మల్లికార్జున్‌రెడ్డి ఇంటికి వెళ్లిన ఇంద్రకరణ్‌రెడ్డి
ఆదిలాబాద్ / నిర్మల్: ఎన్నికల ముందే బీజేపీకి గట్టి షాక్ తగిలింది. నిర్మల్ నియోజకవర్గంలో అసంతృప్త వర్గం కారెక్కింది. ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, ఇటీవల టికెట్ ఆశించి భంగపడ్డ ప్రముఖ వైద్యుడు మల్లికార్జున్‌రెడ్డి సోమవారం బీజేపీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పార్టీ పట్టణాధ్యక్షుడు, వివిధ మండలాల, వివిధ మోర్చల అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడా రు. దీంతో నియోజకవర్గంలో కమలదళం దాదా పు ఖాళీ అయ్యింది. వీరంతా సోమవారం రాత్రి టీ ఆర్‌ఎస్ అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువాలు వేసుకున్నారు.
ఊహించని పరిణామం..
సిద్ధాంతపార్టీగా గుర్తింపు ఉన్న భారతీయ జనతాపార్టీలో నుంచి ఏళ్లుగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు దూరం కావడం ఊహించని పరిణామంగా వివిధ వర్గాలు భావిస్తున్నాయి. కొద్ది రోజులుగా తీవ్ర అసంతృప్తిలో ఉన్నప్పటికీ వారు పార్టీతోనే కలిసి వస్తారనే అందరూ భావించారు. కానీ.. ఇప్పుడు పార్టీని కాదని, వ్యక్తిని నమ్ముకుని చాలామంది నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడంపై బీజేపీ నాయకత్వం ఆలోచనలో పడింది. ఏడాదిన్నర క్రితం పార్టీలో చేరిన ప్రముఖ వైద్యుడు మల్లికార్జున్‌రెడ్డి బీజేపీ చేపట్టిన ప్రతీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.
ఎన్నికల షెడ్యూల్ రాకముందు వరకూ ఆయనే అభ్యర్థిగా పార్టీ నాయకులూ గుర్తించారు. మల్లికార్జున్‌రెడ్డి సైతం అప్పటికే ప్రచారం ప్రారంభించారు. అనంతరం నెలన్నర కిందట డాక్టర్ సువర్ణరెడ్డి పార్టీలో చేరడంతో పోటీ మొదలైంది. వారిద్దరూ పోటాపోటీగా ప్రచారం చేసుకున్నారు. మల్లికార్జున్‌రెడ్డి చివరి వరకూ పోటీ పడ్డారు. తన అభ్యర్థిత్వం కోసం గల్లీ నుంచి ఢిల్లీ స్థాయిలోనూ ప్రయత్నాలు చేశారు. చివరకు ఈనెల 2న బీజేపీ రెండో జాబితాలో సువర్ణరెడ్డి అభ్యర్థిత్వం ఖరారైంది. పార్టీ మల్లికార్జున్‌రెడ్డికి మొండిచేయి చూపడంతో ఆయన వర్గీయులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
అసంతృప్తిలోనే..
ఏడాదిన్నరగా పార్టీ కార్యక్రమాలకు అండగా నిలుస్తున్న తనకు అన్యాయం చేశారని, తన అనుచరులుగా ఉంటున్న కార్యకర్తలనూ పట్టించుకోవడం లేదని రాజీనామా చేసిన తర్వాత డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి అన్నారు. ఈనెల 2న బీజేపీ రెండో జాబితాలో మల్లికార్జున్‌రెడ్డి పేరు లేకపోవడంతో ఆయన వెంట ఉన్న జూనియర్ నాయకులంతా నిరాశకు లోనయ్యారు. అదేరోజు రాత్రి నిర్మల్‌లోని మయూరిఇన్ హోటల్‌లో వారంతా సమావేశమయ్యారు. ఈ సమావేశం సమాచారం తెలుసుకుని సీనియర్ నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్ తదితరులు అక్కడికి వచ్చారు. పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా అందరం కలిసి పనిచేయాలని వారు సూచించారు. కానీ.. పార్టీ కోసం పనిచేసిన వారికి అన్యాయం చేశారంటూ అసంతృప్తవర్గం ఆందోళన వ్యక్తం చేసింది.
తర్జనభర్జనల నడుమ..
బీజేపీ నిర్మల్ నియోజకవర్గ అభ్యర్థిగా సువర్ణరెడ్డి పేరు ఖరారు కావడంతోనే మల్లికార్జున్‌రెడ్డి వర్గం నాలుగైదు రోజులుగా చర్చలు జరిపింది. తమ భవిష్యత్ కార్యాచరణపై ఆలోచనలు చేసింది. ఈక్రమంలోనే పార్టీ సీనియర్ నాయకులు, అభ్యర్థి సువర్ణరెడ్డి సైతం మల్లికార్జున్‌రెడ్డి, ఇతర నాయకులను కలిశారు. పార్టీ గెలుపు కోసం సహకరించాలని వారిని కోరారు. బీజేపీలో అసంతృప్త వర్గాన్ని తమ వైపునకు తిప్పుకునేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు సైతం తీవ్ర ప్రయత్నాలు చేశాయి. చివరి వరకూ అసంతృప్తవర్గం బీజేపీలో ఉండటానికి మొగ్గు చూపింది. ఇన్నిరోజులు పార్టీ కోసం పనిచేసిన తమకు న్యాయం చేయాలన్న ధోరణిని వ్యక్తంచేసింది. దీనిపై నాలుగైదు రోజులైనా పార్టీ నుంచి ఆశించిన స్పందన లేకపోవడం, తమ పట్ల పార్టీ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
టీఆర్‌ఎస్‌లో చేరిక..
బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత మల్లికార్జున్‌రెడ్డి వర్గం టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో మల్లికార్జున్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం అల్లోల స్వయంగా మల్లికార్జున్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి ఆయనతోపాటు వర్గీయులనూ తన ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం వారందరికీ గులాబీ కండువాలను వేసి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. మల్లికార్జున్‌రెడ్డితో పాటు బీజేపీ నిర్మల్ పట్టణాధ్యక్షుడు నాయిడి మురళీధర్, జిల్లా కార్యదర్శి బర్కుంట నరేందర్, నిర్మల్ రూరల్ మండలాధ్యక్షుడు గరిగంటి గంగాధర్, మైస శేఖర్(సారంగపూర్), డాక్టర్ నరేశ్(సోన్), కొడిచెర్ల లింగన్న(మామడ) సతీష్(నర్సాపూర్.జి), పీసరి శైలేశ్వర్(దిలావర్‌పూర్), భరత్‌నారాయణ(లక్ష్మణచాంద), బీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు నాంపెల్లి శశిరాజ్‌వర్మ, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు ఎనగందుల సతీశ్, అసెంబ్లీ కన్వీనర్ అన్ముల శ్రావణ్ తదితర బాధ్యతలు ఉన్న నాయకులు, నియోజకవర్గంలోని బీజేపీ అధ్యక్షులు కారు పార్టీలో చేరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.సత్యనారాయణగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేతలు డాక్టర్ యు. సుభాష్‌రావు, గంగారెడ్డి, కౌన్సిలర్లు అయ్యన్నగారి రాజేందర్, జహీర్, పట్టణ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, మారుగొండ రాము తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment