కేసీఆర్‌ది తలాతోక లేని పాలన
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజం
పటాన్‌చెరు: ‘కేసీఆర్‌ది తలాతోక లేని పాలన. ఆయన కేంద్రంతో కలసి పనిచేయడం లేదు. దుందుడుకుతనంతో వ్యవహరిస్తున్నారు. అయినా రాష్ట్ర బీజేపీ మాత్రం సంయమనంతో వ్యవహరిస్తోంది. తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతోంది’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.
గురువారం మెదక్ జిల్లా పటాన్‌చెరులోని కాంగ్రెస్ నాయకులు కొందరు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని ఆరోపించారు. సంక్షేమమంటూనే అర్హులైన వారి పింఛన్‌లూ, రేషన్‌కార్డులు రద్దు చేశారన్నారు. ఎలాంటి భరోసా ఇవ్వకపోవడం వల్ల 400 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు.
రెండు గదుల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్‌లో సరైన కేటాయింపులు లేవని ఆయన విమర్శించారు. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో మతతత్వ పార్టీ అయిన ఎంఐఎంకు ఓట్లు వేయకూడదని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. టీడీపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు మజ్లిస్‌ను ఎదుర్కొనే శక్తి లేదన్నారు. ఆ పార్టీలు ఎంఐఎం చేతిలో కీలు బొమ్మలుగా మారాయని ఆరోపించారు.
తెలంగాణ అభివృద్ధిపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారని, అందులో భాగంగానే మూతపడిన ఐడీపీఎల్ పరిశ్రమ ఆవరణలో ఫార్మా పరిశోధన సంస్థ ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌కు హార్టికల్చర్ యూనివర్సిటీని ఇచ్చింది కూడా కేంద్రమేనని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. రూ. 250 కోట్లతో నల్లగొండలో ఫ్లోరైడ్‌పై పరిశోధన కేంద్రం, మహబూబ్‌నగర్‌లో వెయ్యి మెగావాట్ల సోలార్, ఎన్‌టీపీసీలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని వివరించారు.