2018 డిసెంబర్ నాటికి ‘భగీరథ’ పూర్తి
వేముల ప్రశాంత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలోని 28,400 ఆవాసాలకు సురక్షిత తాగునీటిని ఇంటింటికీ అందించేందుకు చేపట్టిన పనులు చురుకుగా కొనసాగుతున్నట్లు మిషన్ భగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు రక్షిత మంచినీటి సరఫరా చేసే మిషన్ భగీరథను దైవకార్యంలా చేపడుతున్న సీఎం కేసీఆర్.. నీళ్లివ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లడగమని తనకు తాను సవాల్ విసురుకున్నారన్నారు. ఎన్నికల కంటే ఏడాది ముందుగా 2018 డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
గురువారం నిజామాబాద్ నుండి సమాచార పౌర సంబంధాల శాఖచే నిర్వహించిన ప్రెస్‌టూర్ సందర్భంగా పోచంపాడ్ అతిథి గృహంలో మిషన్ భగీరథ పనుల గురించి వేముల ప్రశాంత్‌రెడ్డి వివరించారు. రూ. 40 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన మిషన్ భగీరథ పనుల కింద రాష్ట్రవ్యాప్తంగా నీటిని సరఫరా చేసేందుకు 19 ఇన్‌టెక్ వెల్‌లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు నెలాఖరుకు 1995 ఆవాసాలకు, డిసెంబరు నెలాఖరుకు 6,100 ఆవాసాలకు, 2018 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో నిర్దేశించిన 28,400 ఆవాసాలకు దశలవారీగా నల్లా కనెక్షన్ల ద్వారా ఇంటింటికీ సరిపడా నీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు.
మిషన్ భగీరథ పనుల పరిశీలన
నిజామాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ పనుల తీరును ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో జలాల్‌పూర్ వద్ద నిర్మిస్తున్న ఇన్‌టెక్ పనులను పరిశీలించిన ఆయన.. ఇకనైనా కాంట్రాక్టర్లు అలసత్వం వీడాలని సూచించారు. నాగాపూర్, కిసాన్‌నగర్, జలాల్‌పూర్ పైపులైన్ నిర్మాణం పనులను ఆయన చూశారు. మిషన్ భగీరథలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని 1,645 ఆవాసాలకు, 4 మున్సిపాలిటీలకు తాగునీటిని అందించేందుకు రూ. 2,650 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పనుల్ని తక్షణమే పూర్తి చేయించాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ఓఎస్‌డీ సత్యపాల్‌రెడ్డి, ఎస్‌ఈ ప్రసాదరెడ్డి, ఈఈ. రమేశ్, పీఎస్ రాజేశ్వర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.