బీర్ల ధరలు పెంపు! | Bear Rates Hike in Telangana | Sakshi
Sakshi News home page

బీర్ల ధరలు పెంపు!

Apr 10 2018 1:23 AM | Updated on Apr 10 2018 1:23 AM

Bear Rates Hike in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: ఇటీవలే మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం బీరు ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. బీర్లపై ప్రస్తుతమున్న రేటును 12 శాతం మేరకు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఈ ఫైలు ముఖ్యమంత్రి తుది పరిశీలనలో ఉంది. బీర్ల ధరల పెంపుతో ప్రభుత్వ ఖజానాకు ప్రతి నెలా రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల మేర ఆదాయం పెరుగుతుందని, ఏటా సుమారు రూ.300 కోట్ల ఆదాయం వస్తుందని ఎక్సైజ్‌ విభాగం లెక్కలు వేసుకుంది. నాలుగేళ్ల నుంచి బీర్ల ధరలు పెంచలేదని, కనీసం ఈసారైనా ధర పెంచాలని బ్రూవరీ కంపెనీలు కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. ఒక్కో బీరుపై కనీసం రూ.6 చొప్పున బేసిక్‌ ధరపై 20 శాతం అదనంగా చెల్లించాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు అందించాయి. 

ఈ నేపథ్యంలోనే ధరలను సమీక్షించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. మూడు నెలల కిందటే రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ గోపాల్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీకి ధరలను సమీక్షించే బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతమున్న ధరలు, ఉత్పత్తిపై జీఎస్‌టీ ప్రభావం అంచనాలను వేసిన కమిటీ.. 12 శాతం ధరలు పెంచేందుకు సిఫారసు చేసినట్లు సమాచారం. కమిటీ నివేదిక ఆధారంగా ఎక్సైజ్‌ విభాగం తాజా ధరల పెంపు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. సీఎం తీసుకునే నిర్ణయం మేరకు ధరల పెంపు ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో బీర్ల వినియోగం ఏటా రికార్డు స్థాయిలో నమోదవుతోంది. రోజుకు 8 లక్షల మంది 13 లక్షల బీర్లు తాగుతున్నట్లు టీఎస్‌బీసీఎల్‌ నివేదికలున్నాయి. గతేడాది ఎక్సైజ్‌ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.15 వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి ఎక్సైజ్‌ ఆదాయం మరింత పెరుగుతుందని ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనాలు వేసుకుంది. బీర్ల ధరలు పెంచటం ద్వారా ఆదాయం పెరుగుతుందని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. వారం రోజుల్లోనే ధరల పెంపునకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement