Vemula Prashant Reddy
-
అరికెపూడి గాంధీ పార్టీ మారలేదు అన్నారు... మరీ ఈ పిచ్చి పనులేంది
-
మూడోసారీ విజయం నాదే.. : వేముల ప్రశాంత్‌రెడ్డి
సాక్షి, నిజామాబాద్: 'రెండుమార్లు బాల్కొండ నియోజకవర్గం ప్రజలు చూపిన ఆదరణతో, సీఎం కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో రూ.వేల కోట్ల నిధులు బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధికి తెచ్చాను. ఆ అభివృద్ధి పనులే నా హ్యాట్రిక్ విజయానికి బాటలు వేస్తాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. సాధారణ ఎన్నికల్లో మూడోసారి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయనతో "సాక్షి" ఇంటర్వ్యూ.' – మోర్తాడ్(బాల్కొండ) ఇంకా చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా? ► నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు చేయాల్సిన పనులు లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేశాం. 2018 ముందస్తు ఎన్నికల్లో హామీ ఇవ్వని పనులు కూడా సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో పూర్తి చేశాం. ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా చేశాం. వారు ఆశించిన దానికంటే మరెన్నో పనులు పూర్తి చేసి సమస్యలే లేని నియోజకవర్గంగా బాల్కొండను తీర్చిదిద్దాం. బాల్కొండ నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటి..? ► తెలంగాణ ఆవిర్భావానికి ముందు నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏ విధమైన మార్పు వచ్చిందో ప్రజలకు స్పష్టంగా తెలుసు. నియోజకవర్గంలో సాగునీటి కష్టాలు లేకుండా పెద్దవాగు, కప్పలవాగులో చెక్‌డ్యాంలను నిర్మించాం. తద్వారా భూగర్భ జలాలు వృద్ధి చెంది సాగునీటి కష్టాలు లేకుండా పోయాయి. చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశ పనులు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే పూర్తయ్యాయి. చెరువులు, కుంటల్లో పూడిక తీయించి వర్షం నీరు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. రైతులకు సాగునీటి కష్టాలు, విద్యుత్ కష్టాలు అంటూ ఏమి లేకుండా చేశాం. వ్యవసాయ పంపుసెట్లు ఎక్కువగా ఉన్న చోట గ్రామానికి ఒక విద్యుత్ సబ్‌స్టేషన్‌ను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేశాం. మళ్లీ గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు..? ► నియోజకవర్గం ప్రజలకు వారు ఆశించినదానికంటే ఎక్కువ చేశాం. మూడోసారి ఎన్నికై తే వారి జీవన ప్రమాణాలు అభివృద్ధి చెందేలా చేస్తాం. ఎవరికై నా పింఛన్లు రాకపోయినా, ఇంకా ఏదైనా సంక్షేమ పథకాలు అందకపోయినా వాటిని పక్కాగా ఇప్పించి ప్రజలకు సమస్యలు లేకుండా చూస్తాం. మిషన్ భగీరథ వైస్ చైర్మన్, మంత్రిగా ఎలాంటి అనుభూతి పొందారు? ► బాల్కొండ ప్రజలకు కృతజ్ఞతలు. వారు ఆదరించడం వల్ల అసెంబ్లీలో అడుగుపెట్టాను. నా పనిత నం మెచ్చి సీఎం కేసీఆర్ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎంపికై న నాకు మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా పెద్ద బాధ్యతలను అప్పగించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి నీరందించే పథకం బాధ్యతలను నెరవేర్చినందుకు ఎంతో తృప్తిగా ఉంది. రెండోసారి ఎమ్మెల్యేగా ఎంపిక కాగానే రోడ్లు, భవనాలు, అసెంబ్లీ వ్యవహారాలు, గృహనిర్మాణ శాఖలతో మంత్రిని చేశారు. రెండు పర్యాయాలు ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన సీఎంకు, అందుకు ఆదరించిన బాల్కొండ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ► నాకు గెలుపుపై పూర్తి ధీమా ఉంది. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో జరుగని అభివృద్ధి బాల్కొండ నియోజకవర్గంలో చేసి చూపించాం. గెలుపు విషయంలో బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు. మెజార్టీ పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో 32 వేల మెజార్టీ లభించింది. ఈసారి చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలతో మరింత మెజార్టీ వస్తుందనే నమ్మకం ఉంది. బాల్కొండ ప్రజల ఆశీర్వాదంతో తప్పక మూడోసారి విజయం మాదే. ఇవి కూడా చదవండి: 'ఆకాంక్షలు నెరవేరుస్తాం!' : రాహుల్ గాంధీ -
నిరాధార కేసులతో వేధిస్తే సహించబోం: వేముల
సాక్షి, హైదరాబాద్: సీఎం కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిరాధార కేసులతో వేధిస్తే సహించేది లేదని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. ఆమెపై నిరాధారమైన వార్తలు ప్రచురించేలా చేయడం నీతిమాలిన చర్య అని, కవిత ఇంటిపై బీజేపీ దాడి హేయమైన చర్య అని వేముల సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలను కేసీఆర్ ఎత్తి చూపుతున్నందునే కవితపై నిరాధారమైన వార్తలు సృష్టిస్తున్నారు. టీఆర్ఎస్ కవితకు అండగా ఉండి బీజేపీ కార్యకర్తలను తరిమి కొడతాం’అని వేముల హెచ్చరించారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, భాస్కర్‌రావు, నోముల భగత్‌లు టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మాట్లాడు తూ.. కవితపై ఆరోపణలు ఖండించారు. -
ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణం ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో టీఆర్ఎస్ భవన నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్రావుతో పాటు ఎండీపీ ఇన్ఫ్రా నిర్మాణ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. భవన నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల అనుమతులు ఇప్పటికే తీసుకున్నట్లు మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. -
రాజ్‌భవన్‌కు కాషాయం రంగు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌కు కాషాయం రంగు పులుముతూ రాజకీయాలను అంటగడుతోందంటూ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు బీజేపీపై మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని బీజేపీయే నగ్నంగా బయటపెడుతోందని దుయ్యబట్టారు. ఆయన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘గవర్నర్‌ను అవమానిస్తోంది బీజేపీనే. గవర్నర్‌కు ఏదైనా క్లారిఫికేషన్ అవసరమైతే సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, అసెంబ్లీ కార్యాలయంతో మాట్లాడతారు. రాజ్‌భవన్‌కు రాజకీయాలు అంటగట్టి గవర్నర్ వ్యవస్థను దిగజారుస్తూ అవమానిస్తున్న బీజేపీపై కేసులు నమోదు చేయాలి. ఈ నెల 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని స్పీకర్ నోటిఫై చేశారు. శాసనసభకు ఇమ్యూన్ పవర్ ఉంటుంది, అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవు అనే అవగాహన కూడా బీజేపీ నేతలకు లేదు. ఈఎస్ఎల్ నరసింహన్‌తోపాటు ప్రస్తుత గవర్నర్ తమిళిసై సహా ఎవరు గవర్నర్‌గా ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవిస్తూ, అనేక అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాదని నిపుణులు చెప్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాలు ప్రొరోగ్ కానందునే బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేదనే విషయాన్ని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలుసుకోవాలి’ అని హరీశ్‌రావు చెప్పారు. వెలగని దీపం బీజేపీ గవర్నర్ మహిళ అయినందునే బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించడం లేదంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలను హరీశ్‌రావు కొట్టిపారేశారు. గతంలో మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన వెంటనే గుజరాత్ గవర్నర్ కమలా బేణివాల్‌ను డిస్మిస్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని అక్కడి గవర్నర్ ఎందుకు అవమానిస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో తమ పార్టీకి బలం లేకున్నా కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో అధికారం కోసం బీజేపీ గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసిందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు శాంతి, సామరస్యం, అభివృద్ధితోపాటు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ దేశానికి వెలుగు చూపే కాగడా అయితే బీజేపీ మాత్రం తెలంగాణలో ఎన్నడూ వెలగని దీపమని అన్నారు. అది రాజ్యాంగంలో లేదు: మంత్రి వేముల తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు హుందాగా జరుగుతున్నా బీజేపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గత సమావేశాలు ప్రొరోగ్ కాకుండా గవర్నర్‌ను ఆహ్వానిస్తే తప్పుచేసినట్లు అవుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి్దని గవర్నర్ ప్రసంగం ద్వారా తెలియచేయాలని తమకూ ఉంటుందని, బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం సాంకేతికపరమైన అంశం మాత్రమేనన్నారు. శాసనసభ ప్రొరోగ్ కాకపోవడంతో 1971, 2013, 2019లోనూ ఇదే రీతిలో సమావేశాలు జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. 2004లో పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం కూడా రాష్ట్రపతి ప్రసంగం లేకుండానే జరిగిందని, దీనిపై రాందాస్ అథవాలే సుప్రీంకోర్టుకు వెళ్లినా కొట్టేసిందన్నారు. బీజేపీ రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని, ఆ పార్టీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. సమా వేశంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
4 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ నాలుగు బిల్లులను శుక్రవారం ఆమోదించింది. గృహ నిర్మాణ మండలిని రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా గుర్తించడంతోపాటు ముగ్గురు సభ్యులను నామినేట్ చేసేలా సవరించిన తెలంగాణ గృహ నిర్మాణమండలి (సవరణ) బిల్లు–2021ను గృహ నిర్మాణమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రతిపాదించగా సభ ఆమోదించింది. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్ఆర్ఐ), హార్టీకల్చర్ పాలిటెక్నిక్ కాలేజీల అనుబంధాన్ని అనుమతించేందుకు ఉద్దేశించిన ఉద్యాన విశ్వవిద్యాలయ సవరణ బిల్లు– 2021ని కూడా సభ ఆమోదించింది. జాతీయ న్యాయ శాస్త్ర అధ్యయనాలు, పరిశోధనల అకాడమీ విశ్వవిద్యాలయం (నల్సార్)లో తెలంగాణ విద్యార్థుల కోటాను 20 నుంచి 25 శాతానికి పెంచడంతోపాటు ఈ 25 శాతం కోటాలో బీసీలు, ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పించే నల్సార్ సవరణ బిల్లు–2021కు సైతం శాసనసభ ఆమోదం తెలిపింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని కొత్త గ్రామాల ఏర్పాటు, ఏదైనా గ్రామం విస్తీర్ణాన్ని పెంచడం లేదా తగ్గించడం, పేరు, హద్దుల మార్పునకు ఉద్దేశించిన పంచాయతీరాజ్ సవరణ బిల్లులోని పేరుమార్పు నిబంధనలపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పేరుమార్పు నిబంధనను తొలగించాలని పట్టుబట్టడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. పేరుమార్పు నిబంధనపై నిరసన తెలుపుతున్నట్లు అక్బరుద్దీన్ ప్రకటించగా సవరణ బిల్లును ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. శుక్రవారం మరో రెండు బిల్లులు సభ ముందుకు వచ్చాయి. తెలంగాణ వస్తుసేవల పన్ను సవరణ బిల్లును మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించారు. రాష్ట్ర పర్యాటకులు, ప్రయాణికులపై దళారీతనం, దుష్ప్రవర్తనను నివారించే బిల్లును హోంమంత్రి మహమూద్ అలీ సభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ బిల్లుల ఆమోదం తర్వాత శాసనసభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు. కాగా, వర్షాల మూలంగా సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో శాసనసభ సమావేశాలకు విరామం ప్రకటించడంతో ఈ నెల 7 వరకు సమావేశాలను పొడిగించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. అయితే దీనిపై ఈ నెల 5న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. -
Hyderabad Metro: మెట్రోను ఆదుకుంటాం!
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ప్రయాణికులు తగ్గి నష్టాల్లో కూరుకుపోయిన హైదరాబాద్ మెట్రో రైల్‌ను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. ఈ దిశగా ఏమేం అవకాశాలు ఉన్నాయో అన్వేషిస్తామని.. మెట్రో రైలు తిరిగి గాడినపడేలా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. మెట్రో రైల్ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ అధికారులు మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కరోనా, లాక్డౌన్లతో మెట్రోకు నష్టాలు, పేరుకుపోతున్న రుణాలు, వడ్డీల భారాన్ని వివరించి.. ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వల్ల అన్నిరంగాల తరహాలోనే మెట్రో రైల్ కూడా ఇబ్బందుల్లో పడిందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దినాదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి మెట్రో సేవలు ఎంతో అవసరమని, భవిష్యత్తులో మరింతగా విస్తరించాల్సి ఉందని చెప్పారు. అన్ని రంగాలను ఆదుకున్నట్టే హైదరాబాద్ మెట్రోను కూడా గాడిలో పెట్టడానికి తోడ్పడతామని హామీ ఇచ్చారు. ఎటువంటి విధానాలు అవలంబించడం ద్వారా మెట్రోకు మేలు చేయగలమో విశ్లేషిస్తామని, మెట్రో తిరిగి పుంజుకోవడంతోపాటు సేవల విస్తరణకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దీనకి సంబంధించి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో.. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్ రావు, ఫైనాన్స్, పురపాలక శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మెట్రో రైల్‌ను ఆదుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలపై అధ్యయనం చేసి, త్వరగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ఆదేశించారు. జాప్యంతో వ్యయం పెరిగి.. హైదరాబాద్ మెట్రో రోజుకు రూ.కోటి నష్టంతో నడుస్తోంది. మూడు మార్గాల్లో 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉన్నా.. ప్రయాణికుల ఆదరణ అంతంతగానే ఉంది. తొలుత రూ.16 వేల కోట్ల అంచనాతో మెట్రో చేపట్టినా.. నిర్మాణం రెండేళ్లు ఆలస్యం కావటంతో వ్యయం 19 వేల కోట్లకు పెరిగింది. ఈ మేరకు పెరిగిన నిర్మాణ వ్యయాన్ని చెల్లించాలని మెట్రో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ప్రభుత్వాన్ని కోరింది. ఇక కరోనా కారణంగా రూ.300 కోట్లు నష్టం వాటిల్లినట్టు ఎల్అండ్టీ చెప్తోంది. -
‘త్వరలో లక్ష ఇళ్ల పంపిణీ’
సాక్షి, హైదరాబాద్: త్వరలో 1.03 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే 52 వేల ఇళ్లు పూర్తి చేశామని, వీటిల్లో చాలా ఇళ్లు గృహప్రవేశాలు పూర్తి చేసుకున్నాయని, మరో 1.03 లక్షల ఇళ్లు 90 శాతం పనులు పూర్తి చేసుకున్నాయని సభకు తెలిపారు. పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఇలా ప్రభుత్వం పేదల కోసం ఉచితంగా ఇళ్లను కట్టించి ఇచ్చే పథకం లేదన్నారు. ఇప్పటివరకు ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ.10,054 కోట్లు ఖర్చయ్యాయని, ఇందులో రూ.8,743 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులని, కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రూ.1,311 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. బిల్లులు దాఖలు చేసిన కాంట్రాక్టర్లకు రూ. 9,650 కోట్లు అందించామని, రూ. 400 కోట్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, వాటినీ త్వరలో ఇస్తామన్నారు. క్వాలిటీ కంట్రోల్ వ్యవస్థ డబుల్ బెడ్రూం ఇళ్ల పరిశీలనలో ఉందని చెప్పారు. రాంపల్లిలో టన్నెల్ ఫామ్ టెక్నాలజీ, దుండిగల్‌లో ప్రీ ఫ్యాబ్ టెక్నాలజీలను వినియోగించి ఇళ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం ఇచ్చే నిధులకు సంబంధించి పీఎంఏవై గ్రామీణ్ కింద రూ. 385 కోట్లకుగాను రూ. 190 కోట్లే విడుదల చేసిందని, ఇదే పథకం అర్బన్ విభాగంలో రూ. 2,305 కోట్లకుగాను రూ. 1,120 కోట్లే ఇచ్చిందని సభ దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ఈ ఇళ్ల మొత్తం వైశాల్యం 12 కోట్ల చదరపు అడుగులన్నారు. 75 వేల మందికి ప్రత్యక్షంగా, 2 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందన్నారు. సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకోవాలనుకునేవారికి, అగ్ని ప్రమాదాల్లో ఇళ్లు దగ్ధమైన వారు సొంత స్థలాల్లో నిర్మించుకుంటే ఈ పథకం కింద సాయం చేస్తామన్నారు. -
త్వరలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్: సాదాబైనామాలకు సంబంధించి భూయజమానులకు త్వరలోనే క్రమబద్ధీకరించి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వనున్నట్టు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం పద్దులపై చర్చ సందర్భంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్లకు సంబంధించి సభ్యుల సందేహాలను నివృత్తి చేసే క్రమంలో ఆయన పలు వివరాలు వెల్లడించారు. తెలంగాణలో భూ వివాదాలకు అవకాశం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సాదాబైనామాలకు సంబంధించి క్రమబద్ధీకరణ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భూ విక్రయ లావాదేవీలకు సంబంధించి తెల్లకాగితాలపై రాసుకున్నవారి వివరాలు రికార్డుల్లోకెక్కలేదని, యజమానులైనప్పటికీ రికార్డుల్లో వారి పేర్లు లేకపోవడంతో వివాదాలకు అవకాశం కలుగుతోందన్నారు. ఇలాంటి వారు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించగా తొలుత 15.68 లక్షల దరఖాస్తులు వచ్చా యని, వీటిల్లో 6.18 లక్షలను క్లియర్ చేసినట్లు వెల్లడిం చారు. ఆ తర్వాత 2 దఫాలు గా అవకాశం ఇవ్వగా మరో 9 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఈ అంశానికి సంబంధించి కోర్డులో కేసు దాఖలు కావటంతో క్రమబద్ధీకరణ పెండింగ్‌లో పడిందన్నారు. కోర్టు కేసు క్లియర్ కాగానే రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని సభకు వివరించారు. భూ రిజిస్ట్రేషన్‌లో ఎవరి జోక్యం లేకుండా, అంతా ఆన్లైన్ విధానంతో జరిగేలా రూపొందించిన ధరణి పోర్టల్ రైతులకు పెద్ద వరంలాంటిదన్నారు. ధరణి వ్యవహారం ఓ చరిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ పనితీరు అద్భుతం.. రాష్ట్రంలో ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని సమకూర్చిపెట్టే మూడు ప్రధాన శాఖల్లో ఒకటైన రిజిస్ట్రేషన్ల శాఖ పనితీరు అద్భుతమని మంత్రి కొనియాడారు. కేవలం 1,300 సిబ్బందితో ఈ శాఖ, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సజావుగా సాగేందుకు వీలుగా నిధులను సమకూర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. కోవిడ్‌తో గత ఆర్థిక సంవత్సరం ఇబ్బంది ఉండగా, అంతకుముందు యేడు 1,300 మంది సిబ్బంది, 141 కార్యాలయాల ద్వారా 15.34 లక్షల భూలావాదేవీలతో రూ.6,620 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టిం దన్నారు. త్వరలో రాష్ట్రంలో సమగ్ర భూసర్వే నిర్వహించనున్నామని, పార్ట్–బీలో ఉన్న వివాదాలను మొదటి దశలోనే పరిష్కరిస్తామని, ఇందుకు బడ్జెట్లో రూ.400 కోట్లు ప్రతిపాదించినట్టు పేర్కొన్నారు. -
ఈ బిల్లుతో అవినీతి అంతం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా బదలాయించేందుకు అధికారులకున్న విచక్షణాధికారాల రద్దుతో అవినీతికి, అవకతవకలకు ఆస్కారం తగ్గి పూర్తి పారదర్శకత సాధ్యమవుతుందని శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ధరణి ద్వారా ఆన్లైన్ విధానంలో వ్యవసాయేతర భూముల బదలాయింపు దరఖాస్తు చేసుకునేలా నాలా చట్టాన్ని సవరించామని.. దీని ద్వారా రైతుకు, బిల్డ ర్కు ప్రయోజనం కలుగుతుందన్నారు. మంగళవారం తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు (కన్వర్షన్ నా న్ అగ్రికల్చర్ ల్యాండ్)– 2020, ఇండియన్ స్టాంప్ (తెలం గాణ సవరణ) బిల్లు– 2020ను శాసనసభలో ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. పాత చట్టంలో వ్య వసాయ భూమిని వ్యవసాయేతరగా మార్చే ప్రక్రియలో ఆర్డీఓకు కొన్ని విచక్షణాధికారాలు ఉండేవని, ఈ క్రమంలో కొంత అవినీతికి ఆస్కారం ఏర్పడిందన్నారు. ఈ సవరణ బిల్లుతో ఆర్డీఓ ఆ అధికారాన్ని కోల్పోతారని, ధరణి ద్వా రా ఆన్లైన్లో సత్వరమే ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నా రు. ఇప్పటికే ఎవరైనా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించుకుంటున్న వారు మూడు నెలల్లోగా దరఖాస్తు చేసుకుంటే ప్రస్తుతం విధిస్తున్న 50% జరిమానా ఉండదని వివరించారు. ఇక భూముల ప్రాథమిక విలువ నిర్ధారణకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్లకు 47ఏ కింద విచక్షణాధికారాలను తొలగిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ చేసినట్టు తెలిపారు. ఈ బిల్లు ద్వారా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌తోపాటు డాక్యుమెంట్లకు ఒకేరోజు పొందే అవకాశం ఉంటుందని వెల్లడించారు. సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలి: అధికార పక్ష సభ్యులు గొంగిడి సునీత, మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం సభ్యుడు జాఫర్ హుస్సేన్ ఈ బిల్లులను స్వాగతించారు. చర్చ సందర్భంగా ఎల్ఆర్ఎస్ విషయాన్ని భట్టి లేవనెత్తే ప్రయత్నం చేయగా.. దీన్ని స్పీకర్, అధికార పక్ష సభ్యులు అడ్డుకున్నారు. ‘సవరణ బిల్లు’పై చర్చ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ధరణిలో పొందుపరిచిన భూముల వివరాలు సక్రమంగా లేకుంటే, వ్యవసాయ భూముల బదలాయింపు ప్రక్రియతో మరో కొత్త సమస్య వస్తుందన్నారు. ధరణిలో పొందుపరిచిన భూములన్నీ సక్రమంగా ఉన్నా యో లేదో ముందు చూడాలని.. లేదంటే గందరగోళం నెలకొంటుందన్నారు. దీనిపై స్పష్టత ఇస్తేనే బిల్లుకు మద్దతిస్తామని తెలిపారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. ఇప్పటికే 1.48 కోట్ల ఎకరాల పట్టా భూముల వివరాలు ధరణిలో రికార్డయ్యాయని.. కోర్డుల్లో ఉన్నవి, ఇతర పంచాయితీల్లో ఉన్న భూములను వదిలేసి 95శాతం భూముల వివరాలను పొందుపరిచామని తెలిపారు. చదవండి: బుల్లెట్లా పంటలు -
మరింత బాధ్యతతో పనిచేయండి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా నూతన రెవెన్యూ చట్టంతో రైతుల జీవితాల్లో మార్పు రావడానికి ఉద్యోగులు కృషి చేయాలని రోడ్లు, భవ నాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం తన నివాసంలో కలసిన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. కొత్తగా రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగిస్తున్నందున మరింత బాధ్యతతో పనిచేయాలని కోరారు. మం త్రిని కలసిన వారిలో ట్రెసా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్య దర్శి గౌతమ్‌కుమార్ తదితరులున్నారు. -
‘దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్’
సాక్షి, హైదరాబాద్: ఆరేళ్ల కాలంలో దేశంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఎన్జీఓస్ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయనతో పాటు జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నగర మేయర్ నీతూ కిరణ్, ఎమ్మెల్యే వీజీ గౌడ్, కలెక్టర్ సి. నారాయణరెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు రక్తాదానం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారన్నారు. టీఎన్జీఓలు కూడా ప్రభుత్వంలో భాగస్వామలేనని పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజల అభ్యున్యతికి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. అతి తక్కువ కాలంలో అతి పెద్ద సంక్షేమ ఫలాలు తెలంగాణలో అందుతూ దేశంలోనే తెలంగాణ టాప్‌లో ఉందన్నారు. మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించారు. గత ఆరేళ్ల కేసీఆర్ పాలన జనరంజకమన్నారు. రైతులు, పేదలను రెండు కళ్లుగా భావిస్తున్నారన్నారు. డబుల్ బెడరూం పథకం దేశంలోనే అద్భుత పథకమన్నారు. 24 గంటల ఉచిత కరెంటును సీంఎ రైతులకు అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. రైతులకు ధీమాగా రూ. 5 లక్షల భీమా అందిస్తున్నారన్నారు. కేవలం ఆరేళ్లలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, ఇకపై కూడా బంగారు తెలంగాణ ఆవిష్కారం కావాలన్నారు. చివరగా తెలంగాణ ప్రజలకు మంత్రి రాష్ట్ర ఆవిర్భవ శుభాకాంక్షలు తెలిపారు. -
ఏకగ్రీవాల జోరు: మంత్రి కృతజ్ఞతలు
సాక్షి, నిజామాబాద్: సహకార సంఘాల ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గం రికార్డ్ సృష్టించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా బాల్కొండ నియోజక వర్గంలో ఏకగ్రీవాలు నమోదు అయ్యాయి. నియోజకవర్గ పరిధిలోని 20 సహకార సంఘాలకు గాను 19 సంఘాలు ఏకగ్రీవంగా నిలిచాయి. సహకార ఎన్నికల్లో ఎప్పుడు లేనంతగా ఈ సారి ఏకగ్రీవాల జోరు కొనసాగింది. బాల్కొండ నియోజకవర్గంలో అత్యధిక సొసైటీలు ఏకగ్రీవం కావడంపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్దమొత్తంలో ఏకగ్రీవాలు చేసింనందుకు వేముల ప్రశాంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏకగ్రీవాలను అందించిన జిల్లా రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా జిల్లాలోని 89 సహకార సంఘాలకుగాను 26 సంఘాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. -
కసరత్తు షురూ.. త్వరలో కొత్త రెవెన్యూ చట్టం!
సాక్షి, హైదరాబాద్ : కొత్త రెవెన్యూచట్టం తీసుకువస్తున్నట్లు ఆర్అండ్బీ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. దీనిపై సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారని, అవసరమైతే మూడు, నాలుగు రోజులు కూర్చొని సభ్యుల సూచనలు, సలహాలతో కొత్త చట్టాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. బుధవారం శాసనసభలో రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా, ఎక్సైజ్, హోం, వ్యవసాయ, పశుసంవర్ధక, పౌరసరఫరాలు, బీసీ సంక్షేమం పద్దులను సీఎం తరఫున మంత్రులు సభలో ప్రవేశపెట్టారు.రెవెన్యూ పద్దులపై ప్రశాంత్‌రెడ్డి సమాధానమిచ్చారు. ఇప్పటివరకు 98శాతం రికార్డులను నవీకరించామని తెలిపారు. 68.37 లక్షల ప్రైవేటు ఖాతాలకుగాను 58.48 ఖాతాలకు కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలిచ్చినట్లు చెప్పారు. కేవలం 12–13% ఖాతాలపై అభ్యంతరాలుండటంతో పక్కనపెట్టామని, త్వరలోనే విధానపర నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రెవెన్యూ రికార్డుల సవరణలో అనుభవదారుల కాలమ్‌లో పేర్లను తొలగించడం ద్వారా భూమిపై ఉన్న హక్కు కోల్పోతున్న రైతుల విషయంలో ఆలోచిస్తామని, మంత్రి చెప్పారు. రిజిస్ట్రేషన్ శాఖలో మార్పులు... రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖను అనుసంధానించడం ద్వారా రిజిస్ట్రేషన్ రోజే మ్యుటేషన్‌కు చర్యలు తీసు కుంటామని, అదే రోజు పాస్‌పుస్తకం, 1బీలో కూడా పేరు చేర్చేలా సంస్కరణలు తీసుకువస్తున్నట్లు చెప్పారు. స్లాట్ విధానంతో డాక్యుమెంట్ల జారీలో వేగాన్ని పెంచామని, సగటున రోజుకు 43 డాక్యుమెంట్లు నమోదవుతున్నాయని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రిజిస్ట్రేషన్ల ద్వారా గతేడాది రూ.2,046 కోట్ల రాబడి రాగా, ఈసారి ఇప్పటికే రూ.6,012 కోట్ల ఆదాయం లభించిందని, ఇది ఏకంగా 237% అధికమని తెలిపారు. భూస్వామ్యవర్గాలకు మేలు కలిగేలా: భట్టి తెలంగాణ పోరాటమే భూమి కోసం జరిగింది.అలాంటి భూమిని ప్రస్తుత ప్రభుత్వం జమీందార్, భూస్వామ్యవర్గాలకు కట్టబెట్టేలా భూ రికార్డుల ప్రక్షాళనను చేసిందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అనుభవదారుల కాలమ్ నుంచి పేర్లు తొలిగించడంతో వారి ఆస్తులపై పేదలు హక్కులు కోల్పోతున్నారని చెప్పారు. భూ రికార్డుల నవీకరణ ఉద్దేశం మంచిదే అయినా.. చేసిన విధానం బాగాలేదని అభిప్రాయపడ్డారు. జిల్లాలవారీగా ఉదాహరణలు చెబుతుంటే సమయం అయిపోందని స్పీకర్ మైక్ కట్ చేశారు. ఈ క్రమంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జోక్యం చేసుకుంటూ ప్రభుత్వానికి సూచనలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సీఎం కంకణం కట్టుకుంటే.. అడ్డగోలుగా మాట్లాడటం సబబుకాదన్నారు. పర్మిట్ రూమ్‌లు ఎత్తివేయండి పర్మిట్ రూమ్‌ల వల్ల శాంతిభద్రతల సమస్యలు ఏర్పడుతున్నాయని భట్టి అన్నారు. హైదరాబాద్‌లో ప్రత్యేక జీఓ ద్వారా టానిక్ పేరిట కొన్ని బార్లకు అనుమతిచ్చినట్లు తెలిసిందని, అది సరికాదన్నారు. పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఇప్పటికే పలు డిపోలు, వర్క్‌షాప్‌లను తాకట్టు పెట్టిందని, తాజాగా ఎలక్ట్రానిక్ బస్సుల నిర్వహణ ఒప్పందంలోను అక్రమాలు జరిగినట్లు తెలుస్తోందని విచారణ జరపాలన్నారు. పౌరసరఫరాల పద్దుపై పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలల్లో సన్నబియ్యం పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, పేదోళ్ల కడుపునింపేందుకు ఏడాదిగా రూ.5,413 కోట్ల సబ్సిడీని భరించినట్లు తెలిపారు. -
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక!
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తి చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడారు. సభ్యులు లేవనెత్తిన అంశాలకు వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 2.82 లక్షల ఇళ్ల నిర్మాణాలకు మంజూరు ఇచ్చిందని, ఇందులో 1.99 లక్షల ఇళ్లకు టెండర్లు పిలవగా.. 1.79 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటికే 34 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. మరో 96 వేల ఇళ్ల నిర్మాణ పనులు 90 శాతం పూర్తయినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలకు రూ.18,100 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు రూ.6,972 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ ఏడాది రూ.4145 కోట్లు సమకూర్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. బడ్జెట్లో రూ.180 కోట్లు కేటాయించామని, రూ.1,365 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని, రూ.2,500 కోట్లు హడ్కో ద్వారా రుణం తీసుకునేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. ఎంపిక ప్రక్రియ ఇలా.. డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టనున్నట్లు ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. మూడు అంచెల్లో అర్హత నిర్ధారణ ఉంటుందని చెప్పారు. తొలుత గ్రామ సభ నిర్వహించి అక్కడ ఆశావహుల పేర్లను ప్రతిపాదిస్తామన్నారు. అలా ప్రతిపాదించిన ప్రాథమిక జాబితాను జిల్లా స్థాయిలో మంత్రి చైర్మన్‌గా, కలెక్టర్ కన్వీనర్‌గా ఉన్న కమిటీలో ఈ జాబితాను పరిశీలిస్తామన్నారు. అక్కడ వడపోత తర్వాత తిరిగి గ్రామ సభకు పంపిన అనంతరం ప్రాధాన్య క్రమంలో తుది జాబితా తయారు చేస్తారని వివరించారు. అనంతరం ఇళ్ల సంఖ్యను బట్టి లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు మంత్రి వివరించారు. అర్హుల ఎంపికలో ఎవరి జోక్యం ఉండదని, పూర్తిగా గ్రామ సభ ద్వారానే బహిరంగంగా ఎంపిక జరుగుతుండటంతో ఎవరికీ అభ్యంతరాలు ఉండవని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల ప్రకారమే కేటాయింపులు డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో రిజర్వేషన్లు పాటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఇళ్లు కేటాయిస్తామన్నారు. మిగతా ఇళ్లను ఇతర లబ్ధిదారులకు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం ఎస్సీలకు 15.45 శాతం, ఎస్టీలకు 6 శాతం, మైనార్టీలకు 12 శాతం ఇళ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో 17 వేల ఇళ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా కుత్భుల్లాపూర్‌లో 12 వేల ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ రెండు కాలనీల్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. -
జాతీయ రహదారులుగా 3,135 కి.మీ.: వేముల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు 3,135 కి.మీ రోడ్డును కేంద్ర రోడ్లు, రవాణా మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా జాతీయ రహదారులుగా ఆమోదించిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. వీటిలో 1,366 కి.మీలను కొత్త జాతీయ రహదారులుగా కేంద్రం ప్రకటించినట్టు చెప్పారు. మిగతా 1,769 కి.మీ పొడవును జాతీయ రహదారులుగా ప్రకటించాల్సి ఉందన్నారు. ఆదివారం కౌన్సిల్ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి వేసిన ప్రశ్నకు, బాలసాని లక్ష్మీనారాయణ, భానుప్రసాద్, జీవన్‌రెడ్డి, పురాణం సతీశ్ వేసిన అనుబంధ ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ‘రిజర్వాయర్ల వద్ద టూరిజం స్పాట్లు..’ రాష్ట్రంలోని పోచారం, శ్రీరాంసాగర్, కరీంనగర్, కోదండపూర్‌తో పాటు అన్ని రిజర్వాయర్ల వద్ద టూరిజం స్పాట్లను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. నాగార్జునసాగర్, సోమశిల, తదితర ప్రాంతా ల్లో టూరిజం సర్క్యూట్లను ఏర్పాటు చేసి, ప్రజలకు వివిధ సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామన్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థ ద్వారా 35 హోటళ్లను నిర్వహిస్తున్నట్టు, 15 చోట్ల పర్యాటక ఆస్తులను హోటళ్ల నిర్వహణ కోసం లీజ్‌కు ఇచ్చినట్టు తెలిపారు. సభ్యులు గంగాధరగౌడ్, బాలసాని లక్ష్మీనారాయణ ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. -
16 మంది ఎంపీలతో కేంద్రంపై ఒత్తిడి తెస్తాం
బాన్సువాడ: కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని, ఆంధ్రలో పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు కేటాయించగా, తెలంగాణ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన కాళేశ్వరానికి నయాపైసా నిధులు ఇవ్వలేదని రాష్ట్ర రోడ్డు, రవాణా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొని, కేంద్రం పై ఒత్తిడి పెంచుతామన్నారు. శనివారం ఆయన బాన్సువాడకు విచ్చేసిన సందర్భంగా పోచారం భాస్కర్‌రెడ్డి నాయకత్వంలో టీఆర్ఎస్ నా యకులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును అప్పులు చేసి నిర్మిస్తున్నామని, కేంద్రం నిధులు ఇస్తే ఎంతో సునాయసంగా పనులు పూర్తయ్యేవన్నారు. రాష్ట్రంలో 3,225 కిలోమీటర్ల రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించారని, దీనికి నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఎన్ని రకాల ఒత్తిడి తెచ్చినా పట్టించుకోలేదని, వచ్చే ఎన్నికల్లో 15 టీఆర్ఎస్, ఒక మజ్లిస్ స్థానంలో అభ్యర్థులను గెలిపిస్తే, కేంద్రం మెడలు వంచి నిధులు తెప్పించుకోవచ్చన్నారు. స్పీకర్ పోచారం తండ్రితో సమానులు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తన తండ్రి వేముల సురేందర్‌రెడ్డి మంచి మిత్రులని, వారు గతంలో టీడీపీలో అన్నదమ్ముల్లా కలిసి పనిచేశారని మంత్రి వేముల అన్నారు. 40 ఏళ్లుగా మా కుటుంబాల మధ్య అనుబంధం కొనసాగుతోందని, స్పీకర్ తనకు తండ్రి సమా నులన్నారు. స్పీకర్‌గా ఆయన, శాసన సభా వ్యవహారాల మంత్రిగా తాను కలిసి పనిచేయడం అదృష్టమన్నారు. కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, దేశాయిపేట సొసైటీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు మోహన్ నాయక్, మహ్మద్ ఎజాస్, బాలకిషన్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దు: వేముల ప్రశాంత్‌రెడ్డి
సాక్షి, కమ్మర్పల్లి: కాంగ్రెస్ ప్రకటించిన పథకాలు కాంగ్రెస్ పాలనలోని రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆచరణకు నోచుకోని పథకాలను తెలంగాణలో అమలు చేస్తామని చెబుతున్నా కాంగ్రెసోళ్ల మాయ మాటలను నమ్మవద్దని సూచించారు. ఆదివారం కమ్మర్పల్లి మండలం అమీర్‌నగర్, ఇనాయత్‌నగర్, నర్సాపూర్ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. మోసపూరితమైన హామీలు కాబట్టే అక్కడ అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాలు అంధకారంలో మగ్గాయని, ఇక్కడి నాయకులు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పథకాలు అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చాయన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ కోట్ల రూపాయలతో రోడ్లను అభివృద్ధి చేశారన్నారు. అనంతరం స్థానిక మున్నూర్ కాపు సంఘం సభ్యులు ప్రశాంత్‌రెడ్డికి మద్దతు తెలుపుతూ చేసిన తీర్మానం కాపీని అందజేశారు. నాగలి, పసుపు దుంపలను అందజేశారు. నాయకులు భాస్కర్‌యాదవ్, లుక్క గంగాధర్, గంగం గంగారెడ్డి, ఆకుల రాజన్న, బెజ్జారపు రాంచందర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈవీఎంపై అవగాహన కమ్మర్పల్లి: మండల కేంద్రంలో ఆదివారం వేముల ప్రశాంత్‌రెడ్డి నమూనా ఈవీఎంతో ఓటర్లకు అవగాహన కల్పించారు. అమీర్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి వెళ్తున్న ఆయన కమ్మర్‌పల్లిలో కొద్దిసేపు ఆగారు. ఈవీఎం ద్వారా ఓటు ఎలా వేయాలో వృద్ధులకు అవగాహన కల్పించారు. ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రశాంతన్న యూత్ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో తేజ, మైలారం బాలు పాల్గొన్నారు. ప్రశాంత్‌రెడ్డికి వివిధ సంఘాల మద్దతు భీమ్‌గల్: వేముల ప్రశాంత్‌రెడ్డికి ఆదివారం మండలంలోని వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ముచ్కూర్ ముదిరాజ్ సంఘ సభ్యులు, భీమ్‌గల్, బాబాపూర్ ఖురేషి సంఘ సభ్యులు ప్రశాంత్‌రెడ్డికి మద్దతు ప్రకటించారు. వన్నెల్(బి)లో.. బాల్కొండ: మండలంలోని వన్నెల్(బి)లో ఆదివారం రాత్రి టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి ఆశీర్వాదించి అసెంబ్లీకి పంపాలని కోరారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పనులు పూర్తయితే వరద కాలువలో ఏడాదంత నీరు నిల్వ ఉండి భూగర్భజలాలు సమృద్ధిగా ఉంటాయన్నారు. నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. కోటాపాటి నరసింహనాయుడు, రమేశ్‌రెడ్డి, రాజేశ్వర్ పాల్గొన్నారు. టీఆర్ఎస్లో చేరిక మోర్తాడ్: బాల్కొండ టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో ఆదివారం వడ్యాట్‌కు చెందిన వివిధ కుల సంఘాల సభ్యులు టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్ ద్వారానే సాధ్యం అని వడ్యాట్‌కు చెందిన వివిధ కుల సంఘాల సభ్యులు పేర్కొన్నారు. వారికి కండువాలను కప్పిన ప్రశాంత్‌రెడ్డి పార్టీలోకి స్వాగతం పలికారు. మహిపాల్ పాల్గొన్నారు. -
బాల్కొండ జాగిర్యాల్‌కు సాగునీరందిస్తా..వేముల ప్రశాంత్‌రెడ్డి
సాక్షి, భీమ్‌గల్: మండలంలోని జాగిర్యాల్ గ్రామానికి తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎన్నో నిధులు కేటాయించానని, మళ్లీ గెలిపిస్తే గ్రామస్తులు కోరిన విధంగా సాగునీరు అందించి తీరుతానని టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి ఆయన గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ప్రశాంత్‌రెడ్డికి గ్రామానికి చెందిన వందలాది మంది మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, 24 గంటల ఉచిత విద్యుత్, పింఛన్లు తదితర అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ తనను ఆశీర్వదించాలన్నారు. డాక్టర్ మధుశేఖర్, ఎంపీపీ గోదావరి, జెడ్పీటీసీ లక్ష్మి, ఎంపీటీసీ గడాల లింగు, పసుల రాజమల్లు తదితరులున్నారు. సాక్షి, వేల్పూర్: కేసీఆర్‌కు రైతులు, పేదలు రెండు కళ్లలాంటి వారని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మోతెలో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ప్రభుత్వాలు యాభై ఏళ్లలో రైతులకు, పేదలకు చేయని సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రవేశ పెట్టారని చెప్పారు. విద్యుత్ సమస్య తీర్చినట్లుగానే, కాళేళ్వరం ప్రాజెక్టుతో శాశ్వతంగా సాగునీటి కొరత తీర్చబోతున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఊపిరిపోసిన మోతె గ్రామాభివృద్ధికి సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలు మంజూరు చేసి పెద్దపీట వేశారన్నారు. గత ప్రభుత్వాలు చేసిన పనులకు, టీఆర్ఎఎస్ చేసిన అభివృద్ధికి తేడాను ప్రజలు గమనించాలన్నారు. మరోసారి ఆశీర్వదించి, గెలిపిస్తే మూడు రెట్ల అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ప్రచారానికి వచ్చిన ప్రశాంత్‌రెడ్డికి గ్రామస్తులు బోనాలు, డప్పువాయిద్యాలు, వలగోడుగులతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాలెపు రజిత, జెడ్పీటీసీ వెల్మల విమల, వజ్రలత, మోహన్‌యాదవ్, దొల్ల రాజేశ్వర్‌రెడ్డి, పాలెపు బాల్‌రాజ్, సామ మహిపాల్, పోటూరి నర్సారెడ్డి పాల్గొన్నారు. -
అభ్యర్థుల పోటా పోటీ
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో బరిలో ఉండే అభ్యర్థులెవరో తేలింది. ఆయా నియోజకవర్గాల్లో పోటీ ఏయే పార్టీల మధ్య ఉంటుందనే స్పష్టత వచ్చింది. జిల్లాలో తొమ్మిది స్థానాల్లో మూడు నియోజకవర్గాల్లో నువ్వా.. నేనా.. అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఆరు స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు దీటుగా ఆరు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీని ఇస్తున్నారు. జిల్లాలో తొమ్మిది స్థానాలకు మొత్తం 119 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్, బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోగా ఆయా పార్టీల అభ్యర్థులకు రెబల్స్ బెడద లేకుండా పోయింది. దీంతో ఆయా స్థానాల్లో నెలకొనే పోటీపై స్పష్టత వచ్చినట్లయిం ది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 91 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ⇔నిజామాబాద్ అర్బన్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి, తాజామాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, కాంగ్రెస్ అభ్యర్థి, డీసీసీ అధ్యక్షులు తాహెర్‌బీన్‌హందాన్‌లు నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. అనూహ్యంగా బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణగుప్త పోటీ నుంచి తప్పుకోవడంతో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ కూడా ఈ నియోజకవర్గంలో గట్టి పోటీనిస్తున్నారు. ⇔నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం రణం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు బాజిరెడ్డి గోవర్ధన్, డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి, గడ్డం కేశ్‌పల్లి ఆనందర్‌రెడ్డిల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ముగ్గురు అభ్యర్థులు కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తుండటంతో రూరల్ రణరంగాన్ని తలపిస్తోంది. ⇔బోధన్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు షకీల్ ఆమేర్, పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డిల మధ్య పోరు రసవత్తరంగా మారింది. పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ఇద్దరు అభ్యర్థులు కూడా గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తుండటంతో ఈ నియోజకవర్గంలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ⇔ఆర్మూర్‌లో త్రిముఖ పోరు కొనసాగుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఆకుల లలిత మధ్య హోరాహోరీ నెలకొంది. బీజేపీ అభ్యర్థులు పొద్దుటూరి వినయ్ కుమార్‌రెడ్డిలు కూడా గట్టి పోటీని ఇస్తున్నారు. గెలుపు కోసం ఎవరికి వారే పావులు కదుపుతున్నారు. ⇔బాల్కొండలో ద్విముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఈరవత్రి అనీల్‌లు గెలుపుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థిగా బరిలో ఉన్న ముత్యాల సునీల్‌రెడ్డి తన సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ⇔కామారెడ్డి నియోజకవర్గంలో ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థులు బలంగా ఉండటంతో ఈ నియోజకవర్గం పోరు రసవత్తరంగా తయారైంది. టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్, కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీ, బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డిలు తమ గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ⇔ఎల్లారెడ్డిలో మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నల్లమడుగు సురేందర్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మారెడ్డి బరిలో ఉండటంతో ఇక్కడ పోరు జోరందుకుంది. ⇔బాన్సువాడలో ద్విముఖ పోటీ ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాలరాజుల మధ్య పోరు సాగుతోంది. ⇔జుక్కల్‌లో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్‌షిండే, కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ గంగారాంలు సై అంటే సై అంటున్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన అరుణతార బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ⇔పలు స్థానాల్లో బీఎల్ఎఫ్, బీఎస్పీ అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారం నిర్వహిస్తుండగా, ఆమ్ఆద్మీ, పిరమిడ్‌పార్టీ ఆఫ్ ఇండియా, సమాజ్‌వాది పార్టీ, శివసేన, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్, ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్ వంటి పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. -
ప్రచారం ప్రారంభించిన ప్రశాంత్‌రెడ్డి
సాక్షి,మోర్తాడ్(నిజామాబాద్): ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడం, నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో బాల్కొండ తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి ప్రశాంత్‌రెడ్డి సోమవారం నుంచి ప్రచారం ప్రారంభించారు. తడపాకల్ గోదావరి నది తీరంలో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం గ్రామంలోని తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం దోంచంద, గుమ్మిర్యాల్, తాళ్లరాంపూర్‌లలో ప్రశాంత్‌రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేశానని తెలిపారు. మరోసారి టీఆర్ఎస్కు అవకాశం కల్పిస్తే మరిన్ని సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఆదరించి టీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, నాయకులు కొత్తూర్ లక్ష్మారెడ్డి, కోటపాటి నర్సింహానాయుడు, డాక్టర్ మధుశేఖర్, డీసీసీబీ డైరెక్టర్ సోమ చిన్న గంగారెడ్డి, ఎంపీపీ చిన్నయ్య, ఎంపీటీసీ సభ్యుడు గడ్డం లింగారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజాపూర్ణనందం, కల్లెడ ఎలియా, కే.చిన్న రాజేశ్వర్, జైడి చిన్న గంగారెడ్డి, వడ్ల గంగాధర్, డాక్టర్ మధు, ఉప్లూర్ చిన్నారెడ్డి, బద్దం ప్రభాకర్, గంధం మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. -
డిసెంబర్‌కు భగీరథ నీళ్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు దశల వారీగా నీళ్లు అంది స్తామని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఇందుకు అవసరమైన పంపులు, మోటార్లు త్వరలోనే వస్తున్నాయని, వాటిని బిగించేందుకు అన్ని పనులు పూర్తి చేయాలని చీఫ్ ఇంజనీర్లను ఆదేశించా మన్నారు. మిషన్ భగీరథ పనుల పురో గతిపై చీఫ్ ఇంజనీర్లు, అన్ని జిల్లాల ఎస్ఈ లతో బుధవారం ప్రశాంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పనుల పురో గతిపై నివేదికలు తయారు చేయాలన్నారు. ఇంటెక్‌వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, పైప్‌లైన్ పనుల వివరాలతో సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు. ఈ సమా వేశంలో చీఫ్ ఇంజనీర్లు కృపాకర్‌రెడ్డి, విజయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
2018 డిసెంబర్ నాటికి ‘భగీరథ’ పూర్తి
వేముల ప్రశాంత్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలోని 28,400 ఆవాసాలకు సురక్షిత తాగునీటిని ఇంటింటికీ అందించేందుకు చేపట్టిన పనులు చురుకుగా కొనసాగుతున్నట్లు మిషన్ భగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు రక్షిత మంచినీటి సరఫరా చేసే మిషన్ భగీరథను దైవకార్యంలా చేపడుతున్న సీఎం కేసీఆర్.. నీళ్లివ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లడగమని తనకు తాను సవాల్ విసురుకున్నారన్నారు. ఎన్నికల కంటే ఏడాది ముందుగా 2018 డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్ నుండి సమాచార పౌర సంబంధాల శాఖచే నిర్వహించిన ప్రెస్‌టూర్ సందర్భంగా పోచంపాడ్ అతిథి గృహంలో మిషన్ భగీరథ పనుల గురించి వేముల ప్రశాంత్‌రెడ్డి వివరించారు. రూ. 40 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన మిషన్ భగీరథ పనుల కింద రాష్ట్రవ్యాప్తంగా నీటిని సరఫరా చేసేందుకు 19 ఇన్‌టెక్ వెల్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు నెలాఖరుకు 1995 ఆవాసాలకు, డిసెంబరు నెలాఖరుకు 6,100 ఆవాసాలకు, 2018 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో నిర్దేశించిన 28,400 ఆవాసాలకు దశలవారీగా నల్లా కనెక్షన్ల ద్వారా ఇంటింటికీ సరిపడా నీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ పనుల పరిశీలన నిజామాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ పనుల తీరును ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో జలాల్పూర్ వద్ద నిర్మిస్తున్న ఇన్‌టెక్ పనులను పరిశీలించిన ఆయన.. ఇకనైనా కాంట్రాక్టర్లు అలసత్వం వీడాలని సూచించారు. నాగాపూర్, కిసాన్‌నగర్, జలాల్పూర్ పైపులైన్ నిర్మాణం పనులను ఆయన చూశారు. మిషన్ భగీరథలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని 1,645 ఆవాసాలకు, 4 మున్సిపాలిటీలకు తాగునీటిని అందించేందుకు రూ. 2,650 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పనుల్ని తక్షణమే పూర్తి చేయించాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ఓఎస్డీ సత్యపాల్‌రెడ్డి, ఎస్ఈ ప్రసాదరెడ్డి, ఈఈ. రమేశ్, పీఎస్ రాజేశ్వర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.