
వెంటాడి.. తూటా పేల్చి..
అటవీ జంతువు నీలుగాయిని వేటాడి మిత్రులకు విందు ఇవ్వాలనుకున్నాడో వ్యక్తి. లెసైన్స్‌డ్ తుపాకీతో నీలుగాయిని హతమార్చి విందుకు సిద్ధం చేశాడు.
జల్సా కోసం నీలుగాయిని హతమార్చిన మిత్ర బృందం
జల్సా కోసం ఓ మిత్ర బృందం వణ్యప్రాణిని వేటాడింది. తూటా పేల్చి ఆ మూగజీవిని బలితీసుకుంది. తమ వ్యవసాయ భూమి చుట్టూ తిరుగుతున్న నీలుగాయిలను ఎలాగైనా వెంటాడి.. వేటాడాలనుకున్న ఆ బృందం.. రాత్రిల్లో వేట సాగించింది. ఒకదానిని చంపేయడమే కాకుండా అక్కడే తమ కార్లో పాటలు వినుకుంటూ నృత్యాలు చేస్తూ నానా హంగామా చేశారు. ఇదంతా గమనించిన పరిసర రైతులు పోలీసులకు ఫిర్యాదు అందించారు. వారు వచ్చి తనిఖీలు చేపట్టగా అసలు విషయం బయటపడింది.
* తుపాకీ తూటాకు నీలుగాయి హతం
* చిందేసిన మిత్ర బృందం
* పోలీసుల అదుపులో నిందితులు
తానూరు : అటవీ జంతువు నీలుగాయిని వేటాడి మిత్రులకు విందు ఇవ్వాలనుకున్నాడో వ్యక్తి. లెసైన్స్‌డ్ తుపాకీతో నీలుగాయిని హతమార్చి విందుకు సిద్ధం చేశాడు. మద్యంమత్తులో వేసిన చిందులతో కటకటాల్లోకి వెనక్కి వెళ్లాడు. విం దుకు ఆశపడి హైదరాబాద్ నుంచి వచ్చిన కొందరూ ఊచలు లెక్కించాల్సి వచ్చింది. మండల కేంద్రమైన తానూర్‌కు చెందిన మాజిద్‌ఖురేషి కుటుంబ సభ్యులకు గ్రామ శివారులోని గుట్ట వ ద్ద వ్యవసాయ భూములు ఉన్నాయి. కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడగా.. మాజిద్‌ఖురేషి అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తూ వ్యవసాయ భూములు చూసుకుంటున్నాడు. పొలం చుట్టూ నీలుగాయిలు సంచరిస్తుండడంతో అతడి కన్ను వాటిపై పడింది.
నీలుగాయిలను వేటాడి మాంసం ఆరగించాలని మిత్రబృందంతో హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరుకున్నాడు. మంగళవారం సాయంత్రం తానూరుకు వచ్చిన మిత్రులతో కలిసి పొలానికి వెళ్లాడు. వెంట తెచ్చుకున్న లెసైన్స్‌డ్ తుపాకీతో నీలుగాయిని వేటాడి చంపాడు. చర్మాన్ని తొలగించి తల, కాళ్లు పక్కన పడేశారు. మంసాన్ని సంచుల్లో నింపి విందు కోసం పెద్ద పెద్ద వంటపాత్రలు సిద్ధం చేశారు. హైదరాబాద్‌లో ఉండే మరికొంతమంది మిత్రబృందాన్ని విందుకు ఆహ్వానించారు. పిలిచిందే తడవుగా వచ్చిన మరికొందరు పంటపొలంలోనే చిందులు వేశారు.
మద్యంమత్తులో వారంతా చిందులు వేయడం, వాహనాల హడావుడితో ఏం జరుగుతుందో తెలియని స్థానిక రైతులు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లే సరికి నీలుగాయిని హతమార్చిన విషయం బయటపడింది. దీంతో అక్కడే ఉన్న మాజిద్‌ఖురేషితోపాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేటకు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వస్తున్న విషయాన్ని గమనించి కొంతమంది అక్కడి నుంచి నిష్ర్కమించారు. భైంసా డీఎస్పీ రావుల గిరిధర్ గుట్టప్రాంతానికి వచ్చి వేటకు ఉపయోగించిన తుపాకీని పరిశీలించారు. అటవీ చట్టం ప్రకారం నిందితులపై చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. కాగా, బుధవారం ఉదయం ఈ విషయం వెలుగు చూడడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.