రాష్ట్రపతి ప్రణబ్‌తో గవర్నర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: పది రోజుల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో గవర్నర్ నరసింహన్ గురువారం భేటీ అయ్యారు. మధ్యాహ్నం బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన గవర్నర్.. దాదాపు అరగంట సేపు రాష్ట్రపతితో సమావేశమై మాట్లాడారు. అనంతరం రాష్ట్రపతిని మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కలుసుకున్నారు. కాగా శుక్రవారం మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు రచించిన ‘ఉనికి’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరుగనుంది. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
5న యాదగిరిగుట్టకు: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ యాదగిరిగుట్ట పర్యటన ఖరారైంది. ఈనెల 5న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి గుట్టను సందర్శిస్తారు. లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకుంటారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ కూడా రాష్ట్రపతి వెంట ఉండనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ హరితహారం జిల్లాల పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం కేసీఆర్ 5న ఉదయం కరీంనగర్ నుంచి పెద్దపల్లికి రోడ్డు మార్గంలో చేరుకోవాలి. కానీ మారిన షెడ్యూల్ ప్రకారం కేసీఆర్ 5న ఉదయం హెలికాప్టర్‌లో యాదగిరిగుట్టకు చేరుకుంటారు. అక్కడ కార్యక్రమం పూర్తవగానే హెలికాప్టర్‌లో నేరుగా పెద్దపల్లికి చేరుకొని హరితహారంలో పాల్గొంటారు.