రాజ్‌భవన్‌లో రాష్ట్రపతికి విందు
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది విడిదికి రాజధానికి విచ్చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మంగళవారం రాత్రి రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వల్ప అనారోగ్యం కారణంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విందుకు హాజరు కాలేకపోయారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ విందు కు హాజరయ్యారు. తెలంగాణ డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు విందులో పాల్గొన్నారు. విందుకు హాజరైన ప్రజాప్రతినిధులందరినీ రాష్ట్రపతి ఆప్యాయంగా పలకరించి కరచాలనం చేశారు.
కేసీఆర్‌కు జ్వరం: అధికారిక నివాసంలో విశ్రాంతి
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం ఆయన అధికారిక నివాసంలోనే విశ్రాంతి తీసుకున్నారు. దీంతో మంగళవారం నాటి సీఎం అపాయింట్‌మెంట్లన్నింటినీ సీఎంవో కార్యాలయం రద్దు చేసింది. పది రోజుల విడిదికి హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సీఎం కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులతో కలసి సోమవారం ఘన స్వాగతం పలికారు.
రాష్ట్రపతితో బాబు భేటీ
హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లిన చంద్రబాబు సుమారు గంటపాటు ఆయనతో సమావేశమయ్యారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నప్పటికీ.. ఇటీవల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు, సెక్షన్-8 అమలు, ఓటుకు కోట్లు కేసు పరిణామాలు, ట్యాపింగ్ తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి బుధవారం శ్రీవారి దర్శనానికి వెళ్లనున్నారు. ఆయనకు రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు స్వాగతం పలుకుతారు. ప్రణబ్ శ్రీవారిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు రాజమండ్రి పర్యటనకు వెళతారు.