిదిద్దాలని జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి శనివారం అధికారులను ఆదేశించారు. -
'దద్దవాడ'ను దత్తత తీసుకున్న వైవీ సుబ్బారెడ్డి
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ, వైఎస్ఆర్ సీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి కొమరవోలు మండలం దద్దవాడ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. శుక్రవారం జిల్లా ఉన్నతాధికారులతో కలసి సుబ్బారెడ్డి ఆ గ్రామాన్ని సందర్శించారు. దేశంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ ... లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ జయంతి (అక్టోబర్ 11) సందర్బంగా సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశంలోని పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు దేశవ్యాప్తంగా గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పీఆర్ కండ్రీగ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం విదితమే. -
ఇక దద్దవాడకు మహర్దశ
గిద్దలూరు: వెనుకబడిన గిద్దలూరు నియోజకవర్గంలో అభివృద్ధికి దూరంగా ఉన్న దద్దవాడ పంచాయతీని సంసాద్ ఆదర్శ గ్రామ యోజనలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎన్నుకోవడంతో ఆ గ్రామానికి మహర్దశ పట్టనుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. స్థానిక తన నివాసంలో దద్దవాడ గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఐదేళ్ల కాలంలో మూడు గ్రామాలను ఎన్నుకుని అభివృద్ధి చేయాలని నిర్ణయించారన్నారు. అందులో దద్దవాడను చేర్చాలని కోరిన వెంటనే ఎంపీ ప్రకటించడం ఆనందదాయకమన్నారు. గిద్దలూరు ప్రాంతంలో జవాన్లు అధికంగా ఉన్నారని సైనిక స్కూల్ ఏర్పాటు చేయాలని కోరగానే ఎంపీ రక్షణశాఖ మంత్రిని కలిసి ప్రతిపాదనలు చేశారన్నారు. ఈ సంద ర్భంగా ఎంపీ వై.వి.సుబ్బారెడ్డికి నియోజకవర్గ ప్రజలు, దద్దవాడ ప్రజల తర ఫున కృతజ్ఞతలు తెలిపారు. రుణమాఫీపై ప్రభుత్వ తీరు దారుణం: ఎన్నికల సమయంలో అధి కారం కోసం టీడీపీ వ్యవసాయ రుణాలను ఎలాంటి ఆంక్షలు లేకుండా మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. రూ.87 వేల కోట్లుఉన్న రుణాలను రూ.5 వేల కోట్లకు తగ్గించేందుకు కుట్రపన్నుతున్నారని విమర్శించారు. రేషన్‌కార్డుకు, ఆధార్‌కార్డుకు ఒక్క అక్షరం తప్పు ఉన్నా రుణమాఫీ చేయకుండా కొర్రీ వేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు రైతులను అబద్ధపు హామీలతో మోసగించేకన్నా...తన కు చేతకాదని చెప్పి వారికి క్షమాపణ చెప్పవచ్చుకదా అని ఎద్దేవా చేశారు. వేలాది మంది లబ్ధిదారులను విచారించేందుకు, వారి రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు తీసుకునేందుకు రెండు రోజుల సమయం ఇస్తే వారు ఎలా సర్వే నిర్వహిస్తారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీలకు అప్పగిస్తే ఈసర్వే పూర్తి చేసి 15వ తేదీలోగా బ్యాంకులో అప్లోడ్ చేయడం సాధ్యమయ్యే పనేనా అని ఆయన ప్రశ్నించారు. రాష్ర్టం విడిపోయిన నేపథ్యంలో ఆర్ధిక పరిస్థితిని గమనించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి రైతులకు రుణమాఫీ చేయడం సాధ్యంకాదని హామీ ఇవ్వలేదని, హామీలు ఇచ్చి రైతులను మోసం చేయడం ఇష్టం లేకనే చెప్పలేదన్నారు. టీడీపీ మోసపూరిత హామీలు ఇచ్చి కమిటీలు, సాధికార సంస్థల పేరుతో కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బూటకపు రుణమాఫీ హామీ వలన రైతులు తీసుకున్న రుణాలకు అధిక వడ్డీలు చెల్లించాల్సి పరిస్థితి నెలకొందన్నారు. రుణాలు చెల్లించకపోవడంతో పంటల బీమా కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఆయన వెంట దద్దవాడ సర్పంచి గులాం చిన్నవీరయ్య, ఉపసర్పంచి బిజ్జం వెంకటరెడ్డి, కొమరోలు వైస్ ఎంపీపీ బి.చిన్నఆంజనేయులు, మాజీ సర్పంచి బిజ్జం వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సూరా స్వామిరంగారెడ్డి, నాయకులు రోశిరెడ్డి, నారు వెంకటేశ్వర్లు, నారాయణరెడ్డి, కైపా కోటేశ్వరరెడ్డి ఉన్నారు. -
ఓ గ్రామాన్ని దత్తత తీసుకోనున్న మాస్టర్
-
సచిన్ ‘గ్రామ్ యోజన’
ఓ గ్రామాన్ని దత్తత తీసుకోనున్న మాస్టర్ న్యూఢిల్లీ: ‘స్వచ్ఛ్ భారత్’ను దిగ్విజయంగా పూర్తి చేసిన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇప్పుడు ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ‘సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన’లో భాగంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని యోచిస్తున్నాడు. భార్య అంజలితో కలిసి గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భంలో తన మనసులోని ఆలోచనను మాస్టర్ బయటపెట్టాడు. మరికొంత మందిని ఆహ్వానించడం ద్వారా స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని ఈ మాజీ క్రికెటర్ వెల్లడించాడు. పాఠశాలలు, కాలేజిల్లో క్రీడల అభివృద్ధిపై దృష్టిపెడతానని తెలిపాడు. నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని పుట్టంరాజు కండ్రిగ గ్రామాభివృద్ధికి సచిన్ తన రాజ్యసభ నిధుల నుంచి రూ.3.5 కోట్లు కేటాయించాడు. ఈ గ్రామంలో జరుగుతున్న పనుల గురించి మోదీతో చర్చించినట్లు సమాచారం.