ఉప్పుమావులూరి సాంబశివరావు (ఉ.సా)
ఆకలితో ఉన్నవాళ్ళను భూగోళం ఎట్లా కనపడుతుందని అడిగితే విసిరిన అన్నం ముద్దల్లా ఆరు ఖండాలు సముద్రమంత ఆకలితో మధ్య మధ్యలో నేనే అన్నాడట... ఇప్పటికీ కరుణ లేని కరోనా, మృత్యు కోవిదురాలై ప్రతి వాకిట మృత్యుపేటిక పేర్చి నిజంగానే భూగోళం ఎట్లా కనపడుతుందంటే ప్రతి ఖండమూ దహన వాటిక తీరు తగలబడుతుందని అనక తప్పదు. కరోనా గురించి వార్త రాస్తున్న వాళ్ళు చచ్చిపోతున్నారు.. కరోనాను నిలువరించే ముందు వరుస యోధులు డాక్టర్లు, నర్సులు చచ్చిపోతున్నారు. ఈ మహమ్మారిపై పాటల ఖడ్గాన్ని ఝళిపిస్తున్న పాటగాళ్లు, కళాకారులు చచ్చిపోతున్నారు.
ఊరు, పేరు లేని నిరుపేదలు, మట్టిమనుషుల చావులు సర్కారు లెక్కల్లోకి రానే రావడం లేదు. బహుశా మునుపెన్నడూ లేని ఒక భయానక మృత్యుధూళి మన కాళ్ళకింది భూమిని సునామీగా పెకిలించి ఎంతో మంది అద్భుత మానవతా మూర్తుల్ని, యోధుల్ని, మన కోసం జీవితమంతా జ్వలించిన వాళ్ళను దహన వాటికకు తరలిస్తున్నది. దిక్కుతోచక, భయ విహ్వలతతో అంతిమ సంస్కారంలోనూ పాల్గొనక వారి జీవిత కాల సేవాతత్పరతను, స్ఫూర్తిని, ఎత్తిపట్టే చివరి నివాళి కరువు అవుతుందని మన కాలపు యోధుడు ఉప్పుమావులూరి సాంబశివరావు (ఉ.సా) అకాలమరణం గుర్తు చేస్తున్నది. ఎక్కడో గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరులో పుట్టిన డెబ్బయి ఏళ్ళ ఉ.సా అనేక విప్లవ, బహుజన ఉద్యమాల సాధికారత, సార్వత్రికత.. నిరంతర సన్నద్ధత.. ఆ మొన్నటి అర్ధరాత్రి ఉద్యమాల ఉపాధ్యాయుడి ఊపిరిని కరోనా కబళించేదాక ఆయన విశ్రమించిన జీవన ఘడియలు లేవు.
మంగలి కత్తికి, పోరాటపు కొడవలికి ఎంత పదునో చీకొండ మొదలు గిరిజన పోరాటం నడిపిన ఉసానే చెప్పగలడు. కామందు కాఠిన్యం, ఆకలితో ఉన్న పాపను జోకొట్టిన జోలపాట మార్ధవం, కవులు, కళాకారులు ఏంచెయ్యాలో చెప్పే ప్రబోధం, పాటగా అలవోకగా రాస్తూ కాలానికి తాళం వేస్తూ కరువును, కులం బరువును, ఆధిపత్యకులాల దరువును తెలుగు నేల మీద సరిగా అంచనా వేసి దేశీ – దిశ కోసం కారంచేడులో రొమ్ము విరుచుకొని రుదిర క్షేత్రంలో నిలబడడం ఆయనకే సాధ్యమయ్యింది. కరోనా మహమ్మారి కాలంలో మనుషుల విపరీత ప్రవర్తన ఎవరిని వదలడం లేదు. చెన్నైలో, ఇంకా చాలా చోట్ల డాక్టర్లు చనిపోతే శ్మశాన వాటికలో ఖననానికి, దహనానికి అడ్డుపడ్డ అమానవీయ సంఘటనలు ఎన్ని? సేవా మూర్తులకు మనమిచ్చే గౌరవం ఇదేనా? అని ఆయన ప్రశ్నించింది ఇందుకనే.
చెరుకు సుధాకర్ ముందలపడి అంత్యక్రియలు చేస్తే ఆహాహా అంటున్న మిత్రులారా! ఉ.సాకు, జీవితమంతా జ్వలిస్తూ బతికిన ప్రతివాళ్ళకు మనమెట్లాగూ మరణాంతర పురస్కారాలు ఇవ్వలేము, కడచూపులో భాగమవ్వడం మన బాధ్యత. ఇప్పటికే కరోనాపై పలు పుకార్లు మానవ సంబంధాలను చాలా దెబ్బతీశాయి. జరగాల్సిన నష్టం జరిగింది. ఉ.సా నడిచిన ఉద్యమ దారుల్లో ఎదిగి వచ్చిన మిత్రులారా! రండి! మనం సేవాదళ్‌గా ప్రజలకు ఈ కరోనా కష్టకాలంలో మరిం తగా చేరువ కావలసి ఉన్నది. ఏ ఒక్క చావు అగౌరవంగా మట్టిలో కలవకుండా మనం సహకరిద్దాం. మనవాళ్ళ అంత్యక్రియలను కరోనా కాలంలో గౌరవం తగ్గకుండా కొనసాగిద్దాము. ఐసోలేషన్ సెంటర్లలో, హాస్పిటల్స్‌లో సేవలకు స్వచ్ఛందంగా ముందుకు వద్దాం, ఉ.సా కరోనా కాలంలో చనిపోయి మనకు కొత్త బాధ్యతను అప్పజెప్పి వెళ్ళిండు. ఆ బాధ్యతను పూర్తి చేస్తే ఉ.సా.ను సంపూర్ణంగా గౌరవించినట్లే.
వ్యాసకర్త: తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు
మొబైల్ : 98484 72329
Comments
Please login to add a commentAdd a comment