పనిలేక ఖాళీగా కూర్చున్న నాయీ బ్రాహ్మణులు
జనగామ: కరోనా మహమ్మారి రోజువారి కూలీలు, చిరు వ్యాపారులతో పాటు పేద, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పనిచేస్తేనే పూటగడిచే పరిస్థితుల్లో లాక్‌డౌన్ కష్టాల పాలు చేస్తుంది. 23 రోజులుగా దుకాణాలు మూసి వేసుకుని, ఇంటిపట్టునే ఉంటున్న నాయీ బ్రాహ్మణుల దీన స్థితిపై కథనం.
జిల్లాలోని 281 గ్రామాల్లో సుమారుగా వెయ్యికి పైగా కుటుంబాలు ఉన్నాయి. ఇందులో జిల్లా కేంద్రంలో 300, 12 మండలాల పరిధిలో మరో 700 కుటుంబాలు హెయిర్ కటింగ్ సెలూన్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఒక్క జిల్లా కేంద్రంలోనే 120 కటింగ్ షాపులు ఉన్నాయి. పల్లె నుంచి పట్టణం వరకు రోజువారి సంపాధనతో బతుకుతున్న వీరిపై కరోనా పిడుగు కోలుకో లేకుండా చేస్తుంది. లాక్‌డౌన్‌లో కిరాణా, మెడికల్ దుకాణాలు మినహా మిగతా వ్యాపార సముదాయాలన్నీ లాక్‌డౌన్ పరిధిలోకి రావడంతో హెయిర్ కటింగ్ సెలూన్లు మూతబడ్డాయి. దీంతో రోజువారి సంపాధనను కోల్పోయిన కార్మికులు, కుటుంబాల పోషణ దేవుడెరుగు, దుకాణాల అద్దె కూడా చెల్లించలేని దయనీయ స్థితిలో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. రూ.200 నుంచి రూ.1000 వరకు సంపాధించే నాయీబ్రాహ్మణ కార్మికులు...ఆపన్న హస్త కోసం ఎదురు చూస్తున్నారు. కటింగ్, గడ్డాలు చేసుకునే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో హెయిర్ కటింగ్ సెలూన్లకు మినహాయింపు ఇవ్వడం లేదు.
ప్రైవేటు పని దొరక్క..
తెల్లవారింది లేచింది మొదలుకుని రాత్రి 11గంటల వరకు కత్తెర ఆడిస్తూ, బతుకు బండిని లాగిన నాయీ బ్రాహ్మణులు నేడు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. కులవృత్తి లాక్‌డౌన్ కాగా, మరో పనికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా కరోనా వైరస్ కట్టడి చేస్తుంది. ఈ నెల 30 వరకు రాష్ట్ర ప్రభుత్వం, మే 3వ తేదీ వరకు కేంద్రం లాక్‌డౌన్ పొడగించడంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నా రు. ప్రభుత్వం తమ ను ఆదుకోవాలని కోరుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
కరోనా కట్టడికి జిల్లాలో నాయీ బ్రాహ్మణులు నిబద్ధతతో లాక్‌డౌన్‌ను విజయ వంతం చేస్తున్నాం. రోజువారి సంపాధన కోల్పోవడంతో కుటుంబాలు గడిచే పరిస్థితి లేకుండా పోయింది. ఇంటి, దుకాణం అద్దెలు చెల్లించేందుకు మూడు మాసాల గడువు ఇప్పించాలి. కరెంటు బిల్లు కూడా భారంగా మారుతుంది. – కొత్తపల్లి అభినాష్,నాయీ బ్రాహ్మణ కార్మికుడు, బాణాపురం
అద్దె చెల్లించలేని దుస్థితి
లాక్‌డౌన్‌లో దుకాణం అద్దె కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాం. ప్రతిరోజూ పని చేస్తే వచ్చే సంపాధనతోనే కుటుంబాలను పోషించుకున్నాం. 23 రోజులుగా దుకాణాలు మూసి వేయడంతో ఇబ్బందిగా ఉంది.
– కొండూరి కుమారస్వామి,కార్మికుడు, జనగామ
Comments
Please login to add a commentAdd a comment