షికారు.. సరికొత్తగా.. | Boat travel in Hussain Sagar | Sakshi
Sakshi News home page

షికారు.. సరికొత్తగా..

Published Sat, Jun 8 2019 1:58 AM | Last Updated on Sat, Jun 8 2019 1:58 AM

Boat travel in Hussain Sagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాగర్‌ అలలపై సరికొత్త పయనం.సాయం సంధ్య వేళల్లో  చల్లగాలుల  నడుమ ఆహ్లాదకరమైన అనుభూతి. ఇంటిల్లిపాదీ కలిసి చేసుకొనే వేడుకలు, విందు, వినోదాలకు అనువైన  బోటు షికార్లు  హుస్సేన్‌సాగర్‌లో అందుబాటులో కి వచ్చాయి. ఒకేసారి పది మంది నుంచి 35 మంది వరకు  కలిసి పయనించే రెండు అందమైన డీలక్స్‌ ఫ్యామిలీ స్పీడ్‌ బోట్లను తెలంగాణ పర్యాటకాభివృద్ధి తాజాగా ప్రవేశపెట్టింది. త్వరలో వీటిని ప్రారంభించనున్నారు. పుట్టిన రోజు, పెళ్లి రోజు వేడుకలు, స్నేహితులతో కలిసి చేసుకొనే పార్టీలకు ఇవి  ఎంతో అనుకూలంగా ఉంటాయి. కొద్ది రోజుల క్రితమే  వీటిని పుణే నుంచి తెప్పించారు. ఒకటి, రెండు రోజుల్లో  డీలక్స్‌ స్పీడ్‌ బోట్‌ల సేవలు అందుబాటులోకి వస్తాయని  పర్యాటకాభివృద్ధి సంస్థ  అధికారి  ఒకరు తెలిపారు.

ఈ రెండు డీలక్స్‌ బోట్‌లతో పాటు ఒకేసారి  80 మందితో ప్రయాణించేందుకు  అనువైన మరో  ‘ క్యాటమెరిన్‌ పాంటమ్‌’ బోట్‌ను కూడా పుణే నుంచి తెప్పించారు. అన్ని హంగులతో  సిద్ధమవుతున్న ఈ ఓపెన్‌టాప్‌ బోట్‌ సాగర్‌ అలలపై పరుగులు పెడుతూ  పర్యాటకలకు  చక్కటి అనుభూతిని  అందించనుంది. 90 హార్స్‌పవర్‌ విద్యుత్‌ సామర్థ్యంతో నడిచే  ఇంజిన్‌లను ఈ బోట్‌కు అమర్చారు. దీంతో అది చాలా  వేగంగా  పరుగెడుతుందని  హుస్సేన్‌సాగర్‌ బోట్స్‌ యూనిట్‌ మేనేజర్‌ సంపత్‌  తెలిపారు. తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనోహర్‌రావు ప్రత్యేక శ్రద్ధ, చొరవతో ఈ  అత్యాధునిక బోటింగ్‌ సదుపాయాలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. 2 డీలక్స్‌ ఫ్యామిలీ బోట్లు, క్యాటమెరిన్‌ పాంటమ్‌ బోట్‌లతో పాటు, కొత్తగా 150 మంది ప్రయాణించే సదుపాయం ఉన్న ఫ్లోటింగ్‌ జెట్టీలు కూడా  సాగర్‌లో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. 

రద్దీకి అనుగుణంగా బోట్‌లు...
ప్రస్తుతం హుస్సేన్‌సాగర్‌లో ఒకేసారి  60 మందితో ప్రయాణించ గలిగే గౌతమి, లుంబిని, కోహినూర్,తదితర బోట్‌లతో పాటు 100 మందిని తీసుకు వెళ్లే భగీరథ, భాగమతి క్రూయిజ్‌ బోట్లు ఉన్నాయి. మరో  6 స్పీడ్‌ బోట్లు సైతం  పరుగులు తీస్తున్నాయి. కొత్తగా  ప్రారంభం కానున్న డీలక్స్‌ ఫ్యామిలీ  బోట్లతో స్పీడ్‌ బోట్‌ల సంఖ్య  పెరగనుంది. చుట్టూ  అద్దాలతో, పసుపు, తెలుపు రంగుల్లో ఎంతో ఆకర్షణీయంగా రూపొందించిన డీలక్స్‌ బోట్లు  పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి. నగరానికి వచ్చే సందర్శకులు బుద్ధ విగ్రహాన్ని సందర్శించేందుకు  ఎక్కువ ఆసక్తి  చూపుతున్నారు. దీంతో తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. 

పర్యాటకుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు...
ప్రతి రోజు సగటున  5000  మంది పర్యాటకులు  లుంబిని పార్కును సందర్శించి బోట్‌ షికారుకెళ్తున్నారు. శని, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో  ఈ సంఖ్య 8,000 నుంచి 10,000 వరకు ఉంటుంది.గత ఏడాది మే చివరి నాటికి 1.67 లక్షల మంది బుద్ధ విగ్రహాన్ని సందర్శించగా,  ఈ ఏడాది  ఇప్పటి వరకు 1.53 లక్షల మంది సందర్శించుకున్నారు. గతేడాది రూ.97.64 లక్షల ఆదాయం లభించింది. ఈ ఏడాది రూ.93.49 లక్షలు లభించింది. గతేడాదితో పోల్చితే పర్యాటకుల సంఖ్య స్వల్పంగా  తగ్గింది. మరోవైపు  పర్యాటకుల భద్రతకు  ప్రత్యేక చర్యలు చేపట్టారు. సుమారు 600 లైఫ్‌జాకెట్‌లను అందుబాటులో ఉంచారు. 10 మంది గజఈతగాళ్లు  ప్రతి క్షణం విధి నిర్వహణలో ఉంటారు. ఎలాంటి విపత్కరపరిస్థితినైనా సమర్ధంగా ఎదుర్కొనేందుకు తమ బృందం సిద్ధంగా ఉంటుందని యూనిట్‌ మేనేజర్‌ సంపత్‌ ధీమాను వ్యక్తం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement