ఏఎన్‌ఎల్ సర్వీసు కేంద్రం మూసి ఉన్న దృశ్యం
మంచిర్యాలఅర్బన్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) బస్సుల్లో సరుకుల రవాణాకు బ్రేక్ పడింది. జిల్లాలోని ఆయా బస్‌స్టేషన్లలో నిర్వహించే ఏఎన్‌ఎల్ సర్వీసు కేంద్రాలకు తాళం పడింది. ఆర్టీసీ బస్సుల్లో ఏఎన్‌ఎల్ పార్సిల్స్‌ను అనుమతించరాదంటూ డ్రైవర్లు, కండక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించి సరుకులు రవాణా, ఇతరత్రా పార్సిల్స్ తీసుకువచ్చిన డ్రైవర్లపై కొరడా ఝళిపించారు.
నాలుగు రోజుల క్రితం ప్రత్యేక తనిఖీ బృందానికి పట్టుబడడంతో మంచిర్యాల డిపోకు చెందిన కండక్టర్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. దీంతో బస్సుల్లో పార్సిల్స్ తీసుకు రావాలంటే డ్రైవర్లు, కండక్టర్లు జంకుతున్నారు.
ఎప్పటి నుంచో రవాణా..
ఆర్టీసీ బస్సుల్లో సరకులు రవాణా చేసే విధానం గతం నుంచి అమల్లో ఉంది. అప్పట్లో ఏఎన్‌ఎల్ సంస్థ ద్వారా సరుకులను రవాణా చేసేవారు. దీని కోసం సంస్థ ఆర్టీసీకి లీజు కింద ఏడాదికి కొంత సొమ్ము చెల్లించేది. సరుకు రవాణా ఆదాయం మెరుగ్గా ఉన్నా ఏఎన్‌ఎల్ సంస్థ బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
ఆర్టీసీ బస్సుల ద్వారా చేరవేసే సరుకులు రవాణా నిలిపివేయడంతో ఏఎన్‌ఎల్ సంస్థ జూన్ 8 నుంచి కేంద్రాలను మూసివేసింది. అప్పటి నుంచి బస్సుల్లో సరుకులు తీసుకు రావద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
వ్యక్తిగత సరుకులకు మినహయింపు
బస్సుల్లో ప్రయాణికుడు తన వెంట సరుకులు తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. వారే స్వయంగా సరుకులు దింపడం చేస్తే అభ్యంతరం చెప్పడం లేదు. 25 కేజీల వరకు సరుకులను తీసుకెళ్లేందుకు మినహాయింపు ఇచ్చారు. ఆపై సరుకులను బరువును బట్టి ప్రయాణికుడితోపాటు లగేజీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవర్లు ప్రయాణికుడు లేకుండానే లగేజీ చార్జీలు చెల్లించి తీసుకు వస్తే మాత్రం చర్యలు చేపట్టింది.
మంచిర్యాల డిపోకు చెందిన కండక్టర్ జీఎం కుమార్ ప్రయాణికుడు లేకుండా సరుకులను బస్సులో తరలించాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక స్క్వాడ్ నిర్వహించిన తనిఖీల్లో సరుకులు తరలిస్తున్నట్లు తేలడంతో కండక్టర్‌ను సస్పెండ్ చేశారు. ఎవరైనా సరకులు, ఇతరత్రా పార్సిల్స్ తీసుకువెళ్లమంటే ‘మాకెందుకు తంటా’ అంటూ తప్పించుకోవాల్సి వస్తుందని ఓ డ్రైవర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆదాయానికి గండి
నిర్మల్, ఆదిలాబాద్, ఉట్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డిపోలతోపాటు చెన్నూర్, లక్షెట్టిపేట, జన్నారం, బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌లో ఏఎన్‌ఎల్ పార్సిల్ సెంటర్లు ఉన్నాయి. ప్రధానంగా సరుకులు చేరవేయటం ద్వారా ఆర్టీసీకి ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. పార్సిల్స్, సరుకులు చేరవేయడం ద్వారా బస్సుల్లో తక్కువ సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణించినా నష్టాన్ని కొంత మేర పూడ్చుకునే వీలుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 620 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి బస్సుల ద్వారా నిత్యం సరుకులు, పార్సిల్స్ చేరవేస్తుంటాయి. గత నెల 8 నుంచి సరుకుల రవాణా నిలిపివేయడం వల్ల పార్సిల్స్‌తో వచ్చే ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది.
నష్టాలను పూడ్చుకునేందుకేనా..?
నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని గట్టెక్కించడం కోసం యాజమాన్యం పలు విధానాలు అమలు చేస్తోంది. స్థలాల లీజు, వ్యాపార సముదాయాలను నిర్మించి అద్దెకు ఇవ్వడం వంటివి చేస్తున్నా ఆశించినా రీతిలో ఆదాయం రావడం లేదు. ఈ నేపథ్యంలోనే సరుకుల రవాణా ద్వారా ఆదాయం మెరుగ్గా విషయాన్ని అధ్యయనం చేసిన సంస్థ సొంతంగా నిర్వహించేందుకు ఏఎన్‌ఎల్ సంస్థను పక్కకు తప్పించినట్లు ప్రచారంలో ఉంది.
పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది నుంచి సరుకుల రవాణా ప్రక్రియను కార్గో పేరుతో ఆర్టీసీ యాజమాన్యమే పూర్తిస్థాయిలో నిర్వహిస్తోంది. అక్కడ సంస్థకు వచ్చిన లాభాలను బేరీజు వేసుకుని ఇక్కడ కూడా సరకు రవాణా, కొరియర్ సేవలను సొంతంగా నిర్వహించాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తున్నట్లు ఓ అధికారి చెప్పుకొచ్చారు.
సరుకులు తరలించరాదు
బస్సుల్లో సరుకులు తీసుకురావడం చట్ట వ్యతిరేకం. తెలంగాణ వ్యాప్తంగా ఏఎన్‌ఎల్ పార్సిల్స్ తీసుకురావద్దని ఆదేశాలున్నాయి. అందుకే ఆర్టీసీ సంస్థ బస్సుల్లో ఏఎన్‌ఎల్ పార్సిల్స్ అనుమంతించబోమంటూ ముందస్తుగా కండక్టర్లు, డ్రైవర్లకు తెలియజేశాం. అయినప్పటికీ బస్సుల్లో సరుకులు తీసుకువస్తూ డిపోకు చెందిన కండక్టర్ ప్రత్యేక తనిఖీ బృందానికి పట్టుబడడంతో సస్పెండ్ చేశారు. – మల్లికార్జున్‌రెడ్డి, మంచిర్యాల డీఎం
Comments
Please login to add a commentAdd a comment