పక్కనే ఉంటూ ప్రాణాలు తీశారు | Brutal murder of a woman | Sakshi
Sakshi News home page

పక్కనే ఉంటూ ప్రాణాలు తీశారు

Published Sun, Nov 30 2014 4:33 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

పక్కనే ఉంటూ ప్రాణాలు తీశారు

పక్కనే ఉంటూ ప్రాణాలు తీశారు

సిద్దిపేట పట్టణంలో ఇటీవల ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది. దుండగులు ఆ మహిళను నిజామాబాద్ జిల్లా కామారెడ్డి సమీపంలోని అడవిలో పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ సంఘటనకు సంబంధించి సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఓ జంటపై అనుమానం కలిగి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తాము చేసిన నేరాలన్నీ ఒక్కొక్కటికీ చెప్పారు. ఈ కే సుకు సంబంధించిన వివరాలను సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శనివారం సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు.

సిద్దిపేట మండలం నారాయణరావుపేటకు చెందిన మహ్మద్ అబ్దుల్ సలీం (43)కు  20 ఏళ్ల క్రితం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట గ్రామానికి చెందిన మహిళతో వివాహమైంది. వీరికి నలుగురు కుమారులు కాగా, అందరూ కలిసి పట్టణంలోని సుభాష్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే సలీంకు ఎనిమిదేళ్ల క్రితం మండలంలోని ఇర్కోడ్ గ్రామానికి చెందిన మల్లవ్వతో పరిచయం ఏర్పడడంతో అది కాస్త ప్రేమగా మారి మల్లవ్వను రెండో భార్యగా వివాహం చేసుకున్నాడు. డ్రైవర్‌గా పని చేస్తున్న సలీంకు ఇద్దరు భార్యలతో పాటు పిల్లలను పోషించడం కష్టమైంది.

ఈ విషయాన్ని రెండో భార్య మల్లవ్వతో చర్చించాడు. ఎలాగైనా సులభంగా డబ్బులు సంపాదించాలని అనుకున్నారు. సలీం ఒక  రోజు న్యూస్ పేపర్‌లో చదువుతుండగా, గుర్తు తెలియని మహిళను కొందరు వ్యక్తులు హత్య చేసి కాల్చి బూడిద చేసిన వార్త కనిపించింది. ఈ కథనానికి ప్రభావితుడైన సలీం, ఇదే మార్గంలో డబ్బు సంపాదించాలని భావించాడు. ఈమేరకు బంగారం ధరించి ఉన్న మహిళలను టార్గెట్‌గా ఎంచుకుని వారి ఒంటిపై ఉన్న ఆభరణాలను కాజేయాలని రెండోభార్య మల్లవ్వతో కలిసి పథకం పన్నాడు.

2008 జూలైలో తొలిహత్య
పట్టణంలోని సుభాష్‌నగర్‌లో ఉంటున్న సలీం, మల్లవ్వలు పొరుగింట్లో ఉంటున్న ఎర్రగుంట్ల రేణుక, తమ కుటుంబంలో ఉన్న గొడవలను మల్లవ్వకు చెప్పింది. అయితే ఎలాగైనా సరే రేణుక మెడలో ఉన్న బంగారం గొలుసును కాజేయాలని సలీం దంపతులు భావించారు. తమకు తెలిసిన వ్యక్తులను పురామాయించి నీ భర్తను చంపిస్తామని రేణుకను నమ్మించారు.

ఈ క్రమంలోనే రేణుక ఇంట్లో ఎవరూ లేని సమయంలో సలీం, మల్లవ్వలు ఆమెను ఓ బైక్‌పై ఎక్కించుకుని కరీంనగర్ జిల్లా పరిధిలో మల్లారం గుట్టల వద్ద తీసుకెళ్లారు. మల్లవ్వ, రేణుకలు మాట్లాడుతున్న సమయంలో సలీం తనతో పాటు తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో రేణుక తలపై బలంగా కొట్టి చంపేసి, ఆమె మెడలో ఉన్న బంగారం తీసుకున్నాడు. అనంతరం రేణుకపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. రేణుక వద్ద తీసుకున్న బంగారం అమ్మగా వచ్చిన డబ్బులతో సలీం ఆటో కొనుగోలు చేశాడు.

రెండో హత్య 2010 జూలైలో ఇలా..
అదే కాలనీకి చెందిన దేవమ్మ.. మల్లవ్వతో మాట్లాడేందుకు ఇంటికి రాగా, సలీం వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్‌తో దేవమ్మ తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం ఆమె మెడలోని పుస్తెల తాడు, చెవి కమ్మలు స్వాధీనం చేసుకుని అదే రోజు రాత్రి   సలీం తన ఆటోలో సిద్దిపేట మండలం ఇర్కోడ్ శివారులోకి తీసుకెళ్లి డీజిల్ పోసి దేవమ్మ మృతదేహాన్ని తగలబెట్టారు.

మూడో హత్య 2010 నవంబర్‌లో ఇలా..
సలీం భార్య మల్లవ్వకు బాగా తెలిసిన గుడిశెట్టి శోభ తరచూ ఇంటికి వస్తుండేది. ఈ క్రమంలో ఓ రోజు శోభ ఇంటికి రాగా, సలీం ఇంట్లో ఉన్న రోకలిబండతో శోభ తలపై కొట్టి హత్య చేసి, రెండు తులాల గొలుసు తీసుకుని మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో కట్టేశాడు. అర్ధరాత్రి సమయంలో కరీంనగర్ జిల్లా వేములవాడ దారిలో రోడ్డు పక్కన ఉన్న ఈత వనంలో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు.

నాలుగో హత్య 2011 మార్చిలో..
పట్టణంలో నసర్‌పురాలో ఉంటున్న రాజవ్వ మార్కెట్‌లో పని చేసేది. అక్కడ లభించిన కందులు, ఉలువలను ఇంటింటికీ తిరుగుతూ అమ్ముకునేది. ఈ క్రమంలో రాజవ్వ వద్ద సలీం మల్లవ్వ దంపతులు ఉలవలు కొనేవారు. అయితే ఓసారి ఉలువల పైసలు కొన్ని బాకీ పడ్డారు. రాజవ్వ ఉలువల పైసల కోసం ఓ రోజు వీరి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో సలీం ఆమెను టవల్‌తో గొంతు నులిమి చంపేశారు. ఆమె ఒంటిపై ఉన్న నగలు, డబ్బులు తీసుకున్నాడు. అనంతరం తన కుమారుడు నడుపుతున్న కారును తెచ్చి అర్ధరాత్రి కారులో మృతదేహాన్ని తీసుకుని నిజామాబాద్ జిల్లా కామారెడ్డి సమీపంలోని దగ్గరలో ఉన్న అడవిలో పెట్రోల్ పోసి నిప్పంటించారు.

ప్రాణాలు దక్కించుకున్న ఇంద్రమ్మ..
మార్చి నెలలోనే ఓ రోజు ఉదయం 5 గంటలకు ఇంద్రమ్మ మెదక్ రోడ్డుకు తన ఇంటి ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా సలీం రాడ్‌తో తలపై కొట్టాడు. మెడలో ఏం లేకపోవడంతో ఆమె చేతిలో ఉన్న సంచి  వెతకగా బంగారు గొలుసు లభించింది. దీంతో గొలుసును తీసుకున్న సలీం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంద్రమ్మకు తలకు బలమైన గాయంకావడంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించడంతో చికిత్స చేయగా ప్రాణాలు దక్కాయి.

ఐదో హత్య 2014 నవంబర్ 3న..
ఇర్కోడ్ గ్రామానికి చెందిన నాగభూషణం రెండో భార్య గౌరిశెట్టి పుష్ప సరస్వతి నగర్‌లో నివాసముంటోంది. ఈ క్రమంలో సలీం భార్య మల్లవ్వతో పుష్పకు స్నేహం ఏర్పడింది. పుష్ప తన తన ఇంట్లోని గొడవల గురించి మల్లవ్వ, సలీంలకు చెప్పేది. నీ భర్త నీ మాట వినేలా చేస్తామని పుష్పను సలీం, మల్లవ్వలు నమ్మించారు. ఓ రోజు ఇంటికి పిలిచి నీ బాధలు పోవాలంటే దీపానికి మొక్కాలని సూచించారు.

దీపానికి మొక్కుతున్న పుష్పను సలీం రాాడ్‌తో కొట్టి హత్య చేశారు. ఎప్పటిలాగే అర్ధరాత్రి మృతదేహాన్ని కారులో నిజమాబాద్ జిల్లా కామారెడ్డి సమీపంలోని అడవిలో పెట్రోల్ పోసి తగలబెట్టారు. పుష్ప మిస్సింగ్‌పై నాగభూషణం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పుష్పకు సన్నిహితులుగా ఉన్నవారిపై నిఘా పెట్టారు. ఆ రోజు పుష్ప సలీం ఇంటికి వెళ్లినట్లు స్థానికుల ద్వారా తెలుసున్న పోలీసులు తమదైన శైలిలో వారిని విచారించగా ఈ వరుస హత్యల బాగోతం బయటపడిందని డీఎస్పీ వెల్లడించారు.

బంగారం.. వాహనాలు స్వాధీనం..
సలీం మల్లవ్వ దంపతులు వరుసుగా ఐదు హత్యలు, ఓ దోపిడీ చేశారు. వీరి వద్ద నుంచి 13.50 తులాల బంగారం, 12 తులాల వెండి నగలతో పాటు హత్యలకు ఉపయోగించిన రాడ్, రోకలి బండ, ఓ బైక్, ఓ కారు, ఓ ఆటోను సీజ్ చేశారు. నిందితులను కోర్టుకు తరలించారు.
 
సిబ్బందికి అభినందన.. రివార్డులు..
వరుస హత్యల మిస్టరీని ఛేదించిన వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐ సత్యనారాయణలతో పాటు ఐడీ పార్టీ సిబ్బంది బాల్‌రెడ్డి, వేణుగోపాల్, శ్రీనివాస్, మల్లేశంలను సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ అభినందించారు. ఐడీ పార్టీ సిబ్బంది రివార్డులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement