సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో కల్తీమద్యం, కల్లు, నాటు సారా ఏరులై పారుతున్నా ఎక్సైజ్‌శాఖ మత్తు వీడడంలేదు. మద్యం విక్రయాల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన బార్‌కోడ్ విధానం అమలుపై కూడా సంబంధిత అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కల్తీని నిరోధించేం దుకు నిర్దేశించిన సీసీ కెమెరాల ఏర్పాటు వంటి నిబంధనలను పట్టించుకోవడం లేదు. వైన్‌షాపుల వద్ద
ఉండాల్సిన పర్మిట్‌రూమ్‌ల విషయాన్ని కూడా గాలికొదిలేశారు.
అంతా ‘మామూలు’గా తీసుకుంటున్న ఆబ్కారీశాఖ అధికారులు చాలాచోట్ల పర్మిట్‌రూమ్‌లు లేకుండా సాగిస్తున్న వ్యాపారంపై కూడా కళ్లు మూసుకుంటున్నారు. జిల్లాలో ఏటా రూ.180కోట్లకు పైగా మద్యం అమ్ముడవుతుంది. ఇక చీకటిమాటుగా సాగే కల్తీకల్లు, నాటుసారా, మట్కా తదితర వాటికి లెక్కేలేదు. జిల్లాలో మూడు ఎక్సైజ్ సర్కిళ్లు ఉన్నాయి. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల పరిధిలో 199 వైన్‌షాపులు, 9 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి.
మద్యం దుకాణాలతో పాటు పాటు రెస్టారెంట్‌లలో అమ్ముడుపోయే మద్యం బాటిళ్లకు బార్‌కోడ్ అమలుచేయాలని ప్రభుత్వం మూణ్నెళ్ల క్రితమే ఆదేశించినా.. ఎక్సైజ్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. షాపులకు వచ్చే అసాంఘిక శక్తులను అదుపులో పెట్టడం, బార్లలో గొడవపెట్టే వారిని నియంత్రించేందుకు ఉద్ధేశించిన సీసీ కెమెరాల ఏర్పాటును అధికారులు మరిచిపోయారు. ఇందుకోసం మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ అధికారులు మాముళ్లు పుచ్చుకుని చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
నియంత్రణ కరువు
జిల్లా నైసర్గికంగా రెండు ఇతర రాష్ట్రాల సరిహద్దుతో పాటు మారుమూల ప్రాంతం అధికంగా ఉండడంతో మద్యం అక్రమవ్యాపారం మూడు పూలు, ఆరుకాయలుగా సాగుతోంది. అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న మాగనూరు మండలంలోని పలుగ్రామాల్లో కల్తీకల్లు, నాటుసారా విక్రయాలను విచ్చలవిడిగా కొనసాగుతున్నాయనే విషయాన్ని ‘సాక్షి’ ఇటీవల వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కర్ణాటక, మ హారాష్ట్ర ప్రాంతాల నుంచి పన్నులు చెల్లించని మద్యం, కల్తీకల్లులో తయారీలో వినియోగించే క్లోరల్‌హైడ్రేట్(సీహెచ్) సరఫరా అవుతున్నా అధికారులకు కనిపించడంలేదు.
అయితే ఇలాంటి ఘటనలపై చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో అధికారులకు భారీగా కాసులు ముడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో కొందరు అధికారుల అండ చూసుకుని కొన్ని వైన్‌షాపులు సిండికేట్‌గా మారి ఎంఆర్‌పీ ధరల కంటే మద్యంను అధికధరలకు అమ్ముతున్నాయి. ముఖ్యంగా పండుగల సమయంలో ఒక్కోబాటిల్‌పై రూ.10 నుంచి రూ.20వరకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యం విక్రయాలపై నియంత్రణ అవసరమని పలువురు కోరుతున్నారు.
‘మత్తు’.. మామూలే!
Published Mon, Sep 29 2014 1:27 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement