
జిల్లా అధ్యక్షుడి బాధ్యతల నుంచి ఇరువురి తొలగింపు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం రమేశ్‌ను జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు.
వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం రమేశ్‌ను జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. ఆ మేరకు వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 22న హైదరాబాద్‌లో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ సమావేశాలకు సంబంధించి ముందస్తు సమాచారం ఇచ్చినా వారు హాజరుకాక పోవడంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీవ్ రెడ్డి, నీలం రమేశ్‌లు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గ సభ్యులుగా మాత్రమే కొనసాగనున్నారు. అలాగే ప్లీనరీకి హాజరుకాని మరో ఇద్దరు జిల్లా పార్టీ అధ్యక్షులను శ్రీకాంత్‌రెడ్డి వివరణ కోరారు.
అసెంబ్లీ స్థానాలకు కోఆర్డినేటర్ల నియామకం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి రాష్ట్రంలోని మూడు అసెంబ్లీ నియోజక వర్గాలకు కో–ఆర్డీనేటర్లను నియమించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎల్‌బీనగర్ నియోజకవర్గానికి బండారు వెంకటరమణ, అచ్చంపేట్ నియోజక వర్గానికి బీష్వ రవీందర్‌ని నియమించినట్లు ఆయన తెలిపారు.