దుబాయ్‌ లక్ష్యం.. పాతబస్తీ మార్గం! | Bangladeshis and Rohingya are entering in India with a huge sketch | Sakshi
Sakshi News home page

దుబాయ్‌ లక్ష్యం.. పాతబస్తీ మార్గం!

Published Tue, Feb 25 2020 2:34 AM | Last Updated on Tue, Feb 25 2020 2:34 AM

Bangladeshis and Rohingya are entering in India with a huge sketch - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమ తమ మాతృదేశాలు విడిచి అక్రమంగా భారత్‌లో ప్రవేశించిన బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు భారీ స్కెచ్‌తోనే దేశంలోకి ప్రవేశిస్తున్నారు. వాళ్ల దేశంలో ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో దుబాయ్, గల్ఫ్‌లాంటి విదేశాలకు వెళ్లడానికి భారత్‌ను తాత్కాలిక వేదికగా మార్చుకుంటుండగా.. మరికొందరు ఇక్కడే స్థిరపడేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాంటి వారిలో చాలామంది మెరుగైన జీవితం కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో సులువుగా గుర్తింపు కార్డులు పొంది.. భారత పౌరులుగా చలామణీ అవుతున్నారు. కొందరు విదేశాల కు వెళ్లే యత్నాలు చేస్తుంటే. మరికొందరు ఇక్కడే సెటిలవుతూ... ప్రభుత్వ సంక్షేమ పథకాలకూ దర ఖాస్తు చేసుకుంటున్నారు. వీటిపై విచారణ చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగాలు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి. పాతబస్తీలో రూ.10కి ఓటరు కార్డు, రూ.200కు పాన్‌కార్డు, రూ.2,000కు పాస్‌ పోర్టు వచ్చేస్తున్నాయి. ఇలాంటి వారికి ఉగ్రనేపథ్యముంటే.. అది అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను మంటగలుపుతుందని అధికారులు వాపోతున్నారు. 

దుబాయ్‌కి ప్రణాళికలు.. 
దేశంలోకి అక్రమంగా చొరబడ్డ వీరంతా పాతబస్తీ, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోని ఖాళీస్థలాలు, చెరువుల్ని ఆక్రమించుకుంటున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు దీనిని పట్టించుకోవడం లేదు. పింఛన్లు, రేషన్‌కార్డులు తీసుకుంటూ భారత పౌరులకు దక్కాల్సిన పథకాలను కొట్టేస్తున్నారు. స్థానిక యువతతో స్నేహం చేస్తోన్న రోహింగ్యా, బంగ్లాదేశీ యువకులు మెల్లిగా పంథా మార్చారు. స్థానిక యువత దారిలోనే.. దుబాయ్, గల్ఫ్‌ తదితర దేశాలకు వెళ్లాలని ప్రణాళికలు వేస్తున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్, పాస్‌పోర్టులు సంపాదిస్తున్నారు. విజిటింగ్‌ వీసా మీద అయినా సరే.. విదేశాలకు వెళ్లేందుకు యత్నాలు మొదలుపెట్టారు. వారు విదేశీయులని తెలిసీ కొందరు ఏజెంట్లు సాయం చేస్తుండటం గమనార్హం. 

కసబ్‌కు దారం.. వీరికి ఆధార్‌! 
2008లో దేశంలోకి అక్రమంగా చొరబడి చేతికి ఎర్రటి దారం కట్టుకుని ముంబైలో 26/11 దాడులకు పాల్పడిన కసబ్‌ను భారత పౌరుడంటూ పాకిస్తాన్‌ ప్రపంచానికి చాటిచెప్పే యత్నం చేసింది. నగరంలో ఓటర్, ఆధార్, డ్రైవింగ్‌ లైసెన్స్, పాస్‌పోర్టు, పింఛన్, సంక్షేమ పథకాలు పొందిన రోహింగ్యాలు విదేశాల్లో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడితే.. భారత్‌ అంతర్జాతీయంగా తనమీద పడ్డ మచ్చను చెరిపేసుకోవడం చాలాకష్టమని, పలుదేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని పలువు రు అంటున్నారు. అమెరికా, యూరోప్‌ వంటి దేశాలకు రోహింగ్యాల వల్ల నష్టం కలిగితే.. భారత్‌ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందుకే, ఈ ఉపద్రవాన్ని గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్న పాస్‌పోర్టులను రద్దు చేయాల ని పాస్‌పోర్టు ఆఫీసులకు లేఖలు రాస్తున్నారు. 

ఉపాధి కోసమా.. ఉగ్రకోణమా? 
వాస్తవానికి ఏ దేశంలోకి అక్రమంగా ప్రవేశించినా వారిని వెంటనే అరెస్టుచేసి, జైలుశిక్ష లేదా తిరిగి పంపించడం చేస్తారు. వీరంతా వేలసంఖ్యలో వచ్చిన శరణార్థులు కావడంతో ఎవరినీ తిరిగి పంపే ప్రయత్నాలు జరగలేదు. వీరిలో చాలామంది ఉగ్రవాద సానుభూతిపరు లున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. భారత్‌ పాస్‌పోర్టులతో రోహింగ్యాలు విదేశాలకు వెళ్తున్నారన్న విషయం వెలుగుచూడగానే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ అలా వెళ్లేవారు భారత పౌరుల ముసుగులో అక్కడ ఏదైనా ఉగ్రచర్యలకు పాల్పడితే.. అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్ట మంటగలిసే ప్రమాదముందని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement