గ్రామం దత్తత ఒద్దు బాబోయ్!
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మానస పుత్రిక ‘గ్రామీణాభివృద్ధి ప్రాజెక్ట్’ పథకం కింద ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని 2016 సంత్సరం పూర్తయ్యే నాటికి దాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే పిలుపు అరణ్యరోదనే అయింది. 2014. అక్టోబర్ నెలలో ప్రారంభమైన ఈ పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయింది. ఎంపీలు దత్తత తీసుకున్న తొలి గ్రామంలోనే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమై రెండో గ్రామం ఒద్దు బాబోయ్! అంటూ నెత్తీ నోరు కొంటుకుంటున్నారు.
2015 సంవత్సరాంతానికి రెండో గ్రామాన్ని కూడా దత్తత తీసుకోవాలని నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇచ్చిన పిలుపుకు ఏ ఎంపీ సరిగ్గా స్పందించడం లేదు. ఇప్పుడు ఈ ఫథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారిలో ఎక్కువ మంది పాలకపక్ష బీజేపీ ఎంపీలే ఉన్నారు. రెండో గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి గడువు పూర్తవడంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌధరి బీరేందర్ సింగ్ ఇటీవల ఎంపీలందరికి స్వయంగా లేఖలు రాశారు. 543 మంది లోక్‌సభ, 245 మంది రాజ్యసభ్యుల్లో కేవలం 28 మంది ఎంపీలు మాత్రమే ఇప్పటికీ జాబులు రాశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
‘దత్తత తీసుకున్న గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులంటూ ఏమీ లేవు. ఒకవేళ ఎంపీ లార్డ్స్ నిధులను ఖర్చు పెట్టినా అరకొర పనులే అవుతున్నాయి. ప్రజల ఆశలు, అంచనాలు భారీగా ఉండడంతో వారిని సంతృప్తి పర్చలేకపోతున్నాం. అందుకు ప్రజలు ఆడిపోసుకుంటున్నారు. నియోజకవర్గంలోని ఇతర గ్రామాల ప్రజలు తమ గ్రామాలను ఎందుకు పట్టించుకోవడం లేదని దుమ్ము దులుపుతున్నారు. రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది మా పరిస్థితి’ అన్నది ఎంపీల ఆవేదన.
అసలు ఈ పథకమే శుద్ధ దండగని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించారు. తాను దత్తత తీసుకున్న తొలి గ్రామంలో పెద్దగా మార్పులేమీ రాలేదని, నియోజకవర్గంలో తన పరపతి దెబ్బతినడం తప్పా అని ఆయన అన్నారు. తొలి గ్రామం దత్తతతోనే చేతులు కాల్చుకున్నామని, రెండో గ్రామాన్ని దత్తత తీసుకునే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు బీజేపీ ఎంపీలు నేషనల్ మీడియాతో స్పష్టం చేశారు.
దత్తత గ్రామం స్కీమ్‌కు ప్రత్యేక నిధులను కేటాయించాలని, లేదంటే స్కీమ్‌నే రద్దు చేయాలని దక్షిణ గోవాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శాంతారామ్ నాయక్ అభిప్రాయపడ్డారు. ‘ప్రజల అంచనాలకు తగ్గట్టుగా గ్రామాన్ని తీర్చిదిద్దలేక గ్రామస్థుల నుంచి వ్యతిరేకతను, అంతా ఆ గ్రామానికే చేస్తున్నారు. మా గ్రామాలకు ఏమీ చేయరా, మేము మీ నియోజక వర్గంలో లేమా?’ అంటూ ఇతర గ్రామాల ప్రజల నుంచి ఆగ్రహాన్ని చవి చూస్తున్నాం’ అని జేడీయూ ఎంపీ అలీ అన్వర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీపీఐకి చెందిన రాజ్యసభ ఎంపీ డి. రాజా ఈ స్కీమ్‌ను ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు. నియోజక వర్గం నుంచి ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామాన్ని మాత్రమే అభివృద్ధి చేయడం అంటే ఇతర గ్రామాల పట్ల వివక్ష చూపించడమే అవుతుందని, తీవ్ర పర్యవసానాలు కూడా ఎదురవుతాయని ఆయన చెప్పారు. ఈ స్కీమ్ కింద ప్రత్యేక నిధులను కేటాయిస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని, నిధులు ఉపయోగించుకుంటున్నట్లు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ లెక్కన గ్రామం దత్తత స్కీమ్‌ను ‘శ్రీమంతుల’కు వదిలేస్తే మంచిదేమో!