
సాక్షి, దండేపల్లి : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లి స్టేజ్ వద్ద టీఎస్ ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ నుండి ఉట్నూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు- ఇసుక లోడ్‌తో కరీంనగర్ వైపు వెళుతున్న టిప్పర్ ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్నవారిలో ఎనిమిదిమంది గాయపడ్డారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో జేసీబీ సాయంతో అతన్ని బయట తీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. మరోవైపు సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు.