విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్
హైదరాబాద్: జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీల హక్కులు, విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రావాల్సిన వాటా సాధించేందుకు అన్ని కుల, బీసీ సంఘాలు, రాజకీయ పార్టీల బీసీ నేతలతో కలసి ఆగస్టు 12న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘బీసీ సాధికారత సభ’బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కన్వీనర్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ తెలిపారు. సభకు ముఖ్యఅతిథిగా కేంద్ర మాజీమంత్రి శరద్‌యాదవ్ హాజరుకానున్నట్లు చెప్పారు. సభ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతాయన్నారు.
బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఓయూ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారాం యాదవ్, తెలంగాణ జన సమితి నాయకులు పి.ఎల్.విశ్వేశ్వర్‌రావు, యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్‌తో కలసి మాట్లాడారు. ప్రభుత్వాలు మారినా బీసీల తలరాతలు మారడంలేదని, ఇప్పటికీ అన్ని రంగాల్లో వెనకబడే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బతుకులు మారతాయనుకుంటే ఇంకా అధ్వానంగా తయారయ్యాయని, ఉమ్మడి రాష్ట్రంలో ఆయా కులాల ఫెడరేషన్లకు ప్రభుత్వాలు నిధులు కేటాయించేవని, ఇప్పుడు అదీలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీలు, సిద్ధాంతాలను పక్కనబెట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడిపినట్టుగా అదే స్ఫూర్తితో బీసీ ఉద్యమం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ‘మనమెంతో మన వాటా అంత’అనే నినాదంతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సభలో కర్ణాటక, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, అశోక్ గెహ్లాట్‌తోపాటు బీసీ మేధావులు పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్, సీపీఐ నాయకుడు బాలమల్లేష్, తెలంగాణ ఇంటి పార్టీ ప్రతినిధి దొమ్మాట వెంకటేశ్, వైద్య సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment