చివరిచూపూ దక్కలేదు
అణువణువూ గాలించినా...
బియాస్‌లో ఓడి వెనుతిరిగినశ్రీనిధి తండ్రి
నా బిడ్డ ఏదంటూ తల్లి ఆక్రందన
కరీంనగర్ రూరల్ : జలప్రవాహానికి బలైన కన్నబిడ్డ జాడకోసం... కళ్లల్లో వత్తులు వేసుకుని దాసరి శ్రీనిధి తండ్రి రాజిరెడ్డి చూసిన ఎదురుచూపులు ఫలించలేదు. బిడ్డను కడసారి చూపయినా చూసుకుందామనుకున్న ఆశ నెరవేరలేదు. హృదయపొరల్లో నిక్షిప్తమైన ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బియాస్ నది వద్ద పదిరోజులుగా పడిగాపులు గాసినా బిడ్డ జాడ తెలియకపోవడంతో... గుండెలనిండా ఉన్న బాధను గొంతులో దిగమింగుకుని రిక్తహస్తాలతో గురువారం ఇల్లు చేరారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఈ నెల 8న గల్లంతయిన కరీంనగర్ మండలం రేకుర్తికి చెందిన దాసరి శ్రీనిధి ఆచూకీ ఇప్పటిదాకా తెలియరాలేదు. సంఘటన జరిగిన మరునాడే ఆమె తండ్రి రాజిరెడ్డి హిమాచల్‌ప్రదేశ్ వెళ్లారు. పది రోజులుగా కూతురు ఆచూకీ కోసం అక్కడే పడిగాపులు కాశారు. ఒక్కొక్క మృతదేహం బయటపడుతుంటే... తమ కూతురుదేమోనని ఆత్రుత గా... ఆందోళనగా వెళ్లి చూస్తూ... కాదని నిర్ధారించుకుంటూ నరకయాతన అనుభవించారు.
రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ బియాస్ నది వద్ద రాజిరెడ్డిని ఓదార్చి ధైర్యం చెప్పారు. 24 మంది గల్లంతు కాగా పది రోజులపాటు రెస్క్యూ బృందాలు, గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టినా గురువారం వరకు 14 మృ తదేహాలు లభ్యమయ్యాయి. గాలింపు కష్టమని అక్కడి ప్రభుత్వం భావించి విద్యార్థుల పేరిట ఈ నెల 17న డెత్ సర్టిఫికెట్లు కూడా జారీ చేసింది. ఒకవేళ మృతదేహాలు లభిస్తే హైదరాబాద్‌కు పంపిస్తామని ప్రకటించడంతో... ఇక ఆశలు వదులుకు న్న రాజిరెడ్డి అక్కడినుంచి భారంగా బయలుదేరారు. కూతు రు కోసం వెళ్లిన ఆయన గురువారం వేకువజామున పుట్టెడు దుఃఖంతో రిక్తహస్తాలతో ఇల్లు చేరారు. ఆయన రాకతో ఆ ఇల్లు కన్నీటి సంద్రమే అయ్యింది. నా బిడ్డ ఏదంటూ శ్రీనిధ/ తల్లి ఆయనను ప్రశ్నించేసరికి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. రాజిరెడ్డిని ‘సాక్షి’ ఓదార్చుతూ... పలకరించగా అంతవరకు కట్టలు కట్టుకున్న కన్నీరు ఓ ప్రవాహమే అయింది. గుండెల నిండా ఉన్న బాధను పంచుకోవాల నే ఆరాటమున్నా... కళ్లల్లో తిరుగుతున్న నీళ్ల సుడులతో ఆయ న గొంతు పెగలలేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న శ్రీనిధి నదీ ప్రవాహంలో తరలిరాని దూరాలకు వెళ్తుందని అనుకోలేదని, అణువణువూ గాలించినా... ఎక్కడా జాడ కనిపించలేదని... ఆయన విలపిస్తూ తెలిపారు. శ్రీనిధి జాడ తెలుస్తుంద నే ఆశ రోజురోజుకూ సన్నగిల్లుతున్నప్పటికీ కనీసం నిర్జీవ దేహమైనా లభిస్తుందనే ఆశతో బుధవారం రాత్రంతా ఢిల్లీలో వేచిచూశానని విలపించారు. గురువారం గాలింపులో మూడు మృతదేహాలు లభించడంతో నా బిడ్డ జాడ కూడా దొరుకుతుందనే ఆశ కలుగుతోందని గద్గరస్వరంతో చెప్పారు.