
మృతదేహాన్ని చేతులతో మోసుకుంటూ పోలీస్ స్టేషన్ వద్దకు వస్తున్న బంధుమిత్రులు
సాక్షి, శ్వారావుపేట: తనపై పోలీసులు కేసు నమోదు చేశారేమోననే భయానికి గురయిన ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన అశ్వారావుపేట గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసు సిబ్బంది ధనదాహానికి తమ బిడ్డ బలయ్యాడని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించారు. కానిస్టేబుళ్లు అడిగిన లంచం ఇచ్చామని, అయినా కొట్టారని, ఆ దెబ్బలకు, కేసుకు భయపడి బాలుడి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు ఆరోపించారు. కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శింగారెడ్డి కల్యాణ్‌కుమార్(17) తన సమీప బంధువులు, మిత్రులతో కలిసి ఆదివారం అర్ధరాత్రి జంగారెడ్డిగూడెం రోడ్‌లోని స్టేట్‌బ్యాంక్ ఏటీఎంకు వెళ్లారు. నగదు విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించగా నగదు రాకపోవడంతో మిషన్‌ను వీరిలో ఒకరు కాలితో తన్నగా మిషన్ పాక్షికంగా ధ్వంసమయింది.
తెల్లారి సోమవారం ఈ విషయం ఏటీఎంకు వెళ్లిన వినియోగదారుల ద్వారా బయటకు పొక్కింది. అంతకుముందు రోజు గుర్రాల చెరువు రోడ్‌లోని ఆంధ్రాబ్యాంకు ఏటీఎంపై కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఈ వరుస సంఘటనలు అశ్వారావుపేటలో సంచలనం సృష్టించాయి. స్టేట్‌బ్యాంకు ఏటీఎంలో చోరీకి యత్నం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో మిషన్‌ను కాలితో తన్నిన అశోక్ అనే యువకుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఐ ఎం అబ్బయ్య వద్ద అంగీకరించాడు. కానీ ఫిర్యాదు, సీసీ ఫుటేజీ లేనందున కేసు నమోదు కాలేదు. అంతటితో సమస్య ముగిసిపోయిందనకున్నారు.
బెయిల్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పడంతో..
యువకుల తల్లిదండ్రులు మంగళవారం రాత్రి వరకు బ్యాంకు సిబ్బంది కాళ్లా వేళ్లా పడి బతిమిలాడి కేసు పెట్టొద్దని కోరారు. ఏటీఎంకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు. కాగా ఏటీఎంకు వెళ్లిన నలుగురిలో అశోక్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి మిగిలిన ముగ్గురు యువకులను సాక్షులుగా పేర్కొన్నారు. కానీ బుధవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అశోక్‌తోపాటు మిగిలిన ముగ్గురికీ బెయిల్‌కు ఏర్పాటు చేసుకోవాలని కానిస్టేబుళ్లు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
ఈ క్రమంలో బెయిల్ ఏర్పాట్ల కోసం ఓ న్యాయవాది ఇంటికి కల్యాణ్, అతని బంధువులు వెళ్లారు. సదరు న్యాయవాది పోలీస్ స్టేషన్‌కు ఫోన్‌చేసి మాట్లాడుతుండగా ఏడేళ్లు శిక్ష అనే పదం ఫోన్ సంభాషణలో వచ్చింది. ఆ మాట వినగానే కల్యాణ్ ఒంటరిగా ఇంటికి వచ్చాడు. న్యాయవాదితో మాట్లాడి కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చేసరికి కల్యాణ్ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు ఉరి విప్పి అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. కాగా మృతుడు తమ కుటుంబానికి చెందిన టిఫిన్ సెంటర్‌లోనే పనిచేస్తుంటాడు.
మృతదేహంతో ఠాణాకు..
ప్రభుత్వాసుపత్రి వద్ద విచారణకు వచ్చిన సీఐ ఎం అబ్బయ్యను మృతుడి బంధువులు నిలదీశారు. కల్యాణ్‌ను సాక్షిగా పేర్కొంటే ముద్దాయిలాగా రెండ్రోజులపాటు ఠాణా చుట్టూ ఎందుకు తిప్పారని, నలుగురు కానిస్టేబుళ్లు డబ్బులు ఎందుకు వసూలు చేశారని ప్రశ్నించారు. ధనార్జనకు పసివాడిని బెదిరించడంతోపాటు శారీరకంగా, మానసికంగా గాయపరిచారని.. తీవ్ర ఒత్తిడికి లోనయి.. జైలు శిక్ష పడుతుందనే భయంతో కల్యాణ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. బంధువులు, మిత్రులు తీవ్ర ఆగ్రహానికి గురై మృతదేహాన్ని చేతులమీద మోసుకుంటూ జాతీయ రహదారిపై కిలోమీటర్ మేర శవయాత్ర నిర్వహించి ఠాణాకు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా రహదారిపై మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు.
సీఐ అబ్బయ్య నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆందోళనకారులు శాంతించలేదు. జనం గుమిగూడటం, పోలీసులు చెదరగొట్టడం ఇలా నాలుగు గంటలపాటు సాగిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కల్యాణ్ మృతికి కారణమైన నలుగురు కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆందోళనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. భద్రాచలం, రాజమండ్రి, ఏలూరు, ఖమ్మం మార్గాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
డీఎస్పీ ప్రవేశంతో..
ఆందోళన వద్దకు చేరుకున్న పాల్వంచ డీఎస్పీ మధుసూదనరావు లాఠీ చేబూని ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు. ఆందోళనను బలవంతంగా విరమింపజేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతదేహాన్ని తరలించేందుకు తెచ్చిన ప్రైవేటు అంబులెన్స్ స్టార్ట్ కాకపోవడంతో ఫర్లాంగు దూరం పోలీసులు నెట్టుకెళ్లారు. ఆ తర్వాత అంబులెన్స్ తాళం ఎవరో దొంగిలించారని డ్రైవర్ చెప్పడంతో ఆటోలో పోస్టుమార్టానికి తరలించారు. తొలుత డీఎస్పీ రెండు గంటల పాటు పోలీస్‌స్టేషన్‌లో కూర్చుని పెద్దమనుషులతో చర్చలు జరిపినా సఫలం కాలేదు. చివరకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి ఆందోళనకారులను పంపేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment