బీజేపీతో ఎంఐఎం మిలాఖత్ | BJP alliance with MiM | Sakshi
Sakshi News home page

బీజేపీతో ఎంఐఎం మిలాఖత్

Published Mon, Nov 24 2014 2:33 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

బీజేపీతో ఎంఐఎం మిలాఖత్ - Sakshi

బీజేపీతో ఎంఐఎం మిలాఖత్

టీపీసీసీ మైనారిటీ సమ్మేళనంలో దిగ్విజయ్‌సింగ్ మండిపాటు
అసద్, అక్బర్.. మీరు మోదీతో చేతులు కలిపారా?
మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా ఎందుకు ఓటేయలేదు?
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతాం
మైనారిటీలకు రిజర్వేషన్ ఘనత వైఎస్సార్‌దే: కేంద్ర మాజీ మంత్రి  సల్మాన్ ఖుర్షీద్


హైదరాబాద్: ‘‘మహారాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్ష రోజు ఎంఐఎంకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయలేదు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం అభ్యర్థులను వెదుకుతు న్నారు. ఎంఐఎం బీజేపీతో మిలాఖత్ అయ్యిం దా..? అసద్, అక్బర్.. మీరు మోదీతో చేతులు కలిపారా...’’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ప్ర శ్నించారు. ఆదివారమిక్కడ టీపీసీసీ మైనారిటీ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రానికి ముందు, తర్వాత మత తత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడిందని చెప్పారు. ఎంఐ ఎంతో కొద్ది రోజులు కలసి ఉన్నా.. ఇప్పు డా పరిస్థితి లేదని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో కాం గ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించా రు. హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ విషయంలో చొరవ తీసుకుని అన్ని డివిజన్లలో అభ్యర్థులను పోటీకి నిలపాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వారికే అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. డిసెంబర్ 9 నుంచి 16 దాకా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని శ్రేణులకు సూచించారు.


మైనారిటీలకు రిజర్వేషన్ ఘనత వైఎస్‌దే..

‘‘మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదే. సోనియాగాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చొరవ తీసుకున్నారు. వైఎస్ ఇచ్చారు. ఇతర రాష్ట్రాలకు మీరే మార్గదర్శకంగా నిలిచారు. ఈ దేశ హిందూ సోదరులే మనకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చారన్న విషయం మరవకూడదు..’’ అని కేంద్ర మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. ఎంఐఎం మతతత్వ పార్టీ అని ఆయన దుయ్యబట్టారు. సమాజ్‌వాదీ పార్టీ, ఎంఐఎం ముస్లింలను ఎప్పుడూ ఓటు బ్యాంకుగానే చూశాయని, కాంగ్రెస్ అలా కాదని పేర్కొన్నారు. ఏఐసీసీ మైనారిటీ సెల్ చైర్మన్ ఖుర్షీద్ అహ్మద్ మాట్లాడుతూ.. పదేళ్ల యూపీఏ పాలనలో మైనారిటీల కోసం ఎంతో చేసిందన్నారు. ‘‘కాంగ్రెస్... పాముకు పాలు పోసి పెంచింది. కానీ అదే పాము మహారాష్ట్రకు వెళ్లి కాంగ్రెస్‌ను కాటేసింది..’’ అని ఎంఐఎం పేరు ప్రస్తావించకుండా దుయ్యబట్టారు. మైనారిటీలకు ఇచ్చిన రిజర్వేషన్లను కింది స్థాయి వరకు తీసుకుపోలేక పోయామని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా పేర్కొన్నారు. శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష నేత డి.శ్రీనివాస్ ప్రసంగిస్తూ... ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని కేసీఆర్  అంటున్నారని, కానీ అది సాధ్యం కాదని పేర్కొన్నారు. ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్ ఎలా తీసేద్దామా అని మోదీ చూస్తున్నారని, 12 శాతం రిజర్వేషన్ అంటూ కేసీఆర్ ఇటు ముస్లింలను, అటు ఎస్టీలను ఇరికించారని విమర్శించారు.

వైఎస్ వల్లే ఉన్నత చదువులు: ముస్లిం మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ అమలు కావడం వల్లే ఉన్నత చదువులు సాధ్యమయ్యాయని, ఇది వైఎస్ పుణ్యమేనని పలువురు విద్యార్థులు మైనారిటీ సమ్మేళనంలో చెప్పారు. రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొంది, కాంగ్రెస్‌తో సంబంధం లేని విద్యార్థులతో ఈ సమ్మేళనంలో మాట్లాడించారు. షాదన్ కాలేజీలో మెడిసిన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన నజియా అనే విద్యార్థి మాట్లాడుతూ... మైనారిటీలకు రిజర్వేషన్ వైఎస్సార్ వల్లే సాధ్యమైందని పేర్కొనడంతో సభా ప్రాంగణంలో హర్షధ్వానాలు మిన్నంటాయి. ఇప్పటికే ఉస్మానియాలో వైద్య విద్య పూర్తి చేసిన నల్లగొండ జిల్లా వలిగొండకు చెందిన సలీం కూడా రిజర్వేషన్ వల్ల జరిగిన మేలును వివరించారు. ఆ తర్వాత ప్రసంగించిన ముఖ్య నేత లు కూడా వైఎస్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. టీపీసీసీ మైనారిటీ సెల్ చైర్మన్ సిరాజుద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో సీఎల్పీ నేత జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు షబ్బీర్ అలీ, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ప్రసంగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement