ఎదగని కమలం!
⇒ రాష్ర్టంలో పుంజుకోని బీజేపీ
⇒ ప్రత్యామ్నాయంగా ఎదగడం కష్టమేనంటున్న నేతలు
⇒ తలో దారిలో వెళుతున్న పార్టీ ముఖ్య నేతలు
⇒ అంతకంతకూ పెరుగుతున్న అసమ్మతి
⇒ పార్టీ అధ్యక్షుడి తీరుపైనా విమర్శలు
⇒ సభ్యత్వ నమోదులోనూ వెనుకబాటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే బీజేపీ బలమైన శక్తిగా అవతరిస్తుందన్న అంచనాలు తప్పుతున్నాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు కమల దళం ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుందని భావించినప్పటికీ ఇప్పుడు అది సులభం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ర్టంలో బీజేపీ పాగా వేస్తుందని ఆశించి ఆ పార్టీలో చేరిన నేతలు ఇప్పుడు తమ భవిష్యత్తుపై పునరాలోచనలో పడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించి కేంద్రంలో అధికారం చేజిక్కించుకున్నా రాష్ట్రంలో పార్టీ పునాదులు ఏమాత్రం బలపడకపోవడమే దీనికి కారణమని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు.
జాతీయస్థాయిలో బలమైన నాయకత్వం కలిగి ఉన్నా రాష్ట్రస్థాయిలో ముఖ్య నేతలను కూడగట్టుకోవడంలో పార్టీ విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. పార్టీలోని సీనియర్ నేతలే ఒక్క దారిలో వెళ్లడం లేదన్న వాదన వినిపిస్తోంది. పార్టీని ఒక్కతాటిపై నడిపించగల నేతలను పక్కనబెట్టి ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న వారికే పార్టీ పదవులను కట్టబెడుతున్నారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి రామచంద్రరావు విజయానికి 50 శాతం అభ్యర్థి వ్యక్తిగతమైతే, మిగిలింది టీఆర్‌ఎస్‌పై ఉద్యోగులు, నిరుద్యోగుల్లో వ్యతిరేకతే కారణాలని బీజేపీ నేత ఒకరు విశ్లేషించడం గమనార్హం.
నాలుగోవంతు కూడా కాని సభ్యత్వాలు పార్టీ నేతల మధ్య సఖ్యత లేదనడానికి సభ్యత్వ కార్యక్రమం జరుగుతున్న తీరే అద్దం పడుతోంది. కేంద్రంలో ప్రధాని మోదీ హవా దృష్ట్యా రాష్ట్రంలో పోలింగ్ బూత్‌కు 200 మంది చొప్పున 62 లక్షల సభ్యత్వాలు పూర్తి చేసి చరిత్ర సృష్టించాలని పార్టీ నేతలు భావించా రు. దానికి అనుగుణంగా కార్యక్రమాలు కూడా రూపొందించారు. కానీ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రెండు రోజుల క్రితం దాకా నమోదైన సభ్యత్వాలు 8 లక్షలు దాటలేదు. మరో రెండు వారాల్లో ఈ కార్యక్రమం ముగియనుంది. ఆన్‌లైన్ సభ్యత్వాల కారణంగా లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామని పార్టీ నేతలు అంటున్నారు. అదే తమకు అవరోధంగా మారుతోందని పార్టీ ప్రధాన కార్యదర్శి ఒకరు చెప్పారు.
అధ్యక్షునితోనే సమస్య?
రాష్ట్ర బీజేపీ సీనియర్ నేతల మధ్య సఖ్యత లేకపోవడం ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ మాదిరి బయటకు కనిపించకపోయినా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్, సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి ఎవరికి వారే అన్నట్లుగా విడిపోయారు. అందరినీ ఏకతాటిపై నడిపించాల్సిన పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యక్తిగత ఎజెండాతో వెళుతున్నారని, దానివల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు ఒకరు వ్యాఖ్యానించారు. బయటకు గుంభనంగా కనిపిస్తున్నా, లోలోపల మాత్రం అసమ్మతి రోజురోజుకూ పెరుగుతోందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీతో పొత్తు వల్లే దురవస్థ
మరోవైపు పార్టీ అధ్యక్షుని వైఖరిని తప్పుబడుతున్న వారే ప్రస్తుత దురవస్థకు బాధ్యులని కిషన్‌రెడ్డి సన్నిహితులు అంటున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక జరిగిన తొలి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఉనికిని కాపాడుకోవాలన్న కిషన్‌రెడ్డి వ్యూహాన్ని వ్యక్తిగత స్వార్థంతో ఇద్దరు మాజీ అధ్యక్షులు వ్యతిరేకించారని మండిపడుతున్నారు.
‘టీడీపీ మద్దతుతో ఎన్నికల్లో గెలవాలన్నది వారి తాపత్రయం. దాని కోసం మొత్తం పార్టీ కేడర్‌ను, పార్టీని నమ్ముకుని ఉన్న వారికి తీవ్ర అన్యాయం చేశారు. టీడీపీతో పొత్తు కారణంగా అనేక మంది పార్టీని వీడారు. పార్టీ బలహీనం కావడానికి వారే కారణం’ అని సీనియర్ నేత ఒకరు మండిపడ్డారు. టీడీపీతో పొత్తు కారణంగానే పార్టీ ఎదగలేకపోతోందని మెజారిటీ నేతలు అంగీకరిస్తున్నారు.