
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్
సాక్షి, హైదరాబాద్ : ఎంపీ కవితకు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్ విమర్శించారు. డి.శ్రీనివాస్ మీద కవిత, ఇతర టీఆర్‌ఎస్ నేతలు రాసిన లేఖలో రాజకీయ అపరిపక్వత కనిపిస్తోందన్నారు. భవిష్యత్ మీద వారి ఆందోళన చూసి జాలేస్తోందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలతో మాట్లాడారని లేఖలో వెల్లడించారని, వారి ఆరోపణలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
కొడుకు మీద కోపంతో తండ్రి మీద చర్యలు తీసుకోవడం విడ్డూరం, హాస్యాస్పదమన్నారు. డీఎస్ తనకు బీజేపీలో సాయం చేయడమేంటని.. తన పార్టీ వేరు.. ఆయన పార్టీ వేరని స్పష్టం చేశారు. డీఎస్, కవిత టీఆర్‌ఎస్‌లో ఉన్నారని.. అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయమన్నారు. ‘నా కోసం మా నాన్న (డీఎస్) ఒక్క ఫోన్ కాల్ కూడా చేసిన దాఖలాలు లేవు. నేను కవితలాగా తండ్రి చాటు బిడ్డను కాదు.. నేను బీజేపీలోకి సొంతంగా వచ్చాను. నా పార్టీని మీ రాజకీయాల్లోకి తీసుకువస్తే సహించను. నా రాజకీయ జీవితం అంతా బీజేపీలోనే’అని అరవింద్ స్పష్టం చేశారు.