భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరంలో రాజకీయ ఒడిదొడుకులు
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామ నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు శుక్రవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అంతరాలయంలో మూలమూర్తులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. శ్రీదుర్ముఖి నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని బేడా మండపంలో వేపపూత ప్రసాదాన్ని భక్తులకు అందించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భద్రాద్రి దేవస్థానం ఆస్థాన పురోహితులు చెన్నావజ్జుల వెంకటేశ్వర అవధాని పంచాంగ శ్రవణం వినిపించారు. శ్రీదుర్ముఖి నామ సంవత్సరంలో రాజకీయంగా ఒడిదొడుకులు ఉంటాయని ఆయన చెప్పారు. రామయ్యకు ఈ ఏడాది ఆదాయం కంటే వ్యయం అధిక మని పంచాంగం చెబుతుందని పేర్కొన్నారు.
రామయ్య ఆదాయం కంటే వ్యయం ఎక్కువ
ఈ ఏడాది రామయ్యకు ఆదాయం 8, వ్యయం 11 ఉం టుందని చెప్పారు. సీతమ్మ వారికి ఆదాయం 14 కాగా.. వ్యయం 11 ఉంటుందన్నారు. అలాగే కొన్ని చెడు సంకేతాలు ఉన్నాయని.. పంటలు పండకపోవటం, కరువు కాటకాలు సంభవించటం జరుగుతుందన్నారు. ప్రజల్లో దైవ చింతన పెరగటం వల్ల ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చన్నారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో శుక్రవారం నుంచి ఈనెల 21వ తేదీ వరకు స్వామివారి నిత్య కల్యాణాలు నిలిపివేశారు.