
మెదక్ నియోజకవర్గ బీజేపీ టికెట్ విషయంలోనూ స్థానికత అంశం తెరపైకి వచ్చింది. ఈ టికెట్‌ను బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆకుల రాజయ్య ఆశిస్తున్నట్లు సమాచారం. కానీ లోకల్ నాయకులకే టికెట్ ఇవ్వాలని ఆశావహులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ఆశావహుల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా.. కలిసి పనిచేస్తామని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే కొంత మంది నాయకులు మాత్రం స్థానికేతరుడికి టికెట్ ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయం బయటకు రావడంతో కలవరం మొదలైంది. లోకల్ నాయకులకు టికెట్ ఇవ్వకుంటే పార్టీ వీడేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆశావహులు తమ అభిప్రాయలను అధిష్టానానికి బలంగా వినిపిస్తున్నారు.
సాక్షి, మెదక్ : బీజేపీ మెదక్ ఎమ్మెల్యే టికెట్ కేటాయింపు పార్టీలో అంతర్గత విభేదాలకు దారితీస్తోంది. మెదక్ ఎమ్మెల్యే టికెట్ కోసం స్థానిక నేతలు ప³లువురు పోటీ పడుతున్నారు. అయితే బీజేపీ అధిష్టానం స్థానికేతర నాయకుడిని ఎమ్మెల్యే బరిలో ఉంచేం దుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన స్థానిక ఆశావహులు అధిష్టానం తీరుపై మండిపడుతున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో స్థానికులకే ఈ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, స్థానికేతరులకు పార్టీ టికెట్ ఇస్తే తాము సహకరించేదిలేదని ఆశావహులు ఖరాఖండిగా బీజేపీ పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది.కాగా కొంత మంది బీజేపీ నాయకులు స్థానికేతర నాయకులకు సహకరించేందుకు కూడా సుముఖత వ్యక్తం చేయటం బీజేపీ పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ టికెట్ కోసం బీజేపీ నాయకులు రాంచరణ్‌యాదవ్, కటికె శ్రీనివాస్, నందారెడ్డి, తాళ్లపల్లి రాజశేఖర్, గడ్డం కాశీనాథ్, వనపర్తి వెంకటేశం, గడ్డం శ్రీనివా స్ తదితరులు పోటీ పడుతున్నారు. వీరంతా ఎవరికివారే టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఆకుల రాజయ్య మెదక్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం పెద్దలు కూడా రాజయ్యకు టికెట్ ఇచ్చే విషయంలో సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఇటీవల బీజేపీ అధిష్టానం నియోజకవర్గ నాయకులతో సమావేశమై ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారి అభిప్రాయాలను తెలుసుకుంది. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నాయకులంతా స్థానికులకే టికెట్ ఇవ్వాలని, స్థానికులకు ఎవ్వరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని అధిష్టానం పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది.
తెర వెనక రాజకీయం..
స్థానికేతర నాయకులకు టికెట్ ఇస్తే సహించేదిలేదని, ఎట్టి పరిస్థితుల్లో స్థానికులకే టికెట్ ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాంచరణ్‌యాదవ్, ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న కటికె శ్రీనివాస్, తాళ్ల పల్లి రాజశేఖర్, నందారెడ్డి తదితరులు స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే కొంత మంది నాయకులు మాత్రం స్థానికేతర నాయకులకు టికెట్ దక్కేలా తెరవెనుక పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మెదక్ నుంచి పోటీచేసేందుకు ఆసక్తి ఉన్న రాజయ్యకు మద్దతు తెలుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఆశావహులు స్థానికేతర నాయకుడికి మద్దతు తెలుపుతున్న నాయకులను నిలదీయటమే కాకుండా గొడవ పడినట్లు తెలుస్తోంది. మెదక్ టికెట్ ఎట్టి పరిస్థితుల్లో స్థానికులకు ఇవ్వాలని, స్థానికేతరులకు ఇస్తే తాము పార్టీ వీడేందుకు వెనకాడేదిలేదని ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్న పలువురు నాయకులు సోమవారం బీజేపీ అధిష్టానం పెద్దలు నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ స్థానికులకు ఇస్తుందా? లేక స్థానికేతరుడైన నాయకునికి కట్టబెడుతుందా? అన్న అంశం చర్చనీయాంశంగా మారుతోంది.
Comments
Please login to add a commentAdd a comment