బైసన్ గ్రౌండ్స్‌లో సచివాలయం | Bison in the Secretariat Grounds | Sakshi
Sakshi News home page

బైసన్ గ్రౌండ్స్‌లో సచివాలయం

Published Fri, May 8 2015 12:48 AM | Last Updated on Mon, Aug 13 2018 4:03 PM

బైసన్ గ్రౌండ్స్‌లో  సచివాలయం - Sakshi

బైసన్ గ్రౌండ్స్‌లో సచివాలయం

మైదానాన్ని ఇవ్వాల్సిందిగా రక్షణ మంత్రిని కోరిన కేసీఆర్
 
అందుకు ప్రత్యామ్నాయంగా స్థలం ఇస్తామని వెల్లడి
కంటోన్మెంట్‌లో రోడ్ల విస్తరణకు ఇబ్బందుల ప్రస్తావన
సానుకూలంగా స్పందించిన రక్షణ మంత్రి పారికర్
రాష్ట్రంలో రెండు సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు హామీ
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌తోనూ ముఖ్యమంత్రి భేటీ

 
న్యూఢిల్లీ:  తెలంగాణ సచివాలయం నిర్మించేందుకు వీలుగా సికింద్రాబాద్‌లోని 60 ఎకరాల బైసన్ గ్రౌండ్స్ స్థలాన్ని ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పార్టీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రు తేజావత్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంఓ కార్యాలయ ముఖ్య అధికారులతో కలసి సౌత్‌బ్లాక్‌లో పారికర్‌తో సమావేశమమైన కేసీఆర్ ఈ అంశంపై చర్చించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన పారికర్... డిఫెన్స్ ల్యాండ్ ఇచ్చినందుకు ప్రతిగా నిబంధనల ప్రకారం భూమి ఇవ్వాలని సూచించారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ ‘మాకు ల్యాండ్‌బ్యాంక్ ఉంది. అందులోంచి మీకు 60 ఎకరాల స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. మీ అధికారులను పంపండి. గోల్కొండ దగ్గర, లేదంటే ప్రస్తుత కంటోన్మెంట్ వైపు ఉన్న స్థలాలు ఇస్తాం’ అని చెప్పారు.

ఈ అంశంపై మరోమారు హైదరాబాద్‌లో ఎస్టేట్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చర్చించుకోవాలని వారిరువురూ నిర్ణయించారు. రాష్ట్రంలో సైనిక్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని కేసీఆర్ కోరగా తెలంగాణలో రెండు సైనిక్ స్కూళ్లు త్వరలోనే మంజూరు చేస్తామని పారికర్ హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ ప్రాంతంలో కొన్ని రోడ్ల విస్తరణలో సమస్యలతోపాటు హైదరాబాద్‌కు వచ్చే గోదావరి నీటి పైప్‌లైన్ ఏర్పాటులో కంటోన్మెంట్ ప్రాంతంలో కొన్ని ఇబ్బందులున్న విషయాన్ని కేసీఆర్...రక్షణ మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ భేటీ అనంతరం ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ అన్ని విషయాలపై రక్షణ మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. హైదరాబాద్‌లోని ఆదిభట్లలో టాటా గ్రూపు హెలికాప్టర్ తయారీ సంస్థకు అవసరమైన అదనపు భూములను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, కేంద్రం శ్రీకారంచుట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’కు సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రితో కేసీఆర్ అన్నట్లు జితేందర్‌రెడ్డి తెలిపారు. మేడ్చల్-నాగ్‌పూర్ జాతీయ రహదారిని బోయిన్‌పల్లి వద్ద విస్తరించాల్సి ఉందని, కరీంనగర్ రాజీవ్ రహదారి విస్తరణలో భాగంగా జేబీఎస్ బస్‌స్టాండ్ నుంచి నేరుగా కరీంనగర్ రోడ్డులో హకీంపేట్ దాటాక కలిసేలా ఎలివేటెడ్ హైవే వేస్తున్నామని, రోడ్డు వెడల్పు కోసం కొన్ని రక్షణశాఖ భూములు ఇవ్వాలని కేసీఆర్ కోరినట్లు వినోద్‌కుమార్ చెప్పారు. రోడ్ల విస్తరణకు అవసరమైన భూములు కేటాయించేలా స్థానిక అధికారులతో మాట్లాడతానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు.
 
విభజన హామీలు నెరవేర్చండి...

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అన్ని హామీలను వీలైనంత త్వరగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను సీఎం కేసీఆర్ కోరారు. అలాగే తెలంగాణలో పోలీస్‌శాఖను పటిష్టపరిచేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావులతో కలసి నార్త్‌బ్లాక్‌కు చేరుకున్న కేసీఆర్ అరగంటకుపైగా రాజ్‌నాథ్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో పోలీస్‌శాఖ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. పోలీస్ వ్యవస్థ ఆధునీకీకరణలో భాగంగా మెగాసిటీ పోలీసింగ్, మోడ్రనైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ (ఎంపీఎఫ్) కింద నిధులు విడుదల చేయాలని కోరారు.
 
గతంలోనూ భూముల బదిలీ
 
హైదరాబాద్‌లోని కంటోన్మెంట్ భూములను రాష్ట్ర పరిధిలోకి బదలాయించాలన్న సీఎం కేసీఆర్ విజ్ఞప్తులు ఫలిస్తే విశాల మైదానాల్లో కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టే అవకాశముంది. విస్తీర్ణపరంగా దేశంలోనే అతి పెద్దదైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో 30 ఎకరాల్లో జింఖానా, 28 ఎకరాల్లో బైసన్ పోలో, 30 ఎకరాల్లో పరేడ్‌మైదానాలు విస్తరించి ఉన్నాయి. ఈ భూములన్నీ ప్రస్తుతం రక్షణ శాఖ పరిధిలో ఉన్నా యి. 1991లో రక్షణ శాఖ అధీనంలోని 28 ఎకరాల భూమిని పీజీ కళాశాల నిర్మాణం కోసం, 1992లో నందమూరినగర్ కోసం 15 ఎకరాల భూమిని రాష్ట్రానికి కేంద్రం బదిలీ చేసింది. వీటికి బోయిన్‌పల్లిలోని రామన్నకుంటలో ఏడున్నర ఎకరాలు, రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో 40 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి రక్షణ శాఖకు అప్పగించింది. ఇప్పుడు కూడా ఈ మైదానాలను రాష్ట్రానికి ఇస్తే.. పీజీ కళాశాల భూములను సచివాలయ నిర్మాణానికి వాడుకొని వాటిని ఉస్మానియా వర్సిటీకి తరలించే అవకాశముంది. జూబ్లీ బస్‌స్టాప్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, బేగంపేట ఎయిర్‌పోర్టు, మెట్రోరైల్ జంక్షన్ కూడా ఈ మైదానాలకు సమీపంలో ఉన్నందున ఇక్కడ సచివాలయం నిర్మిస్తే అన్నింటికీ అనువుగా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. కాగా, విస్తీర్ణంతో సంబంధం లేకుండా తాము అప్పగించే భూములకు ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా ఇతర ప్రాంతాల్లో ఆ మేరకు భూములను తీసుకోవాలని రక్షణ శాఖ యోచిస్తున్నట్లు సమాచారం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement