అన్ని దారులూ అటువైపే.. | All Party membership registration process in Telangana | Sakshi
Sakshi News home page

అన్ని దారులూ అటువైపే..

Published Mon, Feb 16 2015 12:15 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

All Party membership registration process in Telangana

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాయి. అధికార టీఆర్‌ఎస్‌తోపాటు ప్రతిపక్ష కాం గ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, బీజేపీ... ఇలా అన్ని పార్టీలు స్థానిక పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్ ఇటీవలే సభ్యత్వ నమోదును ప్రారంభించి బిజీబిజీగా ఉండగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలను పూర్తి చేసుకుని గ్రామ, మండల, జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకునే పనిలో పడింది. మరోవైపు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా పార్టీ మహాసభలపై దృష్టి పెట్టాయి. సీపీఎం జిల్లా మహాసభలను పూర్తి చేసుకుని రాష్ట్ర మహాసభల కోసం ఎదురుచూస్తుండగా, సీపీఐ ఇప్పుడే మండల, డివిజన్ సమితిలను ఏర్పాటు చేసుకుంటోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా జిల్లాలో పార్టీ సభ్యత్వాలను పూర్తి చేసుకుని స్థానిక కమిటీలను ఏర్పాటు చేసుకుంటోంది. ఇక, వైఎస్సార్‌సీపీ ఇటీవలే తెలంగాణ రాష్ట్రానికి కొత్త కమిటీని ఏర్పాటు చేసుకున్న ఊపులో ఉంది.
 
 అధికారంతో స్పీడు మీదున్న గులాబీ సేన
 తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోనికి వచ్చిన తర్వాత కొత్త ఊపుతో వెళుతున్న టీఆర్‌ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే పనిలో పడ్డారు ఆ పార్టీ నేతలు. పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం అధినేత కేసీఆర్ మార్గనిర్దేశనంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పడ్డారు ఆ పార్టీ నేతలు. మొత్తంమీద జిల్లా వ్యాప్తంగా 3.6లక్షల మందిని పార్టీ సభ్యులుగా చేర్చుకునే పనిలో పడ్డారు వారంతా. సభ్యత్వాలు పూర్తయిన వెంటనే స్థానిక కమిటీలను వేసుకుని కొత్త జిల్లా కమిటీని ఏప్రిల్‌లో ఏర్పాటు చేసుకుంటామని, ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో జరిగే సమావేశంలో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకుంటామని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. సభ్యత్వం ప్రారంభమైన వారం రోజుల్లో 30 శాతానికి పైగా (లక్షకు పైగా) సభ్యత్వాలు పూర్తయ్యాయని, నిర్ణీత గడువులోపు లక్ష్యాన్ని మించి 5లక్షల మంది వరకు పార్టీలో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
 
 మూడు లక్షల్లో 75 శాతం.. కాంగ్రెస్
 ఇక, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా సభ్యత్వ నమోదు చేస్తూనే ఉంది. ఎప్పుడో ప్రారంభమైన ఆ పార్టీ సభ్యత్వ నమోదు ఇప్పటివరకు 75 శాతం పూర్తయినట్టు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. మొత్తంమీద జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గానికి 25వేల మంది చొప్పున మూడు లక్షల మందిని పార్టీలో చేర్చుకోవడం లక్ష్యం కాగా, ఇందులో 75 శాతం అంటే 2లక్షలకు పైగా సభ్యత్వాలు పూర్తయ్యాయని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. ఈ సభ్యత్వ ప్రక్రియను నెలాఖరు కల్లా పూర్తి చేసుకుని మార్చి మొదటి వారంలో గ్రామ, మండల, బ్లాక్ స్థాయిల్లో పార్టీ నూతన కమిటీలను ఏర్పాటు చేసుకుని ముందుకెళతామని, జిల్లాలో కాంగ్రెస్‌కున్న పటిష్ట పునాదులను కాపాడుతామని వారంటున్నారు.
 
 కొత్త ఊపులో వైఎస్సార్‌సీపీ
 ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవలే కొత్త తెలంగాణ రాష్ట్ర కమిటీని ప్రకటించింది. అందులో జిల్లాకు చెందిన పార్టీ నాయకులకు తగిన ప్రాధాన్యం లభించింది. జిల్లా అధ్యక్షుడు డాక్టర్. గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఇతర నేతలు గున్నం నాగిరెడ్డి, ఎర్నేని బాబు, వడ్లోజు వెంకటేశం, ఇరుగు సునీల్ కుమార్, గూడూరు జైపాల్‌రెడ్డిలకు ఈ కమిటీలో స్థానం లభించింది. మరోవైపు గత నెలలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో నిర్వహించిన పరామర్శయాత్రకు మంచి స్పందన లభించింది. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించిన ఆమెను జిల్లా ప్రజలు సాదరంగా స్వాగతించారు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంచి ఊపు మీద ఉన్నాయి. త్వరలోనే జిల్లాలో సంస్థాగత నిర్మాణ ప్రక్రియ పనిలో పడతామని, త్వరలోనే తేదీలు ఖరారవుతాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
 
 రాష్ట్రంలోనే టీడీపీ రెండో స్థానమంట...
 తెలుగుదేశం పార్టీ కూడా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకుంది. జిల్లాలో మొత్తం లక్షకు పైగా సభ్యత్వాలను చేసి రాష్ట్రంలోనే ఖమ్మం తర్వాత రెండో స్థానంలో నిలిచామని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే, ఫిబ్రవరిలో గ్రామ, వార్డు కమిటీలు, మార్చిలో డివిజన్ కమిటీ లు, ఏప్రిల్‌లో జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకుని మేలో జరిగే మహానాడు కోసం సిద్ధమవుతోంది పార్టీ యంత్రాంగం. అయితే, పార్టీ సభ్యత్వ నమోదులో ఆ పార్టీల నేతలు అనుసరించిన తీరుపై కొన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినా.. లక్ష మందిని తమ పార్టీలో చేర్చుకోవడంలో ఆ పార్టీ నేతలు సఫలీకృతమయ్యారనే చెప్పాలి. సంస్థాగత నిర్మాణం కోసం ఇటీవలే జిల్లా కేంద్రం జనరల్‌బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నా... పార్టీలో ఉన్న గ్రూపులు, గొడవలు ఏ మేరకు సహకరిస్తాయి.. పార్టీ కమిటీలు ఎలా పూర్తి చేసుకుంటారన్నది వేచి చూడాల్సిందే.
 
 కమ్యూనిస్టులదీ అదే దారి
 జిల్లాలోని రెండు ప్రధాన కమ్యూనిస్టు పార్టీలు కూడా సంస్థాగత నిర్మాణ పనిలో పడ్డాయి. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఇప్పటికే జిల్లా స్థాయి మహాసభలను పూర్తి చేసుకుని రాష్ట్ర మహాసభల కోసం ఎదురుచూస్తోంది. గ్రామ, మండల, డివిజన్ పార్టీ కమిటీలన్నింటినీ ఏర్పాటు చేసుకుంది. ఇందులో కొన్నిచోట్ల పాతవారిని తొలగించి కొత్తవారికి అవకాశం కల్పించింది. పార్టీ అనుబంధ సంఘాల మహాసభలు కూడా పూర్తయ్యాయి. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర మహాసభలకు జిల్లాలోని కోదాడ వేదిక కానుంది. ఈనెల 13 నుంచి ఆ మహాసభలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు పార్టీ రాష్ట్ర మహాసభల నిర్వహణకు గాను విరాళాల సేకరణ కోసం జిల్లా నుంచి దాదాపు 500 మందికి పైగా పార్టీ నేతలు, కార్యకర్తలు గత 15 రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేశారు. ఇక, సీపీఐ కూడా స్థానిక కమిటీలను ఏర్పాటు చేసుకుంటోంది. ప్రస్తుతం మండల, డివిజన్ సమితిలను ఏర్పాటు చేసుకునే పనిలో పడింది. ఆ తర్వాత జిల్లా, రాష్ట్ర సమితిలకు కొత్త కార్యవర్గాలను ఎన్నుకోవడం ద్వారా ముందుకెళ్లాలని పార్టీ యోచిస్తోంది.
 స్థానిక కమిటీలపై రాష్ట్ర పార్టీదే నిర్ణయం..
 
 ఇక, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ జాతీయ నేత మురళీధర్‌రావు కూడా హాజరయ్యారు. మార్చి 31 వరకు ఈ సభ్యత్వ ప్రక్రియ సాగుతుందని పార్టీ నేతలు చెపుతున్నారు. అయితే, నియోజకవర్గానికి 25వేల మంది చొప్పున మూడు లక్షల సభ్యుల్లో ఇప్పటివరకు 60శాతానికి పైగా పూర్తయిందని, ఆన్‌లైన్‌లో ఉన్న ఈ లెక్కలు త్వరలోనే నిర్వహించనున్న సమావేశంలో తేలుతాయని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. అయితే, స్థానిక కమిటీల ఏర్పాటుపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని, ఏప్రిల్‌లో రాష్ట్ర పార్టీ దీనిపై నిర్ణయం తీసుకోనుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement