అంతా కలలా..
స్నేహితులను కాపాడలేకపోయా..
కళ్లెదుటే కొట్టుకుపోయారు
పరుగెత్తినా పట్టుకోలేకపోయా..
ప్రత్యక్షసాక్షి రఘువంశీ
దొరకని శ్రీనిధి ఆచూకీ
‘అప్పటిదాకా అందరం అక్కడే ఎంజాయ్ చేశాం. ఫొటోలు దిగాం. మేం ఉన్నచోట రాళ్లు చిన్నగా ఉన్నయ్. అక్కడికి కొద్దికొద్దిగా నీళ్లు రావడంతో ఎందుకైనా మంచిదని నాతోపాటు మరో ఇద్దరు మిత్రులు ఒడ్డుకు వచ్చాం. మా వెనకాలే మరొకరు వచ్చారు. ఇంతలో నీళ్లు ఒక్కసారిగా వరదలా వచ్చాయి. అతడు మునిగిపోతుంటే పట్టుకున్నాం.మిగతావారిని మాత్రం కాపాడలేకపోయాం. అసలు ఏం జరిగిందో అర్థంకాలేదు.అంతా కలలా అయిపోయింది. వారు బతికిరావాలని కోరుకుంటున్నా..’
హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నది ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డ జిల్లా కేంద్రానికి చెందిన కొక్కుల రఘువంశీ మంగళవారం ఇంటికి చేరుకున్నాక చెప్పిన మాటలు. ఆనాటి ప్రమాదం జరిగిన తీరు అతడి మాటల్లోనే...
‘ఈ నెల 8న ఆదివారం అందరం కలిసి కులుమనాలి వెళ్లడానికి నిర్ణయించుకుని, మధ్యలో బియాస్ నది వద్ద ఆగాం. మొత్తం 49మందిమి కిందికి దిగి గ్రూపులు గ్రూపులుగా అటూ... ఇటూ వెళ్లాం. నది అందంగా కనిపించడంతో సాయంత్రం 6.15గంటల సమయంలో బియాస్‌నదిలోకి ఫొటోలు దిగేందుకు వెళ్లాం. కొందరు ఒకవైపు...మరికొందరు ఇంకోవైపు వెళ్లాం. 20నిమిషాల అనంతరం మేం ఉన్న చోట చిన్నచిన్న రాళ్లు కొంచెంకొంచెం మునుగుతుండడంతో ఎందుకైనా మంచిదని మేం త్వరగా నడుచుకుంటూ ఒడ్డుకు వచ్చాం. మాతోపాటు ఉన్న ఒకరు నీటిలో పడిపోతుంటే పట్టుకుని పైకి లాగాం. మాకు సమీపంలోనే 24 మంది మూడు గ్రూపులుగా విడిపోయి పెద్దపెద్ద రాళ్లు ఎక్కి ఫొటోలు దిగుతున్నరు. నీటి లెవల్ పెరగడంతో వారు ఒడ్డుకు చేరలేకపోయారు. అటూ.. ఇటూ... తిరుగుతూ బయటపడేందుకు ప్రయత్నం చేసి నా.. క్షణాల్లోనే వేగంగా వచ్చిన నీటిలో కొట్టుకుపోయారు. రక్షిద్దామని అరుచుకుంటూ ఒడ్డు వద్దకు కొందరితో కలిసి చేరినం.
ఒడ్డు వెంట పరిగెత్తినా కూడా లాభం లేకపోయింది. అంతా మునిగిపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు. చా లాసేపటి దాకా కోలుకోలేకపోయాం. మాకు తెలిసినవారందరికీ సమాచారం అం దించాం. ప్రమాదం జరిగిన రెండున్నర గంటల తర్వాత పోలీసులు వచ్చారు. చీకటి కావడంతో గాలింపు చేపట్టలేమని ఉదయం చూద్దామని చెప్పి కొందరు సిబ్బందిని అక్కడ ఉంచి వెళ్లిపోయారు. ఉదయం దాకా అక్కడే పడిగాపులు పడ్డాం. తెల్లారి 10 గంటలకు గాలింపు మొదలుపెట్టారు. అప్పటికే నది ఇంకా వేగంగా ప్రవహిస్తోంది. ఒడ్డు వద్ద ఎవరైనా ఉంటారని ఆశగా గాలించినా లాభం లేకపోయింది. అప్పటిదాకా కేరింతలతో ఆనందంగా గడిపిన మిత్రులు గల్లంతయ్యారంటే ఇప్పటికీ నమ్మలేకున్నా... అధికారులు నాతోపాటు 24 మందిని సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించారు. రాత్రి 12 గంటలకు హైదరాబాద్ వచ్చినా... ఆ ఘటన తల్చుకుంటేనే.. చాలా భయంగా అనిపిస్తోంది.’