హైదరాబాద్: సమాజాన్ని విభజించేలా ఉన్న మజ్లిస్ నేత అక్బరుద్దీన్ వ్యాఖ్యలను తమ పార్టీ ఖండిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు తెలిపారు. హిందుత్వ శక్తులు ముస్లిం ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నాయని అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కృష్ణసాగర్ డిమాండ్ చేశారు. అక్బర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ విధానం ఏమిటని ప్రశ్నించారు.
పాత నేరస్తుడైన అక్బర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. హైదరాబాద్ ఎంపీ స్థానం బీజేపీ గెలిచే అవకాశం ఉందనే భయంతోనే అక్బర్ ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మజ్లిస్ పార్టీ ఓ పరాన్న జీవి అని ఇంతుకుముందు కాంగ్రెస్, ఇప్పుడు టీఆర్‌ఎస్ మద్దతుతో బతుకుతోందని వ్యాఖ్యానించారు. యూపీలో లాగానే ఇక్కడ కూడా ముస్లింలు బీజేపీకి ఓటు వేస్తారనే భయం ఎంఐఎంను వెంటాడుతుందన్నారు. మతం పేరుతో ఓట్లు అడుగుతున్న మజ్లిస్‌పై వీడియోతో సహా ఎన్నికల కమిషన్‌కు ఆధారాలు ఇస్తామని తెలిపారు.