
కిరాతకం
గోదావరిఖని : గోదావరిఖని జీఎం కాలనీలోని టీ2-286 క్వార్టర్‌లో నివాసముండే చింతల సమ్మిరెడ్డి సింగరేణి సంస్థ రామగుండం రీజియన్ పరిధిలోని జీడీకే-2వ గనిలో మైనింగ్ సర్దార్‌గా పనిచేస్తున్నాడు.
‘నలుగురు కలిసి ఓ వ్యక్తిని కదలనీయకుండా కాళ్లూ చేతులు పట్టుకొని బంధిస్తారు.. మరో వ్యక్తి పదునైన కత్తితో మెడపై కసిగా కోసి కొసప్రాణం విడిచే పరిస్థితిని చెవిదగ్గరి నుంచి వింటాడు.. చచ్చారని తెలిశాక అక్కడి నుంచి ఆనందంగా వెళ్లిపోతారు..’ ఇది దండుపాళ్యం సినిమాలో సన్నివేశాలు. చదివితేనే ఒళ్లు గగుర్పొడుస్తున్న ఈ సన్నివేశం... అచ్చంగా గోదావరిఖనిలో శనివారం జరిగింది. సినిమాను తలపించేలా పట్టపగలే ఓ మహిళ కళ్లల్లో కారం చల్లి, చేతులు, కాళ్లు కట్టేసి... గొంతు కోసి మరీ కిరాతకంగా హత్య చేశారు దుండగులు. సంచలనం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించి మృతురాలి భర్త చింతల సమ్మిరెడ్డి, వన్‌టౌన్ సీఐ సీహెచ్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం..
గోదావరిఖని :
గోదావరిఖని జీఎం కాలనీలోని టీ2-286 క్వార్టర్‌లో నివాసముండే చింతల సమ్మిరెడ్డి సింగరేణి సంస్థ రామగుండం రీజియన్ పరిధిలోని జీడీకే-2వ గనిలో మైనింగ్ సర్దార్‌గా పనిచేస్తున్నాడు. సమ్మిరెడ్డికి భార్య సులోచన (49)తోపాటు కుమారుడు సతీశ్‌రెడ్డి, కూతురు సరిత ఉన్నారు. కొడుకు, కూతురు వివాహాలు కావడంతో వారు వేరేగా ఉంటున్నారు. ఇంట్లో ప్రస్తుతం సమ్మిరెడ్డి దంపతులే ఉంటున్నారు. శనివారం ఉదయం విధులకు వెళ్లిన సమ్మిరెడ్డి... సాయంత్రం ఇంటికి రాగా... వంటింట్లో సులోచన రక్తపు మడుగులో శవమై కనిపించింది.
షాక్ తిన్న అతడు బిగ్గరగా అరవడంతో స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని ఏఎస్పీ ఫకీరప్ప, వన్‌టౌన్ సీఐ శ్రీధర్ పరిశీలించారు. కరీంనగర్ నుంచి డాగ్‌స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణులను రంగంలోకి దింపారు. మృతదేహం పక్కన కాల్చిపడేసిన సిగరెట్ పడి ఉంది. జాగిలాలు ఇంట్లోని బీరువా దగ్గరకు వెళ్లి అక్కడి నుంచి కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ వైపు పరుగులు తీశాయి. బీరువాలో వస్తువులు చిందరవందరగా ఉండడంతో బంగారం చోరీ జరిగినట్లు భావిస్తున్నారు.
పథకం ప్రకారమే హత్య?
ఇంట్లో సులోచన ఒక్కతే ఉంటుందని రెక్కీ నిర్వహించిన గుర్తు తెలియని వ్యక్తులు పథకం ప్రకారమే ఆమెను హత్యచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు పథకం ప్రకారమే ఇంటి వెనుక నుంచి వచ్చి డోర్ కొట్టినట్లు తెలుస్తోంది. సులోచన తలుపుతీయడంతోనే మూకుమ్మడిగా కళ్లల్లో కారం చల్లి బంధించి, వంట గదిలోకి తీసుకెళ్లి చాపపై పడుకోబెట్టి.. తమ వెంట తెచ్చుకున్న తెల్లని తాళ్లతో కాళ్లూ చేతులు కట్టేసినట్టు స్పష్టమవుతోంది.
ఆమెను అరవకుండా గొంతు నొక్కి కత్తితో మెడ కోసి దారుణంగా హత్యచేశారు. అనంతరం బీరువాలోని బంగారు ఆభరణాలు దోచుకున్నారు. తర్వాతఇంటి వెనకనుంచి వెళ్లే ముందు రక్తపు మరకలను నీళ్లతో కడుక్కొని వెళ్లినట్లు కుళాయి వద్ద బకెట్‌లో ఉన్న రక్తపు మరకలను బట్టి తెలుస్తోంది. పట్టపగలు మహిళను అతి దారుణంగా హత్య చేసిన సంఘటన కాలనీవాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది.
సంఘటన స్థలిని చూసేందుకు వందలాదిమంది తరలివచ్చారు. సమ్మిరెడ్డి డ్యూటీకి వెళ్లే సమయాన్ని చూసి తెలిసిన వారే ఈ హత్య చేసి ఉంటారా..? లేక ఇతర దుండగుల ముఠా పనా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. సులోచన సెల్‌ఫోన్ కనిపించడం లేదు.
గతంలోనూ... ఇలాగే...
గతంలో ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లో రెండు సంఘటనలు ఇలాగేజరిగాయి. ఒంటరిగా ఉన్న మహి ళలను అదునుగా చేసుకుని చంపి బంగారం ఎత్తుకెళ్లారు. 2011 జూన్ 23న ఎన్టీపీసీ ఉద్యోగి కొత్తపల్లి రాములు భార్య లక్ష్మి, 2012 జూలై 7న ఉద్యోగి గీట్ల జనార్దన్‌రెడ్డి భార్య జ్యోతిని కూడా ఒంటరిగా ఉన్నది చూసి బంధించి హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లిన ఘటనలున్నాయ.