- గతమెంతో ఘనం.. నేడు దైన్యం
- జాడలేని మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు
- బయటి మార్కెట్‌లో గిట్టుబాటుకాని ధర
- క్వింటాళుకు రూ.3 వేలు ఇవ్వాలంటున్న రైతులు
- కొనుగోలుకు అంతగా ఆసక్తి చూపని వ్యాపారులు
- ఇప్పటికే భారీగా తగ్గిపోయిన చెరుకు సాగు
- తీపి పంచే కర్షకుడికి మిగులుతున్నది చేదే
కామారెడ్డి : బెల్లం కొనుగోలు విషయాన్ని మార్క్‌ఫెడ్ అధికారులు మరిచిపోయారు. మరోవైపు ఆరుగాలం కష్టించి చెరుకు పండించిన రైతులు బెల్లం తయారీకి రాత్రీపగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు. ఇంత చేసినా బెల్లాన్ని అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, మార్కెట్‌లో ధర గిట్టుబాటు కాకపోవడంతో మిగిలేది ఏమీ లేదని రైతులు వాపోతున్నారు.
అనధికార ఆంక్షలను బూచిగా చూపుతూ బెల్లం వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి చూపక పోవడంతో ధరలు పెరగడం లేదు. గతేడాది మార్క్‌ఫెడ్ అధికారులు క్వింటాళుకు రూ.2,600 చొప్పున కొనుగోలు చేశారు. డబ్బుల చెల్లింపు విషయంలో ఆలస్యం జరిగినా ధర కొంత అనుకూలంగా ఉండేది. ఈ సారి కొనుగోలు కేంద్రాల సంగతిని మార్క్‌ఫెడ్ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు బెల్లాన్ని అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నారు.
బెల్లం తయారీలో కామారెడ్డి టాప్
బెల్లం ఉత్పత్తిలో తెలంగాణలోనే కామారెడ్డి ప్రాంతం ఉన్నత స్థానంలో ఉండేది. అప్పట్లో ఏటా కామారెడ్డి డివిజన్‌లో 60వేల ఎకరాల నుంచి 70 వేల ఎకరాల వరకు చెరుకు పంట సాగయ్యేది. వందలాది లారీలలో బెల్లం గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక వంటి రాష్ట్రాలకు తరలిపోయేది. చెరుకు పంట నరికివేతకు రాకన్నా ముందే క్ర షర్లను, పొయ్యిలను రెడీ చేసుకునేవారు. ఏ ఊరికి వెళ్లినా వందలాది క్రషర్లు నడిచేవి. రాత్రి, పగలు తేడా లేకుండా రైతులు క్రషర్ల వద్ద పనులలో నిమగ్నమయ్యేవారు.
బెల్లం తయారు చేసిన రైతులేగాక, బెల్లం వ్యాపారులు కూడా లాభాలు ఆర్జించేవారు. ఇదంతా గతం. ఇప్పుడు బెల్లం పేరెత్తితే చాలు పెదవి విరుస్తున్నారు. చెరుకు పం ట సాగు నుంచి మొదలుకొంటే బెల్లం తయారీదాకా అన్ని రకాల పెట్టుబడులు భారీగా పెరిగాయి. కామారెడ్డి ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే నల్లబెల్లంపై అప్పట్లో తెలుగు దేశం ప్రభుత్వం విధించిన ఆంక్షల ప్రభావంతో ధరలు పడిపోయి తయారీకి బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు కామారెడ్డి డివిజన్‌లో 20 వేల ఎకరాలకు మించి చెరుకు పంట సాగు కావడం లేదు. ఆంక్షలపై బెల్లం రైతులు ఎన్నో పోరాటాలు చేశారు.
భిక్కనూరులో ఆందోళనలు తీవ్రరూపం దాల్చి పోలీసు లాఠీచార్జీ చేయడంతో, కోపోద్రిక్తులైన రైతులు పోలీసు వాహనాలను, బస్సులను ధ్వంసం చేశారు. ఈ సంఘటన అప్పట్లో సంచలనం రేపింది. 40 మంది వరకు రైతులను జైలుకు పంపించారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తరువాత బెల్లంపై ఆంక్షలను ఎత్తివేశారు. గత రెండుమూడేళ్ల కాలంలో బెల్లంపై అనధికార ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇటీవల రైతులు, వ్యా పారులు సీఎం కేసీఆర్‌ను కలిసి విన్నవించగా ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దని అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ మార్కెట్‌లో బెల్లం ధరలు పెరగడం లేదు.
భారీగా పెరిగిన బెల్లం తయారీ ఖర్చు
చెరుకు సాగుతోపాటు, బెల్లం తయారీ విషయంలోనూ ఖర్చులు భారీగా పెరిగాయి. సాగుకు ఎకరానికి రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చవుతుంది. బెల్లం తయారీకి ఎకరాకు రూ. 25 వేల వరకు ఖర్చవుతుంది. మొత్తంగా ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో బెల్లం క్విం టాళుకు రూ.2,300 ధర పలుకుతోంది. ఎకరాకు 250 ముద్దల బెల్లం తయారవుతుంది. ఒక్కో ముద్ద తయారీకి రూ. వంద ఖర్చవుతుంది. బెల్లం 35 క్వింటాళ్ల వరకు అవుతోంది. అమ్మడం ద్వారా రూ.80 వేల ఆదాయం వస్తోంది. ఖర్చులకు రూ.80 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. పెట్టుబడి, ఆదాయం ఒకే స్థాయిలో ఉంటోంది. దీంతో ఏడాది శ్రమించినా మిగులుబాటు ఉండడం లేదు. అందరికీ తీపిని పంచే రైతులు తమకు మాత్రం చేదు తప్పదడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమవైపు చూడాలని వేడుకుంటున్నారు.