గోడౌన్‌లో ఉన్న బతుకమ్మ చీరలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే పండగ బతుకమ్మ. పేద, ధనిక తారతమ్యం లేకుండా జరుపుకునే పండగ. ఆనందోత్సాహాల మధ్య పండగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని గత ఏడాది నిర్ణయించింది. ఈ మేరకు ముందస్తుగానే జిల్లాకు చీరలు చేరాయి. వీటిని సకాలంలో పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లాలోని 21 మండలాల్లో ఉన్న 18 ఏళ్లు పైబడిన యువతులతోపాటు మహిళలకు గత ఏడాది నుంచి చీరలు పంపిణీ చేస్తున్నారు. 669 రేషన్ దుకాణాల్లో గత ఏడాది 4,48,797 మంది లబ్ధిదారులకు చీరలను అందించగా.. ఈ ఏడాది సుమారు 10వేల వరకు లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది 4.58 లక్షల మంది వరకు లబ్ధిదారులకు చీరలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 669 రేషన్ దుకాణాల్లో 3,95,888 కార్డులున్నాయి. వీటిలో ఆహార భద్రత కార్డులు 3,69,305, అంత్యోదయ కార్డులు 26,581, అన్నపూర్ణ కార్డులు రెండు ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండగను అధికంగా నిర్వహిస్తున్నా రు. ఈ పండగ మహిళలకు సంబంధించినది కావడంతో అందరికీ గుర్తుండిపోయేలా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.
గతంలో ఇలా..
గత ఏడాది నుంచి దసరా పండగ సందర్భంగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని పౌరసరఫరాల శాఖ ద్వారా 18 ఏళ్ల వయసు దాటిన వారందరి వివరాలు సేకరించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ.. జిల్లాలోని మహిళా లబ్ధిదారులకు అనుగుణంగా చీరలను పంపించి.. ఆయా గోడౌన్లలో సిద్ధం చేసింది. అనంతరం పండగకు ముందు చీరలను పంపిణీ చేశారు.
ప్రస్తుతం ఇలా..
గతేడాది సమాచారం ప్రభుత్వం వద్ద ఉండడంతో వాటికి అనుగుణంగా చీరలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
కొత్తగా రేషన్ కార్డులు కొద్ది మందికి రావడంతోపాటు 18 ఏళ్ల వయసు పైబడిన వారు కూడా ఈ ఏడాది ఉంటారనే అంచనాతో ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా వివరాలు సేకరిస్తూ.. మరో 10వేల చీరలను అధికంగా పంపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముందుగానే చీరలను సిద్ధం చేసి.. పండగ సమయానికి ఎటువంటి హడావుడి లేకుండా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో అధికారులున్నారు.
జిల్లాకు చేరిన 96వేల చీరలు
బతుకమ్మ పండగ సందర్భంగా పంపిణీ చేసే చీరలను వైరా, నేలకొండపల్లిలోని వ్యవసాయ మార్కెట్ గోడౌన్లలో సిద్ధంగా ఉంచారు. ఇప్పటివరకు రెండు గోడౌన్లకు కలిపి 96వేల చీరలు వచ్చాయి. అయితే మహిళలకు నచ్చిన విధంగా డిజైన్, రంగులు ఉండాలనే ఉద్దేశంతో అధికారులు ప్రస్తుతం వచ్చిన చీరలపై అభిప్రాయాలను సేకరిస్తున్నారు. జిల్లాకు వచ్చిన బతుకమ్మ చీరల రంగులు, వాటి నాణ్యత, డిజైన్లు రోజూ వాడు తున్న మాదిరిగా ఉన్నాయా..?. ఇంకా ఏమైనా మార్పులు చేయాలా...? తదితర అంశాలపై ప్ర భుత్వం అభిప్రాయ సేకరణ(మహిళల నుంచి ఫీడ్ బ్యాక్) తీసుకుంటోంది. గతంలో చీరల పంపిణీ లో పలు సంఘటనలు ఎదుర్కొన్న అనుభవంతో భవిష్యత్‌లో మహిళలకు నచ్చేలా, మెచ్చేలా చీర లు పంపిణీ చేసేందుకు అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఇటీవల ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మహిళల నుంచి బతుకమ్మ చీరలపై అభిప్రాయాలు తీసుకున్నారు.
చీరలు వస్తున్నాయి..
జిల్లాకు బతుకమ్మ పండగ సందర్భంగా చీరలు వస్తున్నాయి. ఇప్పటివరకు 96వేలు వచ్చాయి. త్వరలో మిగతావి వస్తాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంపిణీ కార్యక్రమం చేపడతాం.– మదన్‌గోపాల్, కలెక్టరేట్ ఏఓ, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment