ఎటు చూసినా ప్రకృతి రమణీయతే. కొండా కోనల మధ్యఎగిసిపడే నీటి పరవళ్లు. మనసుకు హాయిగొలిపే సుందర దృశ్యాలు. కనుచూపు మేర చక్కదనాల పచ్చదనాలు. లయల హొయలొలుకుతూ జాలువారే జలపాతాలు. గుట్టలపై నుంచి దూకుతూ సవ్వడి చేసి నీటి సరిగమల సరాగాలు. తనివితీరా జలకాలాడి అపురూప జ్ఞాపకాలను మదిలో దాచుకోవాల్సిందే. ప్రకృతి ప్రేమికులు ఆనంద పారవశ్యంలో ఓలలాడాల్సిందే. ఇదిగో అలాంటి జలపాతాలు పర్యాటకులను ఊరిస్తున్నాయి. రా.. రమ్మంటూ స్వాగతం పలుకుతున్నాయి.
సాక్షి, సిటీబ్యూరో : తెలంగాణలోని జయశంకర్ భూపాల్‌పల్లి, పూర్వ ఆదిలాబాద్ జిల్లాలు జలపాతాలకు వేదికగా నిలుస్తున్నాయి. జయశంకర్‌భూపాల్‌పల్లి జిల్లా ఏటూరునాగారం సమీపంలోని కొండ కోనల్లో బొగత జలపాతం పాలధారలను తలపిస్తూ ఎగసిపడుతోంది. పర్యాటకులకు కనువిందు చేస్తోంది. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, పొచ్చెర జలపాతాలు పర్యాటకులతో సందడిగా మారాయి. హైదరాబాద్ నగర పర్యాటకుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. ఆ వివరాలు ఇవీ..
బొగత.. వెళదాం ఇలా..
♦ పర్యాటకుల డిమాండ్‌ను బట్టి హైదరాబాద్ నుంచి బొగత జలపాతానికి టీఎస్‌టీడీసీ ప్యాకేజీలు ప్రకటించింది. శుక్ర, శని, ఆదివారాల్లో వీలైనన్ని బస్సులు నడుపుతోంది.
♦ చార్జి: పర్యాటకులు టోల్, పార్కింగ్, ఎంట్రీ రుసుముతో కలిపి ఏసీ బస్సుకు ఒక్కొక్కరు రూ. 1500, నాన్ ఏసీ బస్సుకు రూ. 1400 చెల్లించాలి. ఆహారం ఖర్చులు అదనం.
♦ ఉదయం 7 గంటలకు బషీర్‌బాగ్ టూరిజం కార్యాలయం చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సు బయలుదేరుతుంది. 7.30కు సికింద్రాబాద్‌లోని యాత్రీ నివాస్‌కు చేరుకొంటుంది. అక్కడి నుంచి లక్నవరం చేరుకుంటారు. అక్కడ భోజనం చేసి, బొగత జలపాతాన్ని తిలకించిన తర్వాత హన్మకొండలోని టూరిజం హరిత హోటల్‌లో డిన్నర్ ముగించుకొని తిరిగి హైదరాబాద్ బయలు దేరుతారు.
కుంటాల, పొచ్చెరకు ఇలా..
ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన జలపాతాలైన కుంటాల, పొచ్చెర జలపాతాలకు కూడా ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు. ఉదయం 7 గంటలకు బషీర్‌బాగ్‌లోని టూరిజం కార్యాలయం నుంచి బస్సు బయలుదేరుతుంది. 7.30కి సికింద్రాబాద్ యాత్రీ నివాస్‌కు చేరుకొంటుంది. అక్కడ నుంచి నేరుగా కుంటాల, పొచ్చెర జలపాతాలకు తీసుకెళ్తారు. అక్కడి జలపాతాలను పర్యాటకులు చూసిన తర్వాత తిరిగి బయలుదేరి హైదరాబాద్‌కు రాత్రి 10 గంటలకు చేరుకొంటారు.
చార్జీలు: టోల్, పార్కింగ్, ఎంట్రీ రుసుముతో కలిపి ఒక్కొక్కరికి ఏసీ బస్సుకు రూ.1500, నాన్‌ఏసీ బస్సుకు రూ.1400 చెల్లించాలి. భోజన ఖర్చులు అదనం.
ఇదే మంచి తరుణం..
జలపాతాల అద్భుత దృశ్యాలను చూసే అనువైన సమయం. జలపాతాలను చూసేందుకు గైడ్ సదుపాయం ఉంది. ఈ యాత్ర గొప్ప పర్యాటకులకు గొప్ప జ్ఞాపకంగా మిగులుతుంది. గ్రేటర్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – బి.మనోహర్, టీఎస్‌టీడీసీ ఎండీ
రిజర్వేషన్ల కోసం... బషీర్‌బాగ్ కార్యాలయం
(040– 29801039,40), 9848540371, ట్యాంక్‌బండ్ కార్యాలయం
( 040– 2350165), 9848125720,
యాత్రీ నివాస్ 040– 27893100, 9848126947,
కూకట్‌పల్లి 040–23052028, 984854037, టోల్ ఫ్రీ: 1800 42546464లోసంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment