మృత్యువులోనూ వీడని బంధం
♦ రోడ్డుప్రమాదంలో అక్కాతమ్ముడు మృతి
♦ ఉద్యోగంలో చేరకముందే అనంతలోకాలకు..
♦ కుటుంబంలో అలుముకున్న విషాద చాయలు
♦ దొన్కల్‌లో నేడు అంత్యక్రియలు
జక్రాన్‌పల్లి/మోర్తాడ్ : ఇంజనీరింగ్ పూర్తయింది.. క్యాంపస్ ఇంటర్వ్యూలో సక్సెస్ అయింది.. ఉద్యోగం రావడానికి మరికొన్ని రోజుల సమయం ఉంది.. ఈ లోగా కుటుంబసభ్యులతో హాయిగా గడుపుదామనుకుంది. ఇదే విషయూన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ఆనంధానికి అవధుల్లేవు.
హైదరాబాద్‌లో ఉన్న కూతురును తీసుకొచ్చేందుకు బంధువులతో మాట్లాడి కారు ఏర్పాటుచేశారు. అయితే వచ్చేప్పుడు అక్కకు తోడుగా ఉంటాడని తమ కుమారుడిని కూడా పం పించారు. కానీ.. అవే తమ పిల్లలకు చివరి క్షణాలను వారు ఊహించలేకపోయూరు. తిరుగు ప్రయూణంలో జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్ వద్ద జరిగిన ప్రమాదం ఆ తల్లిదండ్రుల జీవితంలో అత్యంత విషాదాన్ని నింపింది.
వివరాలిలా ఉన్నాయి.. మో ర్తాడ్ మండలం దొన్కల్ గ్రామానికి చెందిన తీగెల రాజేందర్, అంజమ్మలకు కూతురు సుశ్మిత(22), కుమారుడు శరత్‌చంద్రారెడ్డి(19) ఉన్నారు. సుశ్మిత హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసింది. ఇటీవలే క్యాం పస్ ఇంటర్వ్యూలో సెలక్ట్ అయింది. అయితే ఉద్యోగంలో చేరేందుకు కొంత గడువు ఉండడంతో ఈలో గా ఇంటికి వస్తానని కబురు చేసింది. దీంతో ఉత్సాహం పట్టలేని తల్లిదండ్రులు కూతురును తీసుకొచ్చేందుకు బంధువుల కారును ఏర్పాటుచేశారు. వచ్చేప్పుడు తోడు ఉండేందుకు తమ కుమారుడు శరత్‌ను కూడా పంపించారు. తమ్ముడిని చూడగానే సంతోషించిన సుశ్మిత ఇంటికి వచ్చేందుకు ఉత్సాహంగా కారులో బయలుదేరింది.
ఈ క్రమంలో కారు సికింద్రాపూర్ వద్దకు రాగానే కుక్క అడ్డురావడంతో దాన్ని తప్పించబోయి కల్వర్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శరత్‌చంద్రారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన సుశ్మిత హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కారు డ్రైవర్ సురేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
గంటలో ఇంటికి వస్తారనగా...
మరో గంటలో కూతురు, కొడుకు ఇంటికి చేరుకుంటారని భావించిన తల్లిదండ్రులకు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రమాదవార్త తెలియగానే వారినోట మాట రాలేదు. ఎంతో కష్టపడి పంటలు పండించి.. ఇద్దరు పిల్లలను ఇంజనీరింగ్ చదివించారు. ఇక తమ కష్టాలు తీరినట్టేనని భావిస్తున్న తరుణంలో వారి జీవితంలో ఈ ఘోరం జరిగింది. వారు విలపిస్తున్న తీరు చూసి, గ్రామస్తులంతా కన్నీరుమున్నీరయ్యారు. ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు మృతిచెందడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. సుశ్మిత మృతదేహం హైదరాబాద్ నుంచి రావాల్సి ఉన్నందున శరత్‌కు కూడా అంత్యక్రియలు నిర్వహించలేదు. ఆదివారం ఇరువురి మృతదేహాలకు ఒకేసారి దహన సంస్కారాలు చేయనున్నారు.