అధికారికంగా 11 రౌండ్ల ఫలితాలు వెల్లడి
వరంగల్ : వరంగల్ ఉప ఎన్నికలో 'కారు' జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 11 రౌండ్ల ఓట్ల లెక్కింపును అధికారులు వెల్లడించారు. ఇక ఆది నుంచి టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ సుమారు రెండున్నర లక్షలకు పైగా ఆధిక్యంలో అంచనాలకు మించి దూసుకుపోతున్నారు.
టీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉండగా, కాంగ్రెస్ ద్వితీయ స్థానంలో ఉంది. ఇప్పటి వరకూ కౌంటింగ్ పూర్తయిన ప్రతి రౌండ్ లోనూ టీఆర్ఎస్ 62 శాతం , కాంగ్రెస్ 16 శాతం, బీజేపీ 11 శాతం ఓట్లు కైవసం చేసుకున్నాయి. కాగా 11 రౌండ్ల ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. టీఆర్ఎస్ 2,76,497, ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఇక టీఆర్ఎస్- 3,73,279, కాంగ్రెస్- 96,782, బీజేపీ- 75,387, వైఎస్ఆర్ సీపీ- 13490,నోటా-4,801 ఓట్లు వచ్చాయి.
కాగా వరంగల్ ఉపఎన్నికలో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ఫలితాల్లో టీఆర్ఎస్ తొలి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీజేపీ ఉంది. అధికార టీఆర్ఎస్ ఏరికోరి తెలంగాణవాది పసునూరి దయాకర్‌ను నిలబెట్టింది. అనుహ్య పరిణామాల మధ్య సిరిసిల్ల రాజయ్య స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ బరిలోకి దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్, బీజేపీ నుంచి పగిడిపాటి దేవయ్య పోటీ చేశారు.