బోగస్‌ ఓట్లకు..చెక్‌! | Bogus Voters Check In Nalgonda | Sakshi
Sakshi News home page

బోగస్‌ ఓట్లకు..చెక్‌!

Published Tue, Oct 23 2018 9:05 AM | Last Updated on Tue, Oct 23 2018 9:05 AM

Bogus Voters Check In Nalgonda - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : బోగస్‌ ఓట్లకు చెక్‌ పడింది. ఒకే వ్యక్తి అటు పట్టణ ప్రాంతంలో.. ఇటు సొంత గ్రామాల్లో రెండేసి చొప్పున ఓట్లు వేసే పద్ధతికి కాలం చెల్లింది. గడిచిన నాలుగున్నరేళ్లుగా ఓటర్‌ రివిజన్‌ జరుగుతున్నా.. ఎప్పటికప్పుడు కొత్త ఓటర్లు నమోదు అవుతున్నా జిల్లాలో మొత్తం ఓట్ల సంఖ్యలో ఒక్క ఓటు కూడా పెరగలేదు. గత సార్వత్రిక ఎన్నికల (2014) నాటి గణాంకాలను, ప్రస్తుతం ప్రకటించిన ఓట్ల లెక్కలను పరిశీలించి చూస్తే మొత్తంగా 406 ఓట్ల తగ్గుదల కనిపిస్తోంది.

కేవలం మునుగోడు, నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే ఓటర్ల సంఖ్య కొద్దిగా పెరిగింది. ఇక, మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో ఓట్ల సంఖ్య తగ్గిపోయింది. ఈ నెల 13వ తేదీన ఎన్నికల అధికారులు ప్రకటించిన గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో ప్రస్తుతం 12,72,340 మంది ఓటర్లు ఉన్నారు. మరో 328మంది సర్వీసు ఓటర్లను కలిపితే మొత్తం ఆ సంఖ్య 12,72,668. కాగా, గత 2014 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో మొత్తం ఓట్లు 12,73,074.  ఇక, గణాంకాల మేరకు గతంతో పోలిస్తే నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో 825, మునుగోడు నియోజకవర్గంలో 11,785 ఓట్ల చొప్పున పెరిగాయి.

ఫలించిన సాంకేతిక మంత్రం
అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకున్న ఎన్నికల సంఘం బోగస్‌ ఓట్లను గణనీయంగా తగ్గించగలిగిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక వ్యక్తికి ఒక్క ఓటే లక్ష్యం నెరవేరినట్లే కనిపిస్తోందని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. జిల్లా ఓట్ల నమోదు, రివిజన్‌కు సంబంధించి ఏడాది కాలంగా సాగిన కృషి సత్ఫలితాలు ఇచ్చిందని ఓ అధికారి పేర్కొన్నారు. బూత్‌స్థాయి అధికారులను నియమించుకుని, ఇంటింటికీ తిరిగి ఓటర్ల జాబితాలను సరిదిద్దారు. సమగ్ర ఇంటింటి సర్వే (ఐఆర్‌ఈఆర్‌)తో ఎన్నికల సిబ్బంది సంబంధిత ఇంటిని సందర్శించినప్పుడు ఉన్న వారి ఓట్లను మాత్రమే మాత్రమే పరిగణనలోకి తీసుకుని జాబితాలు దిద్దారు.

ఓటర్ల ఆధార్‌ కార్డుల సీడింగ్‌ కూడా బోగస్‌ ఓట్లను, రెండు రెండు ఓట్లను (డూప్లికేషన్‌) అరికట్టడంలో కీలకపాత్ర పోషించింది. దీంతోపాటు ఎన్నికల సంఘం ఆన్‌లైన్‌లో ఓట్లు నమోదు చేసుకోవడానికి తీసుకువచ్చిన ఈఆర్‌ఓ నెట్‌ వల్ల ఒకే వ్యక్తి పేరున రెండో ఓటు అన్న ముచ్చటే లేకుండా పోయింది. ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడంతో అన్ని నియోజకర్గాల్లో ఓటర్ల సంఖ్య తగ్గిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్క నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే 2014 ఎన్నికల నాటి ఓట్లర్ల సంఖ్యకు, ఇప్పటికి ఏకంగా 10,053 ఓట్లు తగ్గిపోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement