
లక్నో : ఊహించని విపత్తులా దూసుకొచ్చిన ప్రాణాంత కరోనా వైరస్ పౌరుల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. వైరస్ వ్యాప్తికి విధించిన లాక్‌డౌన్ పలు ప్రాంతాల్లో ఆకలి చావులకు దారితీస్తోంది. ఇక వలస కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ముఖ్యంగా వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక తిండికరువై అల్లాడుతున్నారు. ఉత్తరభారతంలో బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బతుకు జీవుడా అంటూ కాలం వెల్లదీస్తున్నారు. కరోనా విపత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దత్తత గ్రామంలోనూ ఆకలి కేకలు పుట్టిస్తోంది. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గానికి కూతవేటు దూరంగా ఉన్న దోమరి గ్రామస్తులు తిండిలేక అలమటిస్తున్నారు. (దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు)
నరేంద్ర మోదీ తొలిసారి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పథకం ‘సస్సద్ ఆదర్శ గ్రామ యోజన’. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాలను ఎంపీలు దత్తత తీసుకోవడమే ఈ పథకం స్వరూపం. పార్లమెంటు సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి పథకం (ఎంపీల్యాడ్స్) నుంచి ఆయా గ్రామాలకు కేంద్రం నిధులు సమకూర్చుతుంది. దీనిలో భాగంగానే 2014లో వారణాసి సమీపంలోని జయపుర గ్రామాన్ని మోదీ తొలుత దత్తత తీసుకున్నారు. అనంతరం తన నియోజకవర్గంలో వెనుకబడిన మరో మూడు గ్రామాలను సైతం దత్తత తీసుకుంటున్నట్లు 2019లో ప్రకటించారు. దీంతో అప్పటివరకు అంధకారంలో ఉన్న తమ బతుకులు ఇక మారుతాయని స్థానిక ప్రజలంతా భావించారు. ఈ క్రమంలోనే గత ఫిబ్రవరిలో దోమరి గ్రామంలో పర్యటించిన మోదీ.. 63 అడుగుల దీన్‌దయాల్ ఉపాధ్యాయ విగ్రహ ఆవిష్కరణతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. (కరోనా పోరులో విజయం: సంబరపడొద్దు)
మోదీ పర్యటన అనంతరం గ్రామస్తులపై కరోనా పిడుగులా పడింది. లాక్‌డౌన్‌తో స్థానిక పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. స్థానిక బెనారాస్ పట్టణంలో ఉపాధి పొందే వందలాది కూలీలకు కరోనా మరిన్ని కష్టాలను తీసుకువచ్చింది. రోజూ పని దొరికితే గానీ ఇళ్లు గడవని ఆ కుటుంబాల్లో కరోనా చిచ్చుపెట్టింది. ఓవైపు ఉపాధి లేక, మరోవైపు తింటానికి తిండిలేక గ్రామస్తులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక తమను ఆదుకునే వారు ఎవరూ లేరని భావించారేమో.. పక్క గ్రామాలకు వెళ్లి చేతులు చాస్తున్నారు. దీనిపై కళ్లో అనే గ్రామస్తుడు మాట్లాడుతూ.. ‘రోజూ ఉదయం 8 కిలోమీటర్లు నడిచి.. ఆహారం వెతుక్కుంటున్నాం. రొట్టె, నీళ్లు తాగి ఉండాల్సి వస్తుంది. ఒక్కో రోజు కనీసం ఏమీ దొరకదు. గడిచిన రెండునెలల్లో చాలాసార్లు పస్తులు ఉన్నాం’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.
లాక్‌డౌన్‌తో తన పది నెలల పాపకు కనీసం పాలు కూడా పట్టలేని పరిస్థితి ఎదురైందని స్థానిక మహిళా రంజూ దేవీ తన గోడును వెళ్లబోసుకున్నారు. లాక్‌డౌన్‌కు ముందు రోజూ రూ. 60తో పిల్లలకు పాలు, బిస్కెట్స్ కొనిపెట్టే వాళ్లమని, ప్రస్తుతం రూ.20తో రోజంతా సరిపుచ్చుతున్నామని చెప్పుకొచ్చారు. తన భర్త ఇంతకుముందు చేపలవేటకు వెళ్లి రోజూ రూ. 300 వరకు సంపాదించేవారని, ఇప్పుడు అది కూడా లేకపోవడంతో ఇళ్లు గడవడం కష్టతరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరేకాదు ఇంకా అనేక మంది పేదలు దోమరి, దాని చుట్టపక్కల గ్రామాల్లో ఆకలితో అలమటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమను ఎవరైనా ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ మేరకు వారణాసి పరిసర ప్రాంతాల్లో లాక్‌డౌన్ తరువాత పరిస్థితులపై ఓ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది.