విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బైకు
స్తంభం విరిగిపోవడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం
కీసర: వేగంగా వెళ్తున్న బైకు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో విరిగిపడింది. దీంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి మండలంలోని దమ్మాయిగూడ ద్వార కానగర్ కాలనీలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ద్వారకానగర్ కాలనీలో నివాసం ఉండే ఓ యువకుడు ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో తన స్పోర్ట్స్ బైక్‌మీద ఈసీఐఎల్ నుంచి ఇంటికి వస్తున్నాడు.
వాహనం అతివేగంగా ఉండడంతో కాలనీలో అదుపుతప్పి ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. దీంతో స్తంభం విరిగిపడింది. అదృష్టవశాత్తు బైకుపై ఉన్న యువకుడు స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కాగా విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ద్వారకానగర్ కాలనీ, సాయితిరుమల కాలనీ, పాత గ్రామం, బ్యాంకు కాలనీల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.