భద్రాద్రి రామాలయం
భద్రాచలంటౌన్: కరోనా ప్రభావం మనుషులతో పాటు దేవుళ్లకూ తాకింది. గత రెండు నెలలుగా ఆలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదు. దీంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవలకు అవకాశం కల్పించినా.. కనులారా భగవంతుడిని చూడకుండా పూజలు చేస్తే ఫలితం ఏంటని వాపోతున్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ నిబంధనలకు కొన్ని సడలింపులు ఇచ్చి, బస్సులు నడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నదేవాలయాలను ఆదుకునేందుకు ఎండోమెంట్ అధికారులు చొరవ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నాలుగో దశ లాక్‌డౌన్ పూర్తి కానున్న నేపథ్యంలో జూన్‌లో ఆలయాల్లోకి భక్తులకు ప్రవేశం కల్పించే అవకాశం, ఈ మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించినట్లు సమాచారం. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఆలయాల్లో పాటించాల్సిన విధి,విధానాలపై కార్యాచరణ రూపొందిస్తున్నారు. పూజలకు అవకాశమిస్తే అధిక సంఖ్యలో భక్తులు రావడంతో పాటు ఎక్కువ సమయం ఒకేచోట ఉంటారని, తద్వారా భౌతిక దూరం పాటించడం సాధ్యం కాదని యోచిస్తున్నారు. అందుకే దైవ దర్శన భాగ్యం మాత్రమే కల్పించాలని భావిస్తున్నారు.
గదులు అద్దెకివ్వరు..
వేసవి సెలవుల్లో భద్రాచలం రామాలయానికి నిత్యం 15 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. ప్రతి ఒక్కరూ శానిటైజర్ టన్నెల్ ద్వారా ఆలయం లోపలకి వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్గదర్శకాలను జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో 27 కాటేజీలు, 140 గదులు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గదులు అద్దెకిస్తే భౌతిక దూరం పాటించే అవకాశం ఉండదని, గదులు అద్దెకిస్తే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఒకటి, రెండు రోజులు ఉంటారని, అందుకే గదులు అద్దెకు ఇవ్వవద్దని యోచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment