
హైదరాబాద్: ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ, ఇంటర్ బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ, విద్యార్థులకు పూర్తి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సోమవారం ఉదయం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద నిరవధిక నిరశన చేపట్టనున్నారు. అంతకుముందే ముషీరాబాద్‌లోని క్యాంపు కార్యాలయానికి నగరం నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుంటారు.
అక్కడి నుంచి అనుచరులతో కలసి భారీ కాన్వాయ్‌తో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి లక్ష్మణ్ చేరుకొని అక్కడి దీక్ష శిబిరంలో నిరవధిక నిరాహార దీక్ష చేపడతారు. దీనికి సంబంధించి ఆదివారం ముషీరాబాద్ క్యాంపు కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి నిరశన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నెల 28న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు, 29న విద్యార్థులు, మేధావులతో హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశం, 30న ప్రగతిభవన్ ము ట్టడి, మే 2న రాష్ట్ర బంద్ చేపట్టాలని నిర్ణయించా రు. కానీ అకస్మాత్తుగా లక్ష్మణ్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టే కార్యక్రమానికి పూనుకోవడం.. ఇంటర్ ఫలితాల అంశాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకుందని, ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఒక వైపు రాష్ట్ర అధ్యక్షుడిగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ.. మరో వైపు దీక్షకు మద్దుతుగా రోజుకో కార్యక్రమాన్ని ప్రజా సంఘాలు, పార్టీ నాయకులు విజయవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల కారణంగా 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడగా, ఆ కుటుంబాల కు ప్రభుత్వం సానుభూతి తెలుపకపోగా తూ.తూ. మం త్రంగా చర్యలు తీసుకోవడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విద్యార్థులకు జరి గిన అన్యాయానికి బాధ్యత వహిస్తూ విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌ను బర్తరఫ్ చేయాలని డాక్టర్ కె.లక్ష్మణ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, ఫలితాల అవకతవకలపై విచారణ జరిపించాలని, గ్లోబరీనా సంస్థ యాజమానులపై క్రిమినల్ కేసులు పెట్టాలనే డిమాండ్‌తో నిరశన చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు.