తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 నెలలైనా ఖరారు చేయని ప్రభుత్వం
హైదరాబాద్: రాష్ట్రం లో వచ్చే విద్యా సంవత్సరంలో (2015-16) విద్యార్థులకు ఇవ్వనున్న పాఠ్య పుస్తకాల్లో రాష్ట్ర గేయం ఉండే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు రాష్ట్ర గేయాన్ని ఖరారు చేయకపోవడమే ఇందుకు కారణం. రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే 61 లక్షలమంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు 2.5 కోట్ల పుస్తకాలు అవసరం. ఇందులో తెలుగు పాఠ్య పుస్తకాలు 61 లక్షలు ఉంటాయి. విద్యాశాఖ రాష్ట్ర గేయం లేకుండానే పుస్తకాల ముద్రణకు ఏర్పాట్లు చేసింది.
‘మా తెలుగుతల్లికి’ తొలగింపు
ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు పాఠ్య పుస్తకాల్లో జాతీయ గీతంతోపాటు రాష్ట్ర గేయంగా పెట్టిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ..’ గేయాన్ని తెలుగు పాఠ్య పుస్తకాల నుంచి తొలగించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర గేయం వివిధ గేయాలను పరిశీలించారు. అంద్శైరాసిన ‘జయజయహే తెలంగాణ జననీ జనకేతనం..’ గేయాన్ని రాష్ట్ర గేయంగా చేస్తే బాగుంటుందని భావించారు. సీఎం కేసీఆర్ కూడా ఆ గేయానికి కొన్ని మార్పులు చేస్తున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం నుంచి వెలువడలేదు.
విద్యాశాఖ రాష్ట్ర గేయం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. సీఎం పరిశీలనలోనే ఉందన్న సమాధానం రావడంతో మిన్నకుండిపోయారు. పుస్తకాల ముద్రణ ప్రారంభించాల్సి రావడంతో ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గేయాన్ని తొలగించి ముద్రణ ప్రారంభించినట్లు తెలిసింది.
రాష్ట్ర గేయం లేకుండానే పాఠ్య పుస్తకాల ముద్రణ!
Published Sat, May 9 2015 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM
Advertisement
Advertisement