ప్రాణం తీసిన పందెం
మద్యం ఫుల్‌బాటిల్ దింపకుండా తాగి ఒకరి మృతి అపస్మారక స్థితిలో మరో ఇద్దరు
సిరిసిల్ల: మద్యంపై ముగ్గురు స్నేహితులు కాసుకున్న పందెం ఒకరి ప్రాణం తీసింది. మరో ఇద్దరి ప్రాణాల మీదికి తెచ్చింది. దించకుండా ఫుల్‌బాటిల్ తాగాలని పందెం కాసుకున్న మిత్రులు ముగ్గురూ మద్యం తాగగా వారిలో ఒకరు వాంతులు చేసుకుని మరణించారు. మిగిలిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం తంగళ్లపల్లికి చెందిన హమాలీ కరికె రవి(38), తాపీమేస్త్రీ రంగు నర్సయ్య, ఆటో డ్రైవర్ కుమ్మరి దేవయ్య స్నేహితులు. ఈ ముగ్గురు గురువారం ఫుల్‌బాటిల్ మద్యం దించకుండా తాగాలని, ఎవరు ముందు తాగితే వారు గెలిచినట్టు అని పందెం కాసుకున్నారు. మూడు మద్యం బాటిళ్లు తెప్పించుకుని ఎవరికి వారు గటగటా తాగేశారు. ఘాటు నషాళానికి ఎక్కడంతో తీవ్రంగా వాంతులు చేసుకున్నారు. కరికె రవి తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. రంగు నర్సయ్య, కుమ్మరి దేవయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే వారిని కుటుంబసభ్యులు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మద్యంలో విషప్రయోగం జరగడం వల్లే రవి మరణించాడని కుటుంబసభ్యులు, తంగళ్లపల్లికి వచ్చి రోడ్డుపై బైఠాయించారు.
రూ.కోటి విలువైన గుట్కా ప్యాకెట్ల పట్టివేత
చింతూరు : రాజస్థాన్, గుజరాత్ నుంచి తెలంగాణ, కర్నాటకకు నాలుగు లారీలలో తరలిస్తున్న కోటి రూపాయల విలువైన నిషేధిత గుట్కా, పాన్ మసాల ప్యాకెట్లను చింతూరు పోలీసులు గురువారం పట్టుకున్నారు. లారీలను సీజ్ చేసి చింతూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ లారీలలో మొత్తం 32 టన్నుల బరువున్న 490 బ్యాగులు ఉన్నాయి. చింతూరు మండలం చట్టి వద్ద గురువారం వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు.. వీటిలోని గుట్కా ప్యాకెట్ల బ్యాగులను స్వాధీనపర్చుకున్నారు. లారీలను సీజ్ చేసి, డ్రైవర్లను, సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.