సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ, బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ సోమవారం ఉదయం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. లక్ష్మణ్‌ను అరెస్ట్ చేసి నిమ్స్‌కు తరలించారు. తొలుత ఇంటి వద్దే లక్ష్మణ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా వారి కళ్లుగప్పి ఆయన క్యాబ్‌లో పార్టీ కార్యాలయానికి చేరుకొని దీక్ష ప్రారంభించారు. దీంతో అక్కడ దీక్ష ›ప్రారంభించిన కొద్దిసేపటికే పోలీసులు రావడంతో అరెస్ట్‌లను అడ్డుకునేందుకు నాయకులు, కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో అక్కడ తోపులాట జరగ్గా పార్టీ తరఫున చాంద్రాయణగుట్ట అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన షెహజాది సొమ్మసిల్లారు. అనంతరం లక్ష్మణ్‌ను అరెస్ట్ చేసి నిమ్స్‌కు, పార్టీ నాయకులను అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు దీక్ష ప్రారంభించిన సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ అనుభవం లేని గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థకు ఇంటర్ ఫలితాల ప్రాసెసింగ్ బాధ్యతను ప్రభుత్వం ఎలా అప్పగించిందని ప్రశ్నించారు. బోర్డు నిర్వాకం వల్ల 24 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మనోస్థైర్యాన్ని కల్పించేందుకే దీక్ష నిర్వహిస్తున్నామన్నారు.
విద్యార్థులూ.. ఆత్మహత్యలొద్దు
విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపేది లేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. పోలీసులు తనను బలవంతంగా నిమ్స్‌కు తరలించినా దీక్ష ఆగదని, నిరశనను కొనసాగిస్తానని చెప్పారు. విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, వారికి అండగా బీజేపీ ఉంటుందన్నారు. ప్రభుత్వం నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
సీఎం నైతిక బాధ్యత వహించాలి: రాంమాధవ్
ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి సీఎం కేసీఆర్, విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి, బోర్డు కార్యదర్శి అశోక్ నైతిక బాధ్యత వహించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు ఆత్మవిశ్వాసం కల్పించకపోగా అహంకారం ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఇంటర్ బోర్డు అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని ఎంపీ దత్తాత్రేయ డిమాండ్ చేశారు. బాధ్యులపై సీబీఐ విచారణ లేదా సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తే తమ బతుకులు మారతాయని ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తు స్వరాష్ట్రంలో అంధకారంలో మునిగిపోయిందని డీకే అరుణ విమర్శించారు. 24 మంది విద్యార్థుల ప్రాణాలు పోవడానికి సీఎం కేసీఆర్ నిర్లక్ష్యమే కారణమన్నారు. ఆత్మహత్యలు వద్దంటూ ట్వీట్లు చేసే కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడలేరా అని ప్రశ్నించారు.
నేడు ప్రగతిభవన్ ముట్టడి: మురళీధర్‌రావు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఇతర నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఖండించారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో దీక్ష చేస్తున్న లక్ష్మణ్‌ను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా లక్ష్మణ్ దీక్ష చేపట్టారని తెలిపారు. పోలీసుల తీరుకు నిరసనగా మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద నిరసన చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రగతిభవన్ ముట్టడి సహా రేపటి అన్ని కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయని మురళీధర్‌రావు స్పష్టం చేశారు.
దీక్షకు పలువురి సంఘీభావం...
లక్ష్మణ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు మురళీధర్‌రావు, రాంమాధవ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, గుజ్జ కృష్ణ, జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు సంఘీభావం తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావులను పోలీసులు వారి ఇళ్లలోనే గృహ నిర్బంధంలో ఉంచారు.
లక్ష్మణ్ దీక్ష భగ్నం, అరెస్ట్
Published Tue, Apr 30 2019 1:19 AM | Last Updated on Tue, Apr 30 2019 1:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment