ఖానాపూర్ : తెలంగాణ రాష్ట్ర గీతం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆలపించేలా ప్రభుత్వం, విద్యాశాఖ ఆదేశించినా మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో గీతాలపనను ఉపాధ్యాయులు విస్మరించారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం స్థానిక జెడ్పీఎస్‌ఎస్‌లో మండలంలోని ఉపాధ్యాయులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వెల్లడైంది. గతంలో ఉన్న ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ అనే గీతానికి బదులు ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ఆలపించాలని సంబంధిత అధికారులు ఉపాధ్యాయులకు ఆదేశాలు అందాయి. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఎనిమిది నెలలు కావస్తున్నా ఆయా పాఠశాలల్లో విద్యార్థులు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న గీతాన్నే ఆలపిస్తున్నారని సమావేశంలో మానిటరింగ్ కమిటీ సభ్యులు వెల్లడించారు.
తగ్గుతున్న విద్యాప్రమాణాలు..
ఆయా పాఠశాలల్లో విద్యార్థులు కనీస స్థాయిలో కూడా లేరని మానిటరింగ్ కమిటీ సభ్యులు వివరించారు. ఓ పాఠశాలల్లో 22 మంది విద్యార్థులకు గాను 8 మంది మాత్రమే హాజరయ్యారని, ఆ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక అటెండర్, మధ్యాహ్న భోజన కార్మికురాలు, వారిపై ఎప్పటికప్పుడు ఉన్నత, మండలస్థాయి అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుందని వివరించారు. పలుచోట్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ కొరవడిందని వివరించారు. టీఎల్‌ఎంలు ఉపయోగించడం లేదని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకటరమణరెడ్డి, సీపీపీలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, టీం సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
32 అంశాలపై అధ్యయనం
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 32 అంశాలపై మానిటరింగ్ చేయాలని గత నెల 29 నుంచి 31వరకు 12 వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులతో కూడిన 12 బృందాలు వెళ్లాయి. వీరు ప్రధానంగా ఉదయం ప్రార్థన సమయానికి హాజరవుతారు. ముందుగా జాతీయ గీతం, రాష్ట్ర గీతం, ప్రతిజ్ఞ, సూక్తి, వార్తలు, నేటి వార్త, ప్రధానోపాధ్యాయుడి సందేశం వరకు గమనించాల్సి ఉంటుంది. పాఠశాలలో విద్యార్థుల స్థాయి, మౌలిక సౌకర్యాలు, యూనిఫాంల పంపిణీ ఫాంల పంపిణీ, గత, ఈ , ఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగిందా తగ్గిందా, విద్యాబోధన, పాత పద్ధతా లేక కొత్త పద్ధతా పరిశీలించడం, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ విధానం, ప్రగతి, పరీక్షల నిర్వహణ, ఎస్‌ఎంసీ సమావేశాల నిర్వహణ తదితర 32 అంశాలపై కూలంకశంగా మూడు రోజులు పరిశీలించాల్సి ఉంటుంది.
రాష్ట్ర గీతం మరిచిన ఉపాధ్యాయులు
Published Tue, Feb 3 2015 9:42 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM
Advertisement