సాక్షి, రంగారెడ్డి జిల్లా: సంక్షేమ హాస్టళ్లలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. బోగస్‌ల పేరుతో సర్కారు సొమ్మును స్వాహా చేస్తున్న అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు సంక్షేమ వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ సంకల్పించింది. ఇప్పటికే రాష్ట్రంలోని ముప్పావువంతు హాస్టళ్లకు బయోమెట్రిక్ పరికరాలను సరఫరా చేసింది. అయితే సాంకేతిక సమస్యను సాకుగా చూపుతూ కాలయాపన చేస్తున్న వసతిగృహ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ శాఖ సంచాలకులు ఎంవీరెడ్డి నెలరోజుల్లోగా పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ విధానాన్ని అమల్లోకి తేవాలని స్పష్టం చేశారు. ఈమేరకు మంగళవారం పరిగి, చేవెళ్ల ప్రాంతాల్లోని పలు హాస్టళ్లను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
వేలిముద్రలు.. ఆధార్ వివరాలు..
వసతిగృహాల్లో విద్యార్థుల సంఖ్యలో తేడాలు చూపుతూ పెద్దఎత్తున సర్కారు సొమ్మును స్వాహా చేస్తున్న తీరు ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడుల్లో వెలుగు చూసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో అన్నింటా అక్రమాలు వెలుగుచూశాయి. ఈ క్రమంలో ఇప్పటికే తలపెట్టిన బయోమెట్రిక్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసి అక్రమాలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలోని 801 సంక్షేమ వసతిగృహాలుండగా.. 650 హాస్టళ్లకు బయోమెట్రిక్ మిషిన్లు సరఫరా చేశారు. కానీ చాలాచోట్ల వీటిని అమర్చకపోవడంతో అవి మూలన పడ్డాయి. తాజాగా వీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు సాంఘిక సంక్షేమశాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలో జిల్లాలోని 54 హాస్టళ్లలో బయోమెట్రిక్ మిషన్లు అమర్చనున్నారు. కొత్తగా అమర్చే మిషిన్లు ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ ద్వారా నడుస్తాయి. వీటిలో విద్యార్థుల వేలిముద్రలతోపాటు ఆధార్ కార్డు వివరాలు కూడా నమోదు చేస్తారు. దీంతో విద్యార్థి హాజరు వేసిన వెంటనే ఈ వివరాలను సరిచూసుకుని అనంతరం మిషిన్ ఆమోదిస్తుంది.
ఎక్కడినుంచైనా పర్యవేక్షణ..
సంక్షేమ వసతిగృహాల్లో అమర్చే హాజరు నమోదు చేసే పరికరాలకు ఇం టర్నెట్‌ను అనుసంధానిస్తారు. దీంతో విద్యార్థి హాజరు వేసిన మరుక్షణమే కేంద్ర సర్వర్‌లో నమోదవుతుంది. ఈ వ్యవస్థంతా రాష్ట్ర కార్యాలయానికి అనుసంధానమై ఉంటుంది. అదేవిధంగా శాఖ వెబ్‌సైట్‌కు కూడా దీన్ని కనెక్ట్ చేస్తారు. దీంతో రాష్ట్రంలో ఎక్కడినుంచైనా విద్యార్థుల హాజరు తీరును పరిశీలించవచ్చని రాష్ట్ర డెరైక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. విద్యార్థుల హాజరుతోనే హాస్టల్ పనితీరు స్పష్టమవుతుందని, అయితే ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడానికి నెలరోజుల సమయం పడుతుందని ఆయన ‘సాక్షి’తో పేర్కొన్నారు.
హాస్టళ్లలో బయోమెట్రిక్
Published Wed, Mar 4 2015 2:59 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement