బెట్టింగ్‌ జోరు.. గెలుపు ఎవరిదో.. | Bettings In Elections On Nizamabad | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ జోరు.. గెలుపు ఎవరిదో..

Published Tue, Apr 9 2019 5:49 PM | Last Updated on Tue, Apr 9 2019 5:50 PM

Bettings In Elections On Nizamabad - Sakshi

ఆర్మూర్‌: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల అభ్యర్థుల గెలుపు, ఓటములపై జోరుగా బెట్టింగ్‌ కొనసాగుతోంది. ప్రధాన కూడళ్లలో నలుగురు కలిసి కూర్చుంటే చాలు ఎన్నికల గెలుపు ఓటములపైనే ప్రధానంగా చర్చించుకుంటున్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి అభ్యర్థుల గెలుపు ఓటములపై ఆన్‌లైన్‌లో పందెం కడుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల పేర్లపైనే బెట్టింగ్‌ సాగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో మొట్టమొదటి సారిగా నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి 178 మంది రైతులు నామినేషన్లు వేసిన విషయం విదితమే. కాగా ఈ రైతుల ఓట్లు చీలడంతో అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపవచ్చనే చర్చ బెట్టింగ్‌ రాయుళ్ల మధ్య ప్రధానంగా సాగుతోంది. పోటీలో నిలిచిన అభ్యర్థుల గత చరిత్ర, ప్రస్తుత బలాబలాలు, బలహీనతలను పరిశీలించి ఒక అంచనాకు వస్తున్నారు. 

జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో ఈ బెట్టింగ్‌ జోరుగా కొనసాగుతోంది. ఆర్మూర్‌ పట్టణంలోని ప్రధాన వీధులైన కొత్తబస్టాండ్, అంబేడ్కర్‌ చౌరస్తా, పాతబస్టాండ్, గోల్‌బంగ్లాలు బెట్టింగ్‌ సెంటర్లయ్యాయి. క్రికెట్‌ బెట్టింగ్‌లా చైన్‌ పద్ధతిలో కాకుండా వ్యకిగతంగా డబ్బుల పంపకం నిర్వహిస్తున్నారు. మెజారిటీ స్థానాలలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొనడంతో బెట్టింగ్‌ ఆయా పార్టీల అభ్యర్థులపై కాస్తున్నారు. నామినేషన్ల పర్వం పూర్తయిన తరువాత ఈ బెట్టింగ్‌ల జోరు మరింత పెరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ  పార్లమెంట్‌ ఎన్నికల్లో ధన ప్రవాహం అధికంగా ఉంటుందని ప్రచారం జరుగుతుండడంతో బెట్టింగ్‌ల జోరు సైతం అదే పద్ధతిలో కొనసాగుతోంది. తమ అభ్యర్థులు గెలుస్తారని ఒకరు, కాదు తమ నాయకుడే గెలుస్తారని ఇంకొకరు ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు కట్టడం ప్రారంభించారు. జిల్లాతో పాటు ఆర్మూర్‌ ప్రాం తంలో క్రికెట్‌ బెట్టింగ్‌లు, మట్కా జూదం గతంలో విచ్చలవిడిగా సాగిన సందర్భాలున్నాయి.

ఈజీ మనీకి అలవాటు పడ్డవారు ఈ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. నామినేషన్ల పర్వం ప్రారంభమైన నాటి నుంచే ఈ బడా బాబులు అభ్యర్థుల గెలుపు, ఓటమిలపై చర్చించుకోవడం ప్రారంభించారు. తమ విశ్లేషణ ప్రకారం ఫలాన అభ్యర్థి ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందుతారు. చూడండి అంటూ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. రూ. ఐదు వేల నుంచి మొదలుకుని రూ. లక్ష వరకు బెట్టింగ్‌లో కాయడం ప్రారంభించారు. రూ. లక్ష బెట్టింగ్‌ కాసి విజయం సాధిస్తే అతని ప్రత్యర్థి రూ. లక్షకు రూ. రెండు లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

ఆర్మూర్‌ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వ్యాపారులు, రాజకీయ నాయకులు సైతం ఈ బెట్టింగ్‌లలో పాల్గొంటున్నారు. ఎంపీ అభ్యర్థుల గెలుపు ఓటములతో పాటు దేశంలో ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుంది పలానా వ్యక్తి ప్రధానమంత్రిగా బాధ్యతలు సైతం స్వీకరిస్తాడంటూ కావలిస్తే బెట్‌ కట్టండి అంటూ ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకుంటున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంతో రాజకీయాల గురించి చర్చించుకునే వారికి, బెట్టింగ్‌లు కట్టే వారికి మంచి టైంపాస్‌ వ్యవహారంగా మారింది. ఐదు వేల రూపాయలకు 20 వేల రూపాయలు, లక్ష రూపాయలకు రెండు లక్షల రూపాయలు ఇలా బెట్టింగ్‌ కాస్తూ తాము గెలుస్తాడని నమ్మిన నాయకుని విజయావకాశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement