సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునకు జిల్లా ఎంపీలు స్పందించారు. ప్రతి ఎంపీ ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని విధాలా అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ‘సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన’ కింద జిల్లాకు చెందిన ఇద్దరు లోక్‌సభ సభ్యులు నాలుగు గ్రామాలను ఎంపిక చేశారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ధారూరు మండలం నాగసమందర్ గ్రామాన్ని దత్తత తీసుకోగా, మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి ఏకంగా మూడు గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగా మేడ్చల్ మండలంలోని కండ్లకోయ, గుండ్లపోచంపల్లితోపాటు కుత్బుల్లాపూర్ మండలంలోని దుండిగల్ గ్రామాలను దత్తత తీసుకున్నారు. వీరితోపాటు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తూళ్ల దేవేందర్‌గౌడ్ కూడా మూడు గ్రామాలను దత్తత తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. మహేశ్వరం, హర్షగూడ, కందుకూరు గ్రామాలను ఎంపిక చేసుకున్నారు.
అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన్ను ఏపీ రాష్ట్రానికి కేటాయించారు. దీంతో ప్రస్తుతానికి ఆయన ఈ గ్రామాలను దత్తత తీసుకునేందుకు చట్టం అంగీకరించదు. 24వ తేదీ నుంచి జరిగే పార్లమెంటు సమావేశంలో రాజ్యంగ సవరణ జరిగే అవకాశముంది. ఆ తర్వాత దత్తత తీసుకునే గ్రామాలను దేవేందర్‌గౌడ్ ప్రకటించనున్నారు. ఇదిలాఉండగా, ఎంపిక చేసే గ్రామాల్లో ఏడాదికాలంలో మౌలిక సదుపాయాలకు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గ్రామస్థాయిలో సర్వే నిర్వహించి అభివృద్ధి ప్రణాళికను తయారు చేసి.. వచ్చే ఏడాది మే 11న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అంతకుముందు గ్రామంలో ముఖ్యంగా తాగునీరు, పాఠశాల, రోడ్లు తదితర మౌలిక వసతుల కల్పనకు కార్యాచరణను రూపొందించనున్నారు. దేశంలోనే ఆదర్శవంతగ్రామాలుగా గుర్తింపు పొందిన పిపిలంత్రీ (రాజస్థాన్), ఐవారేబజార్ (మహారాష్ట్ర), ధార్ని (బీహర్), టిల్గార (మధ్యప్రదేశ్), అంకాపూర్ (తెలంగాణ), బిట్కులీ (చత్తీస్‌ఘడ్), జేగూరుపాడు (ఏపీ), బందపల్లి (కర్నాటక)గ్రామాల తరహాలో జిల్లాలో ఎంపీలు ఎంపిక చేసిన గ్రామాలను తీర్చిదిద్దాలని జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి శనివారం అధికారులను ఆదేశించారు.
4 గ్రామాల దత్తత
Published Sat, Nov 22 2014 11:59 PM | Last Updated on Fri, Jul 26 2019 5:59 PM
Advertisement
Advertisement