బ్యూటీ.. షూట్ | Beauty shoot: Atul kasbekar is famous Add shoot over Indian fashion industry | Sakshi
Sakshi News home page

బ్యూటీ.. షూట్

Published Thu, Aug 7 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM

బ్యూటీ.. షూట్

బ్యూటీ.. షూట్

భారతీయ ఫ్యాషన్‌రంగంలో తిరుగులేని పేరు అతుల్ కస్బేకర్ . దీపికాపదుకునే, కత్రినాకైఫ్, ప్రియా త్రివేది... ఇలా అగ్రగామి బాలీవుడ్ తారలెందరికో లాంచింగ్ ప్యాడ్‌గా మారిన కింగ్‌ఫిషర్ కేలండర్‌కు ఫొటోగ్రాఫర్. దేశంలోనే అతి ఖరీదైన కేలండర్‌కు దన్ను విజయ్‌మాల్యా అయితే ‘కన్ను’ అతుల్. సిటీప్లస్ యాడ్ షూట్ కోసం మంగళవారం నగరానికి వచ్చిన సందర్భంగా పంచుకున్న ముచ్చట్లు..
 - ఎస్.సత్యబాబు
 
 కేఎఫ్ కేలండర్స్‌కు కర్త, కర్మ, క్రియ విజయ్ మాల్యా గారే. మోడల్స్ ఎంపికలో మాత్రమే నా ప్రమేయం ఉంటుంది. దీన్ని స్టార్ట్ చేసేటప్పుడు మోడల్స్‌కు ఓ మంచి ప్లాట్‌ఫామ్ అవుతుందనుకున్నాం. కానీ ఆశించినదానికి మించి క్లిక్ అయింది. బ్యూటీ పేజెంట్స్‌ను మించిపోయింది. నిజానికి ఐశ్వర్య, సుస్మిత, ప్రియాంక, లారా దత్తా... తర్వాత బ్యూటీ పేజెంట్స్ నుంచి వచ్చిన ఏ తారా బాలీవుడ్‌లో రాణించలేదు. అందుకే కేఎఫ్ మీదే ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఆధారపడతారు. ఎక్కడా రాజీపడకుండా క్యాలెండర్ రూపొందుతోంది. ఇంతకన్నా ఖరీదైన ప్రింట్ షూట్ దేశంలోనే లేదు. సో .. అంత గొప్ప వర్క్ చేస్తున్నాను. సొంత కేలండర్ ఆలోచనే లేదు. వచ్చే సంవత్సరం క్యాలెండర్ కోసం ఎన్‌డీటీవీ గుడ్‌టైమ్స్‌లో బ్యూటీ హంట్ జరుగుతోంది. అదయ్యాక నెక్ట్స్ ఇయర్ లొకేషన్ ఫిక్స్ అవుతుంది. లొకేషన్స్ విషయానికొస్తే సౌతాఫ్రికాలో ప్రకృతి అద్భుతంగా ఉంటుంది.
 
 ఒరిజినాలిటీయే క్వాలిటీ...
 నాకు డస్కీ వర్క్ ఇష్టం. బ్రౌన్ అండ్ బ్యూటిఫుల్‌తో వర్క్ చేయడం ఇష్టపడతాను. ఉదాహరణకు సౌతాఫ్రికాలో అందమైన వాళ్లెందరో ఉన్నారు. అక్కడ వారిలో డచ్, జర్మన్, ఆఫ్రికన్, ఇంగ్లిష్ లుక్స్ ఇవన్నీ కలుస్తాయి. ఇక రూరల్ సైడ్ ఉన్నంత అందం మరెక్కడా ఉండదు. ఈ విషయంలో ఏదైనా టీవీ ఛానెల్ ముందుకొస్తే కలిసి పనిచేయడానికి నేను రెడీ. స్టైలిష్ పీపుల్ ఉన్న కంట్రీ అంటే ఇటలీ. అక్కడ అందరూ లుక్ విషయంలో చాలా ఎఫర్ట్ పెడతారు. ఎన్ని ట్రిక్స్ వచ్చినా ఒరిజినాలిటీయే క్వాలిటీ.

‘ఫొటోజెనిక్’ని వందశాతం విశ్వసిస్తాను. ఉదాహరణకి లీసారే. ఆమె చూడటానికి బాగుంటుంది. కెమెరా ముందు అద్భుతంగా ఉంటుంది. లీసారే తర్వాత మలైకా అరోరా నాకు అన్‌బిలీవబుల్ అనిపిస్తుంది. మగవాళ్లలో ఫొటోజెనిక్.. రణబీర్ సింగ్. లుక్స్‌తో చాలా ప్రయోగాలు చేస్తాడు. మిళింద్ సోమన్‌తో పనిచేయడాన్ని కూడా ఇష్టపడతాను. ఇక టాలీవుడ్ హీరోల్లో మహేష్‌బాబు నైస్ మేన్ అనిపిస్తాడు. అఫ్‌కోర్స్ గుడ్‌లుకింగ్ కూడా.
 
  ఫొటో వాల్యూ ఫొటోదే..
 ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఫొటోగ్రాఫర్లు నా స్టూడియో నుంచి ఈ ఇండస్ట్రీలోకి వచ్చారు. వారి అసిస్టెంట్లు కూడా బోలెడంత మంది వచ్చారు. బాగా బిజినెస్ చేస్తున్నారు. ఇంత మందిని మరే ఇతర ఫొటోగ్రాఫర్ తయారు చేయలేదని గర్వంగా చెప్పగలను. మన దగ్గర ఫ్యాషన్, యాడ్ ఇండస్ట్రీ ఫొటోగ్రాఫర్స్ యాడ్‌కు, క్యాటలాగ్‌కు తేడా తెలీకుండానే వర్క్ చేస్తున్నారు. ప్రింట్‌కి ఇంపార్టెన్స్ తగ్గి వీడియోకి పెరిగినా ఫొటో వాల్యూ ఫొటోదే. నాది పీపుల్ ఫొటోగ్రఫీ. మల్టీమిలియనీర్ నుంచి టీ బాయ్ దాకా అందరిలో అందం చూస్తాను. అందరితో సంభాషించాలనుకుంటాను. నాకిచ్చిన వ్యక్తితో మంచి పిక్చర్‌ను తీయడం నాకు ఆనందాన్నిచ్చే చాలెంజ్.
 
 లైఫ్ ముఖ్యం
 రెండు బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా చేశాను. మూవీ ఆఫర్స్ వచ్చాయి. నటించను కానీ డెరైక్షన్ చేసే అవకాశం ఉంది. బాబీ జాసూస్ సినిమా నిర్మాణంలో దియామీర్జాతో పాలుపంచుకున్నా. ప్రస్తుతం రెండు చిత్రాలపై దృష్టి పెట్టాను. కెరీర్ కన్నా లైఫ్ ముఖ్యం నాకు. చాలా మంది క్రియేటివ్ పీపుల్‌ని కలవాలి. వర్క్ చేయాలి. మూవీస్ నుంచి ఇ-కామర్స్ దాకా ఇంట్రెస్టింగ్ అనిపించే ప్రపోజల్స్‌తో ఎవరొచ్చినా చేయడానికి రెడీ.
 
 ఫాలోయింగ్ ఎక్కువ
 నా భార్య వందన చాలా మంచిది. అందమైంది కూడా. నాకు సంబంధించిన ప్రొడక్షన్ వర్క్ తనే చూస్తుంది. మా అబ్బాయికి 17 ఏళ్లు. వెరీ గుడ్‌లుకింగ్ గై. ఇప్పటికే వాడికి అవసరమైనంత ఫిమేల్ ఫాలోయింగ్ ఉంది (నవ్వులు). అమ్మాయికి కూడా టూమచ్‌గా అబ్బాయిల ఫాలోయింగ్ ఉంది. బాగా చదువుకుంటున్నారు. కాబట్టి నాలా ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ కానక్కర్లేదు. నేను చూడండి... ఇంజనీరింగ్ చదివి ఇటొచ్చా. వాళ్ల కెరీర్ సంగతి వాళ్లిష్టం.
 
 నేనూ ఉంటాగా..
మా ఇద్దరిదీ ప్రేమ వివాహం. మేం లవ్‌లో ఉన్నప్పుడు అతుల్ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ కాదు. పెళ్లయిన తర్వాత ఇటొచ్చారు. నిత్యం దేశంలోని అత్యంత అందమైన అమ్మాయిల్ని ఫొటోలు తీస్తుంటాడు అతుల్. అది  నాకెప్పుడూ ఇబ్బందిని కలిగించలేదు. ఎందుకంటే నేను మా ఇద్దరి మధ్య ఉన్న లవ్‌ని నమ్ముతాను. గత కొంతకాలంగా తన ప్రతి వర్క్‌కు సంబంధించిన వ్యవహారాల్లో నేను పాల్గొంటున్నాను. కాబట్టి ఇప్పుడైతే  ప్రతి క్షణం తనని అంటిపెట్టుకునే ఉంటాను. తను మంచి ఫొటోగ్రాఫర్ మాత్రమే కాదు మంచి హజ్బెండ్,  మంచి ఫాదర్ కూడా.
 - వందన
 
 ఐ లైక్ సిటీ...
 బహుశా కేఎఫ్ కేలండర్ స్టార్ట్ అయిన ఇయర్ నుంచి హైదరాబాద్‌కి వస్తున్నా. ఐ లైక్ దిస్ సిటీ. ఇక్కడ నాకు రెగ్యులర్ క్లయింట్లు, మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇన్‌ఫ్యాక్ట్... లాస్ట్ ఇయర్ కింగ్‌ఫిషర్ కేలండర్ డిజైన్ చేసిన ‘డూ క్రియేటివ్’ ఇక్కడి సంస్థే. సిటీలో చాలా ఇంప్రూవ్‌మెంట్స్ కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లొకేషన్స్‌లో షూట్ చేయలేదు కానీ.. ఇక్కడ నుంచి ముంబై వచ్చిన రానా, తమన్నా, ఇలియానాతో వర్క్ చేశాను. సౌత్ ఇండియాలో శీతల్‌మల్లార్, లక్ష్మీమీనన్, శిల్పారెడ్డి, శోభిత... ఇంకా చాలా మందితో వర్క్ చేశాను. హైదరాబాదీ శిల్పారెడ్డి ఇప్పటికీ ఫిజిక్ చక్కగా మెయిన్‌టైన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement